వీసీ ప్రసాదరెడ్డి.. వైసీపీలో చేరితే బెటర్..!

తెగించినోడికి తెడ్డే లింగం.. బరి తెగించినోడికి బ్రేకే ఉండదు.. ఇలా ఎన్నయినా చెప్పుకోవాలనిపిస్తోంది కొందరికి. ఒక ఉన్నతమైన పదవిలో ఉండి.. ఓపెన్ గా రాజకీయాలు చేస్తుంటే.. చర్యలు తీసుకోవాల్సినవారే చెట్టపట్టాలేసుకుని తిరుగుతుంటే.. ఇక ఈ నిబంధనలు ఎందుకు? ఈ రాజ్యాంగం ఎందుకు? అవి కూడా మార్చేసుకుంటే పోలా.. అనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఓటు వేసే హక్కు ఉన్నా.. అది పోస్టల్ బ్యాలెట్ ద్వారానే వేసుకోవాలి. నేరుగా వారు వచ్చి పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయరు. ఎందుకంటే వారు ఎన్నికల ప్రక్రియను నిర్వహించాల్సిన వాళ్లు. 

వీరు ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండకూడదు.. ఉంటే..ఆ ప్రభావం ప్రజలపై ఉంటుందని.. అధికారం ఉన్నవీరు అలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుందనే ఆ నిబంధన పెట్టారు. గతంలో ఏదైనా రాజకీయ పార్టీ జెండు పట్టుకున్నా ఉద్యోగం పోతుందనే భయం ఉంది. కాని పరిస్ధితులు మారిపోయాయి. ఇప్పుడు బహిరంగంగా జెండా పట్టుకోకపోయినా..మాటల్లోనే వారు ఎవరివైపో అర్ధమయ్యేలా చెబుతున్నారు. లేటెస్టుగా ఆ తెగింపు బరితెగింపుగా మారింది. ఓపెన్ గా రాజకీయపార్టీల నేతలతోనే తిరిగేస్తూ..వారికి బహిరంగంగా మద్దతు ప్రకటిస్తున్నారు.

ఆంధ్రా యూనివర్శిటీ వీసీ ప్రసాదరెడ్డి. సార్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. అయినా డోంట్ కేర్ అంటున్నారు. ఎందుకంటే ఆయన కోసం కేర్ తీసుకునే పెద్దలున్నారు. ఇదే ఇప్పుడు క్యాంపస్ లో వినపడుతున్న మాట. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రకు సామంతరాజులా వ్యవహారం చేస్తున్నారనే టాక్ ఎటూ ఉంది. అలాంటి కీలక నేత బర్త్ డే వేడుకలను యూనివర్శిటీ క్యాంపస్ లో అది కూడా తన చాంబర్ లో జరిపారు ప్రసాదరెడ్డి. ఆయన ఒక వైస్ ఛాన్సలర్ అయి ఉండి కూడా దగ్గరుండి కేక్ కట్ చేయించి.. బర్త్ డే గ్రాండ్ గా నిర్వహించారు. ఆయనొక ప్రభుత్వ ఉన్నత పదవిలో ఉండి.. అది కూడా విశ్వవిద్యాలయం హెడ్ గా ఉండి కూడా ఇలా వ్యవహరించారంటే.. ఆయన ఈ విషయంలో అసలు ఫీలే కావటం లేదని అర్ధమవుతోంది. బహుశా ఆయన ఒక ఎంపీ బర్త్ డే జరపడంలో తప్పేంటని దబాయించొచ్చు.

ఇలా చేయడం సార్ కి కొత్త కాదు. గతంలో స్థానిక ఎన్నికలప్పుడు రెడ్డి కులస్తుల సమావేశం నిర్వహించారు వైసీపీ నేతలు. అది కూడా ఎంపీ విజయసాయిరెడ్డి ప్లానింగ్ లోనే జరిగింది. ఆయన ఆధ్వర్యంలోనే ఈ సమావేశం జరిగింది. రెడ్లు అందరూ వైసీపీకే ఓటేయాలని..అక్కడకు హాజరైనవారంతా వేయించాలని విజయసాయిరెడ్డి పిలుపు ఇచ్చారు. ఆ పిలుపు ఇచ్చేటప్పుడు ఆయన పక్కనే ఆంధ్రా యూనివర్శిటీ వీసీ ప్రసాదరెడ్డి ఉన్నారు. ఆయన కూడా జై కొట్టి.. చప్పట్లు కొట్టి సమావేశానికి వచ్చినవారిని ఉత్సాహపర్చారు. అప్పుడు ఆయన తనకు పదవి ఇప్పించినందుకు విజయసాయిరెడ్డికి లాయల్ గా ఉంటున్నారని అనుకున్నారు. అప్పుడు అది పెద్ద వివాదమే అయింది. ఇప్పుడు మళ్లీ అదే పని రిపీట్ చేయడమే కాక..ఏకంగా క్యాంపస్ లోనే ..తన చాంబర్ లోనే చేశారంటే..ఇక ఆయన ఈ విషయంలో ఎలాంటి రూల్స్ పట్టించుకోకూడదని ఫిక్స్ అయిపోయారన్నమాట. ఇక ప్రభుత్వం ఎటూ అస్మదీయులదే కాబట్టి..ఎటూ చర్యలు ఉండవు..ఇక విద్యార్ధులు, ప్రజలే చర్యలు తీసుకోవాలేమో.