ఏపీ ఎమ్మెల్యేలు ఇష్టపడటం లేదట
posted on Sep 4, 2015 11:46AM
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యల వల్ల ఏపీ పాలన వ్యవస్థ దాదాపు విజయవాడ నుండే సాగుతుంది. సీఎం చంద్రబాబు ఇక్కడ మూడు రోజులుంటే అక్కడ మూడు రోజులు ఉంటున్నారు. చాలా శాఖలు.. చాలా మంది నేతలు కూడా అక్కడికి తరలివెళ్లారు.. కానీ మొత్తం అక్కడికి తరలివెళ్లాలంటే కొంత సమయం పడుతుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ రాష్ట్ర విభజన కారణంగా ఏపీ ఎమ్మెల్యేలు.. వారికి కేటాయించిన క్వార్టర్లను వినియోగించుకోవటానికి సముఖత చూపించట్లేదట. హైదరాబాద్ లో ఏపీ ఎమ్మెల్యేల కోసం దాదాపు 200 క్వార్టర్లు కేటాయిస్తే అందులో కేవలం 50 నుంచి 60 క్వార్టర్లు మాత్రమే ఎమ్మెల్యేలు తీసుకోవటం విశేషం.
మరోవైపు దీనికి పలు కారణాలు కూడా ఉన్నాయంటున్నారు రాజకీయ వర్గాలు. ముఖ్యంగా ఏపీ పాలనా వ్యవస్థలో భాగంగా ఇప్పటికే చాలామంది అక్కడికి తరలివెళ్లడం వల్ల హైదరాబాద్ లో కార్యకలాపాలు తగ్గిపోవడం వల్ల ఎమ్మెల్యేలు క్వార్టర్లు తీసుకోవడానికి ఇష్టపడటం లేదని సమాచారం. అదీకాక విభజన వల్ల ఏపీ ఎమ్మెల్యేలు కేటాయించిన క్వార్టర్లు పాతవి కావడం.. తెలంగాణ ఎమ్మెల్యేలకు కేటాయించిన క్వార్టర్లు కొత్తవి కావడం కూడా ఒక కారణమంటున్నారు.
దీంతో ఏపీ ఎమ్మెల్యేలు హెచ్ ఆర్ అలవెన్స్ కింద ప్రతి నెలా వచ్చే రూ.25వేలుతో ఔటర్ రింగు రోడ్డుకు దగ్గరగా.. విజయవాడ ప్రయాణానికి అనువుగా ఉండేందుకు మణికొండ.. కూకట్ పల్లి.. బంజారాహిల్స్ లో ఫ్లాట్లు తీసుకొని ఉండటానికి సముఖత చూపుతున్నట్టు తెలుస్తోంది.