ఒకే అంశం...రెండు రకాల కధనాలు
posted on May 25, 2015 7:48PM
.jpg)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం పశ్చిమ గోదావరి జిల్లానే కాకుండా కర్నూలుపై కూడా దృష్టి కేంద్రీకరించాలని ఉపముఖ్యమంత్రి కేఈ. కృష్ణమూర్తి చేసిన విజ్ఞప్తిని పట్టుకొని ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించే ఒక పార్టీకి చెందిన మీడియాలో ‘ముఖ్యమంత్రితో ఉపముఖ్యమంత్రి డిష్యుం డిష్యుం’ అని హెడింగ్ తో హడావుడిగా ఓ కధనం ప్రచురించేసింది. అయితే అధికార పార్టీలో జరగరానిదేదో జరిగిపోతోందని వ్రాసేపడేసినప్పటికీ, తను ప్రచురించిన కధనం వలన చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించారని స్వయంగా ద్రువీకరించినట్లయిందని ఆలశ్యంగా గ్రహించి, మళ్ళీ మర్నాడు అంటే ఈరోజు సంచికలో ‘ఏమిటో ఈ మాయ’ అంటూ మరో కౌంటర్ కధనం ప్రచురించి చేతులు దులుపుకొంది. నిన్న పశ్చిమ గోదావరి జిల్లాను మాత్రమే అభివృద్ధి చేస్తునందుకు ముఖ్యమంత్రిపై ఉపముఖ్యమంత్రి ఆగ్రహం అంటూ ఏదేదో వ్రాసేసిన ఆ చేత్తోనే ఈరోజు పత్రికలో “పశ్చిమ గోదావరి జిల్లాను ఏ మాత్రం అభివృద్ధి చేయకపోయినా తెదేపా నేతలు అక్కడ ఏదో చాలా అభివృద్ధి జరిగిపోతోందన్నట్లు ప్రజలను మభ్యపెట్టడానికి మరో సరికొత్త డ్రామాకి తెర లేపారు” అంటూ కధనం ప్రచురించడం గమార్హం.
నిన్న వ్రాసిన కధనంలో అధికార పార్టీలో పెద్దపెద్ద గొడవలయిపోతున్నాయని అనే అంశంపై హైలైట్ చేసి, ఈరోజు జిల్లా అభివృద్ధి గురించి డ్రామా జరుగుతోందని వ్రాయడం మరెవరికీ సాధ్యం కాదేమో? ఈవిధంగా ప్రతీ అంశాన్ని కేవలం తన రాజకీయ కోణం నుండే ప్రజలకు చూపించడం ఎవరూ హర్షించరు. అద్దాల మేడలో కూర్చొని దారిన పోయే వాళ్ళ మీదకి రాళ్ళు విసురుతుంటే, దాని వలన చివరికి నష్టపోయేది అద్దాల మేడలో కూర్చొన్న వాళ్ళేనని గ్రహిస్తే చాలు.