పెళ్ళయిన మూడు రోజులకే...

 

అనంతపురం జిల్లాలో పెళ్ళయిన మూడు రోజులకే ఒక వ్యక్తి తన భార్యను గొంతుకోసి చంపేశాడు. తాను కూడా గొంతు కోసుకుని ప్రాణాపాయ స్థితిలో వున్నాడు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని నంద్యాల రోడ్డులో నివసించే ఫకీరప్ప (35) వివాహం అదే గ్రామానికి చెందిన విజయలక్ష్మి (18)తో మూడు రోజుల క్రితం జరిగింది. అయితే ఫకీరప్పకు ఈ వివాహం ఇష్టం లేకపోయినప్పటికీ పెద్దల బలవంతం వల్ల పెళ్లి చేసుకున్నాడు. అయితే బుధవారం ఉదయం ఈ నూతన దంపతులు ఎంతకీ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టి చూడగా ఇద్దరూ రక్తపు మడుగులో ఉన్నారు. ఈ ఘటనలో వధువు విజయలక్ష్మీ మరణించగా.. వరుడు ఫకీరప్ప పరిస్థితి విషమంగా ఉంది. అతనిని అనంతపురం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇష్టం లేని పెళ్లి చేసినందుకే ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఇరు కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.