కౌలు రైతుల్ని కాపాడండయ్యా...
posted on Nov 3, 2015 9:43AM

ఆంధ్రప్రదేశ్‌కి అమరావతి లాంటి అందమైన రాజధాని, గొప్ప రాజధాని, అద్భుతమైన రాజధాని రూపొందబోతోంది. ఓకే... రాజధాని నిర్మాణం కోసం ఆ ప్రాంత రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ భూములు ఇచ్చారు... డబుల్ ఓకే.. ఈ ప్రాంతంలో రాజధాని రావడం, తమ భూములకు మంచి డిమాండ్ రావడం రైతులందరికీ సంతోషాన్ని కలిగిస్తోంది.. ట్రిపుల్ ఓకే... అయితే అమరావతి రాజధాని కావడం అందరికీ సంతోషాన్ని కలిగిస్తోందని అనుకోవడమే పొరపాటు. ఒక కంట పన్నీరు వున్నప్పటికీ మరో కంట కన్నీరు వస్తోంది. రైతులు సంతోషంగా వున్నారు. కానీ, మూడు పంటలు పండే ఈ ప్రాంతంలో రెక్కల కష్టాన్ని నమ్ముకున్న కౌలు రైతులు, కూలీలు మాత్రం తమ భవిష్యత్తు ఏమిటో తమకే అర్థం కాక అయోమయ పరిస్థితిలో వున్నారు. భవిష్యత్తు మీద భయం వీరిని క్రుంగదీసింది. ప్రభుత్వం ఇస్తున్న సహాయం వీరిలో ధైర్యాన్ని నింపలేకపోతోంది. ఆ అధైర్యం ఆత్మహత్యల రూపంలోకి మారుతోంది.
రాజధాని ప్రాంతంలో ఇటీవలి కాలంలో పలువురు కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం చాలా బాధాకరమైన విషయం. ఎంతోమందికి ఎన్నో విషయాలలో భరోసాను కలిగిస్తోన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలు రైతులు, కూలీల విషయంలో మాత్రం ఎందుకు సమర్థంగా పనిచేయలేకపోతోందో, వారిలో ధైర్యాన్ని ఎందుకు కలిగించలేకపోతోందో అర్థం కావడం లేదు. రాజధాని నగర నిర్మాణం పూర్తయిన తర్వాత భవిష్యత్తులో సాధించే విజయాలకు సంబంధించిన కలలు కనడం కాస్తంత తగ్గించి, వాస్తంలో జరుగుతున్న దారుణాలను ఆపే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. రాజధాని ప్రాంతంలో కౌలు రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలను నివారించడానికి చర్యలు తీసుకోవాలి. లేకపోతే అలాంటి నిర్భాగ్యుల సమాధుల మీద రాజధాని పునాదులు కట్టిన అపఖ్యాతి మిగులుతుంది.