అమరావతిలో ఆత్మీయ స్నేహితుడ్ని కలుసుకున్న కేసీఆర్
posted on Oct 23, 2015 8:26AM

అమరావతి శంకుస్థాపనకు హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఏపీ ప్రభుత్వం నుంచే కాకుండా తెలుగుదేశం నేతల నుంచి కూడా అపూర్వ స్వాగతం లభించింది. టీడీపీలో ఉండగా కలిసి పనిచేసిన నేతలంతా కేసీఆర్ ను కలిసి తమ సంతోషాన్ని పంచుకున్నారు, ఎన్నాళ్లకు కలిశామంటూ పాత రోజులను గుర్తుచేసుకున్నారు.
ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలుసుకోవడంపై ఎంతో ఉద్వేగానికి గురయ్యారు, ఇద్దరూ ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని ఆలింగనం చేసుకున్న కోడెల, కేసీఆర్ లు... ఎన్నిరోజులకు కలిశామంటూ గత స్వ్మతులను నెమరవేసుకున్నారు. తామిద్దరం ఆత్మీయ స్నేహితులమంటూ అక్కడున్నవారందరికీ పరిచయం చేసుకున్నారు.
ఈ సందర్భంగా కోడెల నియోజకవర్గం సత్తెనపల్లిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కేసీఆర్ అడిగితెలుసుకున్నారు, ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులంతా సత్తెనపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి చర్చించుకుంటున్నారని కేసీఆర్ ప్రశంసించారు. అయితే శంకుస్థాపన హడావిడి కారణంగా ఎక్కువసేపు మాట్లాడుకునే అవకాశం లేకపోవడంతో... హైదరాబాద్‌లో కలిసేందుకు సమయం ఇవ్వాలని కోడెలను కేసీఆర్ కోరారు.