ఢిల్లీకి మళ్లీ మళ్లీ.. అందుకేనా?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ ఢిల్లీ వెళుతున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళడం విశేషం కాదు కానీ, ఎందుకు  వెళుతున్నారు అనేది మాత్రం ఆయన ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా, ఒక ప్రశ్నగా పైకి వస్తూనే వుంది. ఈసారి కూడా అదే ప్రశ్న ప్రముఖంగా వినిపిస్తోంది. నిజానికి, ఈ నెల 30న ఢిల్లీలో భారత ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన జరిగే జ్యుడిషీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో పాల్గొనేందుకు, జగన్మోహన్ రెడ్డి  ఆరోజు ఢిల్లీ వెళ్ళవలసి వుంది. ఈ సదస్సుకు ప్రధాని మోదీ, సీజేఐ ఎన్వీ రమణతో సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు హాజరుకానున్నారు. దేశంలో న్యాయ, మౌలిక సదుపాయాల కల్పన, కేసుల సత్వర పరిష్కారంపై సదస్సులో ప్రధానంగా చర్చ జరుగుతుంది. 

అయితే, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సదస్సుకు ఒక రోజు ముందుగానే ఢిల్లీ వెళ్లి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ముఖ్యమంత్రి ముందుగా ఢిల్లీకి పయనం అవడంతో, ఎందుకోసం అనే ప్రశ్న మరోసారి ముందుకొచ్చింది. అయితే ఎప్పటిలానే ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి ఢిల్లీ వెళుతోంది అందుకోసమే.. అప్పులకు అనుమతి కోసమే అని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మరీనా నేపద్యంలో పరిధిని దాటి అప్పులు చేయక తపప్ని పరిస్థితి ఎదురైందని ఆర్థిక శాఖ వర్గాలు తెలియచేస్తున్నాయి.  

అయితే, ముఖ్యమంత్రి కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వం ఏమి చెప్పినా,ముఖ్యమంత్రి ప్రధానంగా రాష్ట్రంలో అర్దిక పరిస్థితులు,కేంద్రం సహకారం అంశం పైనే చర్చిస్తారని అధికార వర్గాల సమాచారంగా ఉందని అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఈనెల (ఏప్రిల్) మొదటి వారంలో ఒక సారి ఢిల్లీ వెళ్ళారు. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశ మయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ప్రధాన మంత్రి ప్రత్యేకంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని సమీక్షించిన నేపధ్యంలో జరిగిన ఆ సమావేశంలో ప్రదాని మోడీ, రాష్ట్ర ఆర్థిక, అప్పుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేయడంతో పాటుగా, కఠిన నిర్ణయాలు సూచించినట్లు వార్తలొచ్చాయి. అయితే, ఈ నెల రోజుల్లో జగన్ రెడ్డి ప్రభుత్వ ఆర్థిక దృక్కోణంలో, మార్పు వచ్చిన దాఖలాలు లేవు.  

ఈ నేపధ్యంలో మళ్ళీ మరో మారు, ముఖ్యమంత్రి ఢిల్లీ వెళుతున్నారు అంటే, సహజంగానే, గత సమావేశానికి కొనసాగింపు గానే  రేపటి సమావేశం ఉంటుందా, అనే సందేహాలు వినవస్తున్నాయి. ఇలా నెల రోజుల సమయంలోనే ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి మరోసారి సమావేశం కానుండటంతో ఈ పర్యటన ఆసక్తి కరంగా మారింది. ముఖ్యంగా, కేంద్ర ప్రభుత్వం, మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇప్పటికే అద్వాన్న స్థితికి చేరుకున్నరాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు కఠిన చర్యలు సూచించే అవకాశం ఉందని అదికార వర్గాల సమాచారంగా తెలుస్తోంది. అయితే, ముఖ్యమంత్రి మాత్రం అప్పులు చేసైనా, నోట్లు పంచి ఓట్లు దండుకునే ధోరణిలోనే ఉన్నారని అంటున్నారు. తాజాగా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్ల్యేలు, పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలోనూ ఇప్పటికే ప్రజలకు రూ.1.37 వేల కోట్లు పంచాం, ఇంకో రూ. లక్ష కోట్ల వరకు పంచేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. అంతే కాదు, ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు  పంచిన తర్వాత 175 కు 175 అసెంబ్లీ సీట్లు ఎందుకు రావని, ధీమా వ్యక్త చేశారు. అంటే, నోట్లు పంచి, ఓట్లు దండుకునే ఆలోచన నుంచి ముఖ్యమంత్రి ఒక్క అంగుళం కూడా పక్కకు రాలేదు. మరి ప్రధాన మంత్రి, ఈ పంపకాల ఎన్నికల రాజకీయానికి ఆమోదం తెలుపుతారా .. అప్పు పద్దు పెంచుకునేందుకు అనుమతిస్తారా, అనేది ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న.