వైఎస్ షర్మిల పాదయాత్ర రూట్ మ్యాప్
posted on Oct 15, 2012 2:33PM
.jpeg)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో షర్మిల పాదయాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ ను ప్రకటించారు. ఈ నెల 18వ తేదీన ఇడుపులపాయ నుంచి ఫర్మిల పాదయాత్రను ప్రారంభిస్తారు. అదే రోజు ఇడుపులపాయలో భారీ బహిరంగ సభ ఉంటుంది. ప్రతి రోజు ఆమె 18 కిలోమీటర్ల మేర సాగిస్తారు. ఆ రకంగా ఆమె పాదయాత్ర ఆరు నెలలు అవిశ్రాంతంగా సాగుతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఆమె పాదయాత్ర ముగుస్తుంది. తొలి ఐదు రోజుల షెడ్యూలును పార్టీ కార్యాలయం ప్రకటించింది. తొలు రోజు ఉదయం 11 గంటలకు బహిరంగ సభ అనంతరం షర్మిల వీరన్నగట్టుపల్లె, కుమ్మరాంపల్లె, వేంపల్లె నుంచి నాలుగు రోడ్ల కూడలి, రాజీవ్ నగర్ కాలనీ వరకు పాదయాత్ర చేస్తారు. రెండో రోజు రాజీవ్‌నగర్ కాలనీ నుంచి నందిపల్లె, తాళ్లపల్లె, దుగ్గన్న పల్లె, అమ్మయ్యగారి పల్లె, చాగలేరు క్రాస్, వి కొత్తపల్లె, గొందిపల్లె క్రాస్, వేముల, భూమయ్యగారి పల్లె క్రాస్ వరకూ వెళతారు. మూడో రోజు అక్కడి నుంచి వేల్పుల, బెస్తవారిపల్లె, పులివెందుల ఆర్టీసీ బస్టాండ్, పూల అంగళ్ల మీదుగా పార్నపల్లె రోడ్డు, రింగురోడ్డు సర్కిల్ నుంచి వైయస్సార్ గృహానికి వెళతారు. నాలుగో రోజు పులివెందుల రింగ్‌రోడ్డు నుంచి చిన్న రంగాపురం, ఇప్పట్ల, చిన్న కుడాల క్రాస్, పెద్ద కుడాల క్రాస్, లింగాల, లోపట్నూతల క్రాస్ వరకూ పాదయాత్ర చేస్తారు. ఐదో రోజున కర్ణపాపయ్య పల్లె, వెలిదండ్ల, నేర్జాంపల్లె, పార్నపల్లె వరకూ యాత్ర కొనసాగుతుంది. ఆ తరువాతి యాత్ర వివరాలు తదుపరి వెల్లడిస్తారు.