తమిళనాట మళ్లీ జయలలిత!
posted on Mar 3, 2016 8:58AM
.jpg)
తమిళనాడులో ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల తేదీలు ప్రకటించడమే ఆలస్యం, హామీలతో మోత మోగించేందుకు పార్టీలన్నీ సిద్ధంగా ఉన్నాయి. తమిళ ప్రజలు చాలా ఉదారులు! డి.ఎం.కె, అన్నా డి.ఎం.కె... ఈ రెండు పార్టీలకీ వాళ్లు సరిసమానంగా అవకాశాలు ఇస్తూ ఉంటారు. అందుకే ఒక దఫా డి.ఎం.కె అధికారంలో ఉంటే, మరో దఫా అన్నా డి.ఎం.కె చెన్నై పీఠాన్ని చేజిక్కించుకుంటుంది. ఐదేళ్లపాటు ఓ పార్టీని నెత్తినెక్కించుకున్న ఓటర్లు, మళ్లీ ఎన్నికలు రాగానే అదే పార్టీని నేలకేసి కొడుతూ ఉంటారు. కానీ పరిస్థితులు చూస్తుంటే ఈసారి ఆ సంప్రదాయం మారేట్లు కనిపిస్తోంది.
డి.ఎం.కే కురువృద్ధుడు కరుణానిధికి ఇప్పుడు 91 సంవత్సరాలు. గత పదేళ్లుగా ఆయన కుర్చీకే అంకితమై ఉన్నారు. చెప్పుకోవడానికి నలుగురు కొడుకులు ఉన్నా వారిలో స్టాలిన్, అళగిరులకు తప్ప మిగతావారికి అంతగా రాజకీయ చతురత లేదు. మధురైలో తిరుగులేని నేతగా ఉన్న అళగిరి దాతృత్వానికంటే, దాష్టీకానికే ఎక్కువ ప్రసిద్ధి. అందుకే కరుణానిధి అళగిరికంటే చిన్నవాడైన స్టాలిన్‌కే అధిక ప్రాధాన్యతని ఇచ్చేవారు. గత ప్రభుత్వ హయాంలో స్టాలిన్‌ను ఉపముఖ్యమంత్రిగా కూడా నియమించారు. ఇక కరుణానిధి వారసుడు స్టాలినే అంటూ వార్తలు గుప్పుమనడంతో, అళగిరి తనదైన శైలిలో ఆందోళనలను నిర్వహించారు. దాంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈసారి కరుణానిధి మళ్లీ ముఖ్యమంత్రి బాధ్యతలను స్వీకరించే పరిస్థితుల్లో లేరు కాబట్టి, డిఎంకే తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా స్టాలిన్‌ను ప్రజలు ఏమాత్రం అంగీకరిస్తారన్నది చూడాలి.
మరోపక్క 2011 అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకేకు తోడుగా ఉండి, ఆ తరువాత విడాకులు పుచ్చుకున్న విజయ్‌కాంత్ పరిస్థితి కూడా ఏమంత గొప్పగా లేదు. 2005లో డిఎండీకే పేరుతో పార్టీని ప్రజలు తనని ఆదరించేందుకు ఓపికగా ఎదురుచూసిన విజయ్‌కాంత్, తరువాతి కాలంలో తన అసహనాన్ని కూడా జనానికి రుచి చూపించడం మొదలుపెట్టారు. మీడియా మీదా, కార్యకర్తల మీదా, ఆఖరికి పార్టీ సహచరుల మీదా విజయ్‌కాంత్ తరచూ నోరు పారేసుకుంటూ ఉంటారని ఓ అపవాదు. మైకంలో వింతగా ప్రవర్తిస్తున్నట్లు కనిపించే ఆయన వీడియోలు కూడా యూట్యూబ్లో హల్‌చల్ చేస్తూ ఉంటాయి. కారణమేదైతేనేం, 2011 ఎన్నికలలో 29 మంది ఎమ్మెల్యేలను సాధించిన ఆ పార్టీ నుంచి ఏకంగా ఎనిమిదిమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో, డిఎండికెకు ఒక్కసారిగా గాలితీసినట్లు అయిపోయింది.
ఇక మిగిలిందల్లా అన్నాడిఎంకె! 2011లో ల్యాప్‌టాప్‌లు మొదలుకొని మిక్సీల దాకా ఉచితంగా అందిస్తామని హామీలు గుప్పిస్తూ అధికారంలోకి వచ్చిన అమ్మ, ఎలాగొలా ఈ ఐదేళ్లు లాగించేసిందన్న వాదన వినిపిస్తోంది. పార్టీ సహచరులు ఆమె పట్ల చూపించే వీర విధేయతా, వరదల్లో అందించే ఆహారపొట్లాల మీద సైతం అమ్మ బొమ్మని ముద్రించే వీరభక్తిని చూసి సోషల్ మీడియాలో జనం తెగ నవ్వుకున్నా... తమిళనాట ఇప్పటికీ తిరుగులేని మహిళానేత జయలలితేనన్నది వాస్తవం.
పైగా ప్రస్తుత పార్లమెంటు సమావేశాలని గమనిస్తుంటే, ఎన్నికల నేపథ్యంలో అన్నాడిఎంకే చాలా తెలివిగా పావులు కదుపుతున్న విషయం అర్థమవుతుంది. 2011 ఎన్నికలలో డిఎంకె ఘోర పరాజయం కావడానికి ఒకానొక కారణమైన 2G స్కాంను తిరిగి అన్నాడిఎంకె లేవనెత్తుతోంది. కరుణానిధి ముద్దుల కుమార్తె కనిమొళి రాజకీయ జీవితానికి ఇంచుమించు ఫుల్‌స్టాప్ పెట్టిన ఆ కుంభకోణాన్ని ఇప్పుడు మళ్లీ తవ్వుతోంది. కాకపోతే ఈసారి చిదంబరం పాత్రని కూడా ఇందులో రుజువు చేసేందుకు ప్రయత్నిస్తోంది. తద్వారా డిఎంకేను, రానున్న ఎన్నికలలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోనున్న కాంగ్రెస్‌నూ ఒకేసారి ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఒకప్పుడు జయలలితను ఉక్కిరిబిక్కిరి చేసిన అక్రమార్జన కేసులు కూడా ప్రస్తుతం నిద్రాణంగా ఉన్నాయి. కాబట్టి ఎటు చూసిన జయ విజయానికి శుభసంకేతాలే కనిపిస్తున్నాయి.