అభివృద్ధి మంత్రం పఠిస్తున్న తెలుగు రాష్ట్రాలు
posted on Jun 1, 2015 12:36PM
ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు ఏర్పడి రేపటికి ఒక సంవత్సరం పూర్తవుతుంది. రేపటి నుండి వారం రోజులపాటు రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించుకొనేందుకు తెరాస ప్రభుత్వం సిద్దపడుతుంటే, ప్రజల అభీష్టానికి విరుద్దంగా రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఏర్పడిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ముందు ఉన్న అనేక సవాళ్ళను ఎదుర్కొనేందుకు ప్రజలందరినీ రాష్ట్రాభివృద్ధి కోసం కార్యోన్ముకులను చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుండి వారం రోజుల పాటు నవ నిర్మాణ దీక్ష చేప్పట్టబోతోంది. రెండు ప్రభుత్వాలు ఎంచుకొన్న మార్గాలు వేరయినా వాటి అంతిమ లక్ష్యం మాత్రం రాష్ట్రాల పునర్నిర్మాణమే. రెండు రాష్ట్రాలకు ప్రత్యేకమయిన సమస్యలు, వనరులు ఉన్నాయి.
ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణా రాష్ట్రం ఆర్ధికంగా చాలా బలంగా ఉంది. అదేవిధంగా ఆ రాష్ట్రానికి అపారమయిన మానవ వనరులు కూడా ఉన్నాయి. అన్ని విధాల అభివృద్ధి చెంది రాష్ట్రానికి అక్షయపాత్ర వంటి హైదరాబాద్ నగరం రాజధానిగా ఉంది. కానీ తీవ్ర విద్యుత్ లోటు, వ్యవసాయానికి తగినంత నీటి వసతి లేకపోవడం, రాష్ట్రంలో మిగిలిన జిల్లాలు వెనుకబడి ఉండటం వంటి కొన్ని తీవ్ర సమస్యలు కూడా ఉన్నాయి. వాటిని అధిగమించేందుకు తెలంగాణా ప్రభుత్వం చాలా తీవ్రంగా కృషి చేస్తోంది. బహుశః రానున్న నాలుగేళ్లలో ఈ సమస్యలకు పరిష్కారం లభించవచ్చును. తెరాస ఏడాది పాలనకు ప్రతిపక్షాలు అత్తెసరు మార్కులేసినప్పటికీ తెలంగాణా ప్రజలు మంచి మార్కులే వేస్తున్నారు. కనుక అది సరయిన దిశలోనే పయనిస్తోందని భావించవచ్చును.
ఇక ఆంద్రప్రదేశ్ రాష్ట్రం తను చేయని నేరానికి బలయిపోయిందని చెప్పవచ్చును. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు చేయడాన్ని ఎవరూ తప్పుపట్టకపోయినా, ఆకారణంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఇటువంటి దుస్థితి కలగడం ప్రజలెవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. తీవ్ర ఆర్ధిక సమస్యలు ఒక పక్క పీడిస్తున్నప్పటికీ వేల కోట్లు వ్యయమయ్యే రాజాధానిని అత్యవసరంగా నిర్మించుకోవలసివస్తోంది. కానీ రాష్ట్రానికి మంచి సారవంతమయిన నీటి సౌకర్యం కలిగిన పంట భూములు విస్తారంగా ఉండటం, అదే విధంగా సువిశాలమయిన సముద్ర తీరం, అపారమయిన మానవ వనరులు, విశాఖ, విజయవాడ, నెల్లూరు, తిరుపతి వంటి అభివృద్ధి చెందిన నగరాలు కలిగి ఉండటం కూడా రాష్ట్రానికి చాలా కలిసి వచ్చే అంశమేనని చెప్పవచ్చును.
కనుక వీలయినంత త్వరగా రాజధాని నిర్మాణం, పారిశ్రామిక అభివృద్ధి జరిగినట్లయితే మరొక మూడు నాలుగేళ్లలోనే రాష్ట్రం పూర్తిగా కోలుకొనే అవకాశం ఉంటుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ రెంటిమీదే ప్రధానంగా తన దృష్టి కేంద్రీకరిస్తోందని చెప్పవచ్చును. కానీ రాజధాని నిర్మాణానికి నిధుల కొరత కంటే ప్రతిపక్షాలు సృష్టిస్తున్న అవరోధాలే పెద్ద సమస్యగా మారింది. అదేవిధంగా ఏడాది కాలం గడిచిపోయినా రాష్ట్రానికి ఇంతవరకు ప్రత్యేక హోదా మంజూరు చేయకపోవడం వలన రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో విలువయిన ఒక ఏడాది సమయం చేజారిపోయింది. కానీ త్వరలోనే ప్రత్యేక హోదాపై ఒక ప్రకటన చేస్తానని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న తాజా హామీ మళ్ళీ ఆశలు చిగురింపజేస్తోంది. ప్రత్యేక హోదా మంజూరు చేసినట్లయితే చాలా వేగంగా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృధి జరిగి తద్వారా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగుపడవచ్చును.
రాష్ట్ర అభివృద్ధి కోసం తెదేపా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ప్రజల నుండి కూడా మంచి స్పందనే వస్తోంది. బహుశః రెండు తెలుగు రాష్ట్రాలు వచ్చే నాలుగేళ్లలో ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించి, మంచి అభివృద్ధి సాధించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.