ప్రత్యేక హోదా కల త్వరలోనే సాకారం కాబోతోందా?
posted on May 30, 2015 12:11PM
కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాద్ సింగ్ నిన్న డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయం గురించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకొంటామని తెలిపారు. “ప్రత్యేక హోదాతో సహా రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలను తమ ప్రభుత్వం ఖచ్చితంగా అమలుచేస్తుందని, ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశంపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని” బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ప్రకటించడం గమనిస్తే త్వరలోనే కేంద్రం ఖచ్చితంగా ఒక నిర్దిష్టమయిన ప్రకటన చేస్తుందనే నమ్మకం కలుగుతోంది.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ‘ప్రత్యేక హోదా’ ఇవ్వాలని కోరుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు పోరాటాలు చేస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర విభజనతో రాష్ట్రంలో కోలుకోలేని విధంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రత్యేక హోదా అంశం పట్టుకొని పోరాడుతూ మళ్ళీ రాష్ట్రంలో బలం పుంజుకోవాలని చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. కానీ అది చేస్తున్న పోరాటాలు నిజమయినవి కావని, కాంగ్రెస్ ఉనికిని, ఆ పార్టీ నేతల రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే చేస్తున్నవని ప్రజలందరికీ తెలిసినందునే దానిని పట్టించుకోవడం లేదు.
కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆలశ్యం చేసినట్లయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ బలపడే అవకాశం ఉంటుంది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని కలలుగంటున్న బీజేపీ అప్పుడు మిగిలిన పార్టీలతో బాటు కాంగ్రెస్ పార్టీని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ ఒకవేళ మోడీ ప్రభుత్వం త్వరలోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినా కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ పోలవరం ప్రాజెక్టును పట్టుకొని కేంద్రంపై తన పోరాటం కొనసాగించవచ్చును.
ఇక ఏదో ఒకనాడు బీజేపీతో జతకట్టాలనే ఆలోచనతోనే వైకాపా ఈ ప్రత్యేక హోదా, మిగిలిన హామీల గురించి గట్టిగా మాట్లాడటం లేదనే విషయం పెద్ద రహస్యమేమీ కాదు. కానీ బీజేపీతో తమ పార్టీతో జత కట్టే అవకాశం లేదని గ్రహించిన మరుక్షణం వైకాపా కూడా ప్రత్యేక హోదాతో సహా రాష్టానికి ఇచ్చిన అన్ని హామీలపై కూడా ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలదీయడం ఖాయం. అప్పుడు ప్రజలలో బీజేపీ, ఎన్డీయే ప్రభుత్వాలపై వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉంటుంది.
ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉంటూ బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న కారణంగా తెదేపా ప్రతిపక్షాలతో కలిసి పోరాటాలు చేయలేదు కనుక నేరుగా కేంద్ర ప్రభుత్వంపై చాలా ఒత్తిడి తెస్తోంది. ఈ విషయంలో జరుగుతున్నఆలశ్యం వలన అధికార తెదేపాపై కూడా క్రమంగా ఒత్తిడి పెరుగుతోంది. ఆ కారణంగానే అది కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తోంది. ఒకవేళ ఇంకా ఆలశ్యం జరిగినట్లయితే తెదేపా, బీజేపీలు రెండు కూడా ప్రజలకు జవాబు చెప్పుకోవడం చాలా కష్టమవుతుంది. కానీ ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం కనుక తెదేపా కంటే బీజేపీకే ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం ఉంది. బహుశః అందుకే ఇంతవరకు ప్రత్యేక హోదాపై కొంచెం ఊగిసలాడిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దాని గురించి సానుకూలంగా మాట్లాడుతోంది.
కానీ ప్రత్యేక హోదా కోసం అనేక రాష్ట్రాలు అనేక ఏళ్లుగా పోరాడుతున్నాయి. తమిళనాడు, ఓడిషా,కర్నాటక వంటి ఇరుగుపొరుగు రాష్ట్రాలు ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని కేంద్రాన్ని గట్టిగా కోరుతున్నాయి. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అవసరమయిన అర్హతలు రాష్ట్రానికి లేవని 14వ ఆర్ధిక సంఘం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకారం తెలపవలసి ఉంటుంది. వారివారి రాష్ట్రాలలో రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కొందరు అభ్యంతరం చెప్పవచ్చు లేదా తమకీ ఇమ్మని మెలిక పెట్టవచ్చును. ఎన్డీయే ప్రభుత్వం ఈ సమస్యలను అన్నిటినీ అధిగమించగలిగితే తప్ప రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదు. కనుక ప్రత్యేక హోదా ఇస్తానని ఖచ్చితంగా ప్రకటించకుండా త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకొంటామని చెపుతోంది.
ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యంకానట్లయితే అందుకు ప్రతిగా రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి భారీ ఆర్ధిక ప్యాకేజీ, రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి అవసరమయిన సబ్సీడీలు, ఆకర్షణీయమయిన ప్రోత్సాహకాలు ప్రకటింస్తుందేమో? ఇంకా ఈ అంశాన్ని నాన్చడం వలన తమకే నష్టం జరిగే ప్రమాదం ఉందనే ఆలోచనతోనే ఇక ఏదోవిధంగా ఈ సమస్యను పరిష్కరించాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించుకొని ఉండవచ్చును. ఇప్పటికే విలువయిన ఒక సంవత్సర కాలం గడిచిపోయింది. కనుక ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాకు తీసిపోని విధంగా ఏదయినా ప్రకటిస్తే దానిని వ్యతిరేకించకుండా స్వీకరించడమే రాష్ట్రానికి మేలు చేకూర్చుతుంది.