విరేచనాలు

1. ఆహారం తిన్న కొన్ని గంటలకే విరేచనాలు మొదలయ్యాయా?

ఆహారం విషతుల్యమవడం (ఫుడ్ పాయిజనింగ్)

2. మీతోపాటు మీ ఇరుగు పొరుగు వారికి కూడా విరేచనాలవుతున్నాయా?

కలరా/అతిసారం (గ్యాస్ట్రోఎంటిరైటిస్ / డయేరియా)

3. విరేచనాలను మలబద్దకం అనుసరిస్తూ ఉంటుందా?

ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్

4. అల్లోపతి మందులేవన్నా వాడుతున్నారా?

మందుల దుష్ఫలితాలు

5. విరేచనాలతో పాటు జ్వరం కూడా వస్తుందా?

కడుపులో పురుగులు / సూక్ష్మక్రిములు

6. ఏదయినా ఒక ప్రత్యేకమైన పదార్ధం తిన్న తరువాతనే విరేచనాలవుతాయా?

ఫుడ్ ఎలర్జీ

7. మీకెప్పుడూ శరీరంలోపల సెగలూ పొగలూ వస్తున్నట్లు అనిపిస్తుంటుందా? బరువు కూడా కోల్పోతున్నారా?

థైరాయిడ్ గ్రంథి చురుకుదనం పెరగడం హైపర్ థైరాయిడిజం

8. విరేచనాలతో పాటు కడుపునొప్పి కూడా ఉంటుందా? బరువు తగ్గుతున్నారా?

ఇన్ ప్లేవేటరీ బొవెల్ డిసీజ్

9. ఏదైనా ఆపరేషన్ చేసి, మీ పేగులలో కొంత భాగం తీసివేశారా?

శస్త్రచికిత్సానంతర సమస్యలు

10. మీ వయస్సు 50 దాటిందా? అలాగే కాలకృత్యాల రొటీన్ లో మార్పేదైనా వచ్చిందా?

క్యాన్సర్ అవకాశాలు

11. మలం దుర్గంధయుక్తంగా, జిగురుగా ఉంటుందా?

ప్యాంక్రియాస్ సమస్యలు

12. మీకు మధుమేహం ఉందా? మధుమేహవ్యాధి దుష్ఫలితాలు (డయాబెటిక్ కాంప్లికేషన్స్)

 

అతిగా స్రవించే స్వభావం కలిగినందువలన ఆయుర్వేదంలో విరేచనాలకు 'అతిసారం' అని పేరు. వ్యావహారికంగా కూడా ద్రవ రూప మలానికి ఇదే పేరు ఉంది. విరేచనాలు కొంతమందిలో పిలిస్తే పలుకుతాయి. అల్పమైనవిగా అనిపిస్తాయి. అలా అని అశ్రద్ధ చేస్తే, కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తాయి. అవగాహన లోపం, అపరిశుభ్రత, అల్పమైన జీవన ప్రమాణాలు - ఇవన్నీ అతిసారాన్ని ప్రబలేటట్లు చేస్తాయి.

 

మన దేశంలో ప్రతి రోజు కొన్ని లక్షల మంది - ముఖ్యంగా చిన్న పిల్లలు - ఈ సమస్యతో బాధపడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ నీరు శరీరం నుంచి వెళ్లిపోవడం వలన చూస్తుండగానే మృత్యువు కోరల్లోకి వెళ్లిపోతున్నారు. ఒక్కమన రాష్ట్రంలోనే ఏటా 52 వేల మంది పిల్లలు ఈ విధంగా మరణిస్తున్నారని అంచనా.

 

శరీరంలో తనకు సరిపడని శరీరేతర పదార్థాలను తన నుంచి బైటకు నెట్టివేయడానికి వివిధ పద్ధతులను ఎంచుకుంటుంది. వాటిలో విరేచనాలు ఒకటి. అందుకే విరేచనాలవుతున్నప్పుడు వాటిని బలవంతంగా ఆపడానికి ప్రయత్నించే బదులు విరేచనాల ద్వారా బైటకు వెళ్లిపోయే లవణాలను, ద్రవాంశాలనూ భర్తీ చేయడానికి ప్రయత్నించాలి. ఈలోగా శరీరం తనను తాను స్థిరపరచుకుంటుంది. దీర్ఘకాలం నుంచి విరేచనాల వుతున్నప్పుడు మాత్రం వీటిని గురించి బాగానే ఆలోచించాలి. విరేచనాల వల్ల అసౌకర్యంగా ఉండటమనే విషయాన్ని పక్కకు పెట్టినా, వీటి వెనుక ప్రమాదకరమైన కారణం ఉండటాన్ని పక్కకు పెట్టలేం. అందుకే అసలు విరేచనాలకు కారణం ఏమై ఉంటుందనేది తెలుసుకోవడం అవసరం.

 

1. ఆహారం విషతుల్యమవడం (ఫుడ్పాయిజనింగ్) ఏదైనా తిన్నతర్వాత విరేచనాలు మొదలైతే ఆహారం కలుషితమైందని అర్థం చేసుకోవాలి. విషాహారం వలన విరేచనాలు మొదలు కావడానికి రెండు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల వరకు పట్టవచ్చు. ఇక్కడ 'విషం' అంటే శరీరానికి హాని కలిగించే ఏ పదార్థామైన కావచ్చు. సరిగ్గా నిలువ చేయని ఆహార పదార్థాలు సైతం విషతుల్యంగా తయారవుతాయి. ఆహారం విషతుల్యమైనప్పుడు విరేచనాలతో పాటు కడుపులో వికారంగా ఉండటం, నోట్లో నీళ్ళూరడం, వాంతులు కావడం, కడుపులో నొప్పి పుట్టడం, చమటలు పోయడం వంటి లక్షణాలు కూడా కనిపించే అవకాశం ఉంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే శుభ్రమైన నీటినే ఉపయోగించాలి. పండ్లను, కూరగాయలను తినేముందు బాగా కడగాలి. మాంసాన్ని బాగా ఉడికించి తినాలి. నిల్వ ఉంచిన పదార్థాలను తినకూడదు, టీ, బియ్యం కడుగునీళ్ళు, చికెన్ సూప్, చిక్కుళ్ళ సూప్, తియ్యటి పానీయాలు తీసుకోవచ్చు, పిల్లల్లో తల్లిపాలు ఆపకూడదు, మిగల పండిన అరటి, బొప్పాయిలనూ, మెత్తగా ఉడికించిన అన్నాన్నీ తినవచ్చు.

గృహచికిత్సలు: ఒక లీటరు నీళ్లు (కూల్ డ్రింక్ పెట్ బాటిల్ తో కొలవండి, లేదా మూడు పెద్ద గ్లాసులు తీసుకోండి). మరగ కాచి చల్లార్చండి. దానికి తేనె లేదా పంచదారను (2 పెద్ద చెంచాలు) ఉప్పునూ (చిన్న చెంచాలో పావుభాగం), వంటసోడాను (చిన్న చెంచాలో అరభాగం), నారింజ రసాన్ని (అరకప్పు), నిమ్మరసాన్ని (పెద్ద చెంచాడు) కలపండి. ఈ పానీయాన్ని ప్రతి ఐదు నిమిషాలకు కొన్ని గుక్కల చొప్పున మూత్రం వచ్చేంతవరకు తాగుతుండాలి. ఇది పెద్దవారికి రోజుకు 3 లీటర్లు అవసరమౌతుంది. చిన్న పిల్లలకు రోజుకు 1 లీటరు సరిపోతుంది.

ఔషధాలు: లశునాదివటి, బిల్వాది చూర్ణం, దాడిమావలేహ్యం, మహాగంధక రసం, రాజవటి, సంజీవని వటి.

 

2. కలరా / అతిసారం (గ్యాస్ట్రోఎంటిరైటిస్ / డయేరియా) మూకుమ్మడిగా ఒకేసారి ఒక ప్రాంతంలోని వారినంతా విరేచనాలు, వాంతులు బాధిస్తున్నాయంటే దానిని "గ్యాస్ట్రో' గా భావించాలి. ఆహారం కలుషితమైనప్పుడు అయ్యే విరేచానాలకూ, గ్యాస్ట్రో కారణంగా అయ్యే విరేచనలకూ ఒక ప్రధానమైనతేడా ఉంటుంది. ఆహారం కలుషితమైనప్పుడు ఒక కుటుంబంలోని సభ్యులు మాత్రమే లేదా ఒక హాస్పిటల్ లోని విద్యార్థులు మాత్రమే విరేచనాలకు గురవుతారు. గ్యాస్ట్రోలో అలా కాదు, ప్రదేశాల వారీగా ఆయా ప్రాంతాల్లోని వారంతా విరేచనాలకు గురవుతారు. మన రాష్ట్రంలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంటుంది. దీనికి కారణం గ్యాస్ట్రోకి కారణమైన సూక్ష్మజీవులు, వర్షాలు పడిన తొలినాళ్ళలో ఎక్కువగా ముసిరే ఈగల ద్వారా వ్యాప్తి చెందడమే.

 

పెద్ద వారిలో కంటే పసిపిల్లలలో ఈ వ్యాధి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. రెండు మూడు సార్లు విరేచనాలైతే చాలు, పసిపిల్లలు తమ బరువులో ఒకటి నుంచి రెండు శాతాన్ని కోల్పోతారు. పసిపిల్లల బాలల్యంలో పదిశాతం సమయాన్ని విరేచనాలతోనే గడుపుతుంటారనడంలో అతిశయోక్తి లేదు. ఇది పోత పాల పిల్లలకు మరీ వర్తిస్తుంది. పాలు కలుషితం కావడం, పోతపాలు శరీరావసరాలకు తగిన విధంగా ఉండకపోవడం, పోతపాల పిల్లల మలం క్షారయుక్తంగా ఉండటం (మాములుగా ఆమ్లయుక్తంగా ఉండాలి) వంటివన్నీ విరేచనాలకు కారణమవుతాయి.

 

అలాగే పిల్లల శరీరంలో పెద్దవారికంటే ఎక్కువ నీళ్లు ఉంటాయి. (తులనాత్మక దృష్టితో చూస్తే), ఈ నీరు విరేచనాల ద్వారా వెళ్లి పోవడం వలన పిల్లలు త్వరగా డీలా పడిపోతారు. అంతేకాకుండా పిల్లల శరీరపు ఉపరితలం పెద్దవారికంటే రెండింతలు ఎక్కువ, అందుకే పెద్దవారికంటే పిల్లలలో రెండింతల నీరు అధికంగా వారి శరీరంనుంచి ఆవిరవుతుంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమొకటుంది. పసిపిల్లల కిడ్నీలు పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉండకపోవడం మూలాన మూత్రాన్ని పరిపూర్ణంగా వడకట్టలేవు. అలాగే రక్తంలోని యూరియా, ల్యాక్టేట్ లను సమర్థవంతంగా బైటకు పంపలేవు, దీంతో సమస్య మరీ జఠిలమవుతుంది. పైగా పిల్లలు తమంతట తాము దప్పికను తీర్చుకునే స్థితిలో ఉండరు కాబట్టి వీరిలో విరేచనాలు అపాయాన్ని కలిగిస్తాయి. ఇలాంటి వ్యాధులు ప్రబలుతున్నప్పుడు ఆహారం, తాగునీళ్ల విషయంలో పరిశుభ్రత పాటించడం అవసరం.


3. ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ విరేచనాలను మలబద్దకం అనుసరించి ఉందటమనేది ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ (ఐబిఎస్ ) వ్యాధి లక్షణం. ఈ వ్యాధిలో విరేచనాలతో పాటు కడుపు ఉబ్బరించినట్లు ఉండటం, కడుపులో పిసుకుతున్నట్లు నొప్పి రావడం, మల విసర్జన అసంపూర్ణంగా జరగడం వంటివి ఉంటాయి. మల విసర్జన అనేక మార్లు చేయాల్సి వస్తుంది. తీరా, చేసిన ప్రతిసారి కొద్దిగానే వస్తుంది. అదీ రిబ్బన్ లాగా వెడల్పుగా, పల్చగా ఉంటుంది. అనవసరమైన భయాందోళనలు ఉంటాయి. తరుచుగా కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. ఈ లక్షణాలన్నీ ఉదయం పూట మరీ ఎక్కువగా ఉంటాయి.

ఔషధాలు: ఆర్థ్రఖండావ లేహ్యం, అష్టాక్షరి గుటిక, బిల్వాది లేహ్యం, బిల్వాది గుటిక, చిత్రక గుటిక, లశునాది వటి, మహా గంధక రస పర్పటి (మహా గంధకం), పంచామృత పర్పటి, రస పర్పటి, శౌభాగ్య శుంఠి, గ్రహణీకపాట రసం.

 

4. మందుల దుష్ఫలితాలు: చాలా రకాల మందులకు విరేచనాలను కలిగించే నైజం సైడ్ ఎఫెక్ట్ గా ఉంటుంది. మన అన్న వాహికలో హానికరమైన బాక్టీరియాతో పాటు అరుగుదలకు సహాయం చేసే బాక్టీరియాకూడా ఉంటాయి. యాంటీబయాటిక్స్ వలన ఇవి కూడా నాశనమవుతాయి. దీనితో జీర్ణక్రియ అస్తవ్యస్థమై విరేచనాలవుతాయి. అదే విధంగా కడుపులో మంటకు వాడే యాంటాసిడ్స్, కొలెస్టరాల్ ను తగ్గించడానికి వాడే కొన్ని రకాల మందులు, క్యాన్సర్ లో వాడే మందులలో కొన్ని రకాలు, రేడియో థెరపి, షుగర్ వ్యాధిలో వాడే కొన్ని రకాల ఔషధాలు వీటన్నిటి వల్లా విరేచానాలయ్యే అవకాశం ఉంది. అల్లోపతి మందులు మీ విరేచనాలకు కారణమైతే వాటిని మానివేయడం మంచిది. లేని పక్షంలో వాటి మోతాదును సవరింపచేసుకోవడం మంచిది.

 

5. కడుపులో పురుగులు / సూక్ష్మక్రిములు విరేచనాలతో పాటు జ్వరం కనిపిస్తుంటే అది ఇన్ఫెక్షన్ ను సూచిస్తుంది. అమీబా, జియార్దియా, సాల్మనెల్లా వంటి సూక్ష్మజీవులు అన్నవాహిక పొరలను రేగేటట్లు చేస్తాయి. దీంతో వీటిని బైటకు నెట్టివేసే ప్రయత్నంలో స్రావాలు ఊరతాయి. ఇవి విరేచనాల రూపంలో బయల్వెడలుతాయి. ఇలాంటి సందర్భాలలో మలపరీక్ష చేయిస్తే లోపల ఏమున్నది - సూక్ష్మజీవులు ఉన్నాయా, లేక నులిపురుగులు వంటి పరాన్న జీవులు ఉన్నాయా అనేది తెలుస్తుంది.

గృహచికిత్సలు: 1. వేపాకుల రసం రెండు చెంచాలు మోతాదుగా అంతే తేనె కలిపి తాగాలి.

2. మోదుగమాడ నుంచి రసం పిండి రెండు చెంచాల మోతాదుగా మజ్జిగతో రెండు పూటలా తీసుకోవాలి.

3. కంపిల్లంను చిటికెడు తీసుకొని, బెల్లం కలిపి తీసుకోవాలి.

4. కురుసాని వాముకు (పావు చెంచాడు) బెల్లం (తగినంత) చేర్చి చన్నీళ్ళతో రోజుకు 2 సార్లు తీసుకోవాలి.

5. దానిమ్మ చెట్టు పట్టను వలచి కచ్చాపచ్చగా దంచి నీళ్లలో వేసి మరగించాలి, ఈ కషాయాన్ని అరకప్పు మోతాదుగా రెండు చెంచాలు నువ్వుల నూనె కలిపి తీసుకోవాలి.

6. వాయు విడంగాలను పొడిచేసి పావు చెంచాడు చొప్పున తేనెతో కలిపి రోజుకి రెండుసార్లు తీసుకోవాలి.

7. చండ్ర చెక్క పట్ట, కొడిశపాల పట్ట, వేపచెట్టు పట్ట, వస\కొమ్ములు, శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, తెగడవేరు వీటన్నిటిని సమానభాగాలు తీసుకొని యవకుటంగా (మెత్తగాకాకుండా) దంచి నిల్వచేసుకోవాలి. దీనిని తడవకు పదిగ్రాముల మోతాదుగా కాషాయం కాచి రెండు పూటలా వారం పాటు తాగాలి.

ఔషధాలు: కృమిముద్గర రసం, కృమికుఠార రసం. విడంగారిష్టం, కుటజారిష్టం, కుటజఘనవటి

 

6. ఫుడ్ ఎలర్జీ ఆహార పదార్థాలు సరిపడనప్పుడు విరేచనాలవుతాయి. (ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఆహారం టీసుకొన్నవారందరికి విరేచనాలవుతాయి. అయితే ఫుడ్ ఎలర్జీ అందరికీ కాకుండా కేవలం ఫుడ్ ఎలర్జీ ఉన్న వ్యక్తికి మాత్రమే విరేచనాలవుతాయి.) కొంతమందికి కొన్ని రకాల ఆహార పదార్థాలు సరిపడవు. మొదట్లో అమీబియాసిస్ అనో, లేక మరేదైనా వ్యాధి అనో భావించి రోజుల తరబడి విరేచనాలు తగ్గడానికి మందులు వాడుతుంటారు. ఆ తరువాతేప్పుడో తమకు ఏవో ఒకటి రెండు ఆహార పదార్థాలు సరిపడవని గ్రహిస్తారు. బయట మెస్సులలోనూ, హోటళ్లలోనూ తినేవారికి ఆహారంలో ఏమేం పదార్థాలు కలుస్తున్నాయో తెలుసుకునే అవకాశం ఉండదు కనుక వారికి సంవత్సరాల తరబడి తమ విరేచనాల వెనుక గల కారణం మిస్టరీగానే మిగిలిపోతుంది. ఫుడ్ ఎలర్జీ వలన విరేచనాలవుతుంటే ఆ పదార్థాన్ని జాగ్రత్తగా కనిపెట్టి వదిలేయడం తప్ప వేరే మార్గం లేదు.

 

7. థైరాయిడ్ గ్రంథి చురుకుదనం పెరగడం (హైపర్ థైరాయిడిజం) మనం శరీరంలో, గొంతు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి శరీరక్రియా ధర్మాలను నియంత్రిస్తుంటుందన్న సంగతి తెలిసిందే. ఇది ఎక్కువ స్థాయిలో చురుకుదనాన్ని సంతరించుకున్నప్పుడు (హైపర్ థైరాయిడిజం) విరేచనాలవడమే కాకుండా, గుండె వేగం పెరగడం, చమట పట్టడం, వేడి వాతావరణాన్ని భరించలేకపోవడం, బరువును కోల్పోవడం, ఆకలి పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఈ వ్యాధిని అదుపులో పెట్టడానికి సంతర్పణ ప్రధాన ఔషధాలను వాడాల్సి ఉంటుంది. ఇవి హైపర్ థైరాయిడిజం కారణంగా శరీరంలో అనియత వేగంతో జరిగే క్రియలకు కళ్లెం వేస్తాయి.

 

సూచనలు: క్యాబేజీ,క్యాలిప్లవర్, బచ్చలికూర, సోయం చిక్కుడు, మెంతికూర, ముల్లంగి ఇవన్నీ థైరాయిడ్ గ్రంథి వేగాన్ని అదుపు చేస్తాయి. కనుక వీటిని ఆహారంలో సమృద్ధిగా వాడాలి. రిఫైన్డ్ ఆహార పదార్థాలను, పాల పదార్థాలను, గోధుమలను, కెఫిన్ కలిగిన ఆహారాలను, మద్యాన్ని తగ్గించాలి. విటమిన్ - సి కలిగిన టమాటా, నిమ్మ, జారింజ, ఉసిరి వంటి పండ్లను తరచుగా తీసుకోవాలి. పసుపు, సుగంధిపాల, యష్టిమధుకం అనే మూలికలు వాడితే హైపర్ థైరాయిడిజంలో మంచి ఫలితం కలుగుతుంది.

ఔషధాలు: శతావరిఘృతం, సుకుమార రసాయనం, అమృతప్రాశ ఘృతం , కూష్మాండలేహ్యం, క్షీరబలాతైలం (101 అవర్తాలు), ప్రవాళపిష్టి, ప్రవాళ పంచామృతం.

 

8. ఇన్ ప్లమేటరీ బొవెల్ డిసీజ్ పేగులకు పూత పూసినప్పుడు, పేగులలో పుండైనప్పుడు తదనుగుణమైన వ్యాధి లక్షణాలు ముందుగా విరేచనాలతో మొదలవుతాయి. వీటితోపాటు బరువు కోల్పోవడం, మలంతో పాటు చీము కనిపించడాలు ఉండవచ్చు. ఔషధాలు: శాల్మనీ నిర్యాసం, లాక్షా చూర్ణం. 

 

9. శస్త్రచికిత్సానంతర సమస్యలు కొంతమందికి వివిధ వ్యాధి కారణాల చేత పేగులలో కొంత భాగం తీసివేయాల్సి వస్తుంది. పేగులు మెలికపడిపోయి రక్త సరఫరా నిలిచిపోయినప్పుడు, పేగులు చిద్రమైనప్పుడు, క్యాన్సర్ సోకినప్పుడు ఇలా చేయాల్సి వస్తుంది. కారణమేదైనప్పటికి పేగుల పొడుగు తగ్గడం వల పూర్తిస్థాయిలో ఆహారం శరీరంలోనికి విలీనమవ్వదు. ఫలితంగా విరేచనాలు అవుతాయి.

సూచనలు: ఈ స్థితితో బాధ పడుతున్న వారు ఆహారాన్ని కొద్ది మొత్తాల్లో, వీలైనన్నీ ఎక్కువ సార్లు తీసుకోవాలి.

 

10. క్యాన్సర్ అవకాశాలు చిన్న పేగులలోనికి తెరుచుకునే గ్రంథి ఒకటి అడ్డంగా మన ఉదార ప్రదేశంలో ఉంటుంది. దీనిని 'ప్యాంక్రియాస్' అంటారు. ఇది విడుదల చేసే ఎంజైముల వల్ల ఆహారంలోని కొన్ని ప్రత్యేకాంశాలు పచనం చెందుతాయి. ఒకవేళ ఈ గ్రంథి వ్యాధిగ్రస్తమైతే కొవ్వు పదార్థాలు, మాంసక్రుత్తులూ పచనం చేయకుండా, యథాతథంగా ఇతర పదార్థాలతోపాటు విసర్జితమవుతాయి. ఇలా జరిగినప్పుడు ఆ మలం జిద్దుగాం నురగగా, దుర్గంధయుక్తంగా ఉండడమే కాకుండా, నీళ్లపై తేలుతూ ఉంటుంది. ఇలా మూడు నాలుగు రోజుల నుంచి వరుసగా జరుగుతుంటే, ఏ మాత్రం ఆలస్యం చేయకూడదు; ఇలా సామాన్యంగా ప్యాంక్రియాస్ కు సోకిన క్యాన్సర్ లోనూ, తీవ్రమైన మద్యపానంలోనూ జరుగుతుంది. దీనికి ఎం జైములను వృద్ధి పరిచే దీపాన పాచన చికిత్సలు అవసరమవుతాయి.

 

11. మధుమేహవ్యాధి దుష్ఫలితాలు (డయాబెటిక్ కాంప్లికేషన్స్) మధుమేహ వ్యాధి దీర్ఘకాలంగా ఉంటున్నప్పుడు, రక్తంలో చెక్కర మోతాదు ఇటూ అటూ కావడం వలన, విరేచనాలయ్యే అవకాశం ఉంది. అంతే కాకుండా మధుమేహంలో అన్నవాహికకు చెందినా రక్తనాళాలు పెనుమార్పులకు లోనవడం వలన కూడా విరేచనాలయ్యేందుకు అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో పంచదారకు బదులుగా వాడే సార్బిటాల్ అనే పదార్ధం వల్ల కూడా విరేచనాలు అవుతుంటాయి.

సూచనలు: ఈ లక్షణాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ప్రధాన వ్యాధికి చికిత్స తీసుకుంటే సరిపోతుంది. అలాగే షుగర్ ఫ్రీ, స్వీటెక్స్ వంటి పదార్థాల వాడకాన్ని తగ్గించుకోవాలి.

 

సలహాలు: 1. అతిసారంలో మొదట లంఘన చికిత్సలు, తరువాత పాచన చికిత్సలూ అవసరమవుతాయి. లంఘన చికిత్సలంటే చాలా మంది అనుకునేట్లు ఆహారం మానివేయడం కాదు - శరీరాన్ని 'తేలికగా' ఉంచుకోవడం కోసం చికిత్సలను తీసుకోవడం.

2. విరేచనాలవుతున్నప్పుడు కొడిశపాలపట్ట, అతివస, శొంఠి, మారేడు పిందెలు, ఇంగువ, కొడిశపాలగింజలు, తుంగముస్తలు, చిత్రమూలం - వీటితో కషాయం కాచుకొని తాగిన చక్కని ఫలితం కనిపిస్తుంది.

3. కుటజావలేహ్యం, కుటజఘనవటి, బిల్హవలేహ్యం, కుటజారిష్టం, కర్పూర రసం వంటివి అతిసారంలో విరివిగా వాడే ఆయుర్వేద ఔషధాలు. వీటిని వైద్యసలహాలను అనుసరించి వాడుకోవచ్చు.

4. పిల్లలలో విరేచనాలవుతున్నప్పుడు శరీరంనుంచి బయటకు వెళ్లిపోయే నీళ్లనూ, ఇతర లవణాలనూ భార్తీచేయాలి. మజ్జిగ, గంజి, పప్పుకట్టు, పల్చటి టీ మొదలయినవి బిడ్డ తాగగలిగినంత ఇవ్వాలి, అలాగే, విరేచనాలు తగ్గే వరకూ ఇవ్వాలి.

5. రాష్ట్ర కుటుంబ సంక్షేమశాఖ వారు ఓ.ఆర్.ఎస్. (ఓరల్ రీ హైడ్రేషన్ సొల్యూషన్) పొడి కలిగిన ప్యాకెట్లను ఉచితంగా పంపిణి చేస్తున్నారు. ఇవి ఎ.ఎన్.ఎం. లను దగ్గరా, చౌకడిపో డీలర్లూ, అంగన్ వాడీ వర్కర్లు మొదలయిన వారి వద్ద దొరుకుతాయి. దీనిని ఒక ప్యాకెట్ పొడిని ఒక లీటర్ కాచి చల్లార్చిన మంచినీటిలో (సుమారు అయిదు గ్లాసుల నీళ్లు) కలిపి బిడ్డకు తరచుగా తాగగలిగినంత ఇస్తూనే ఉండాలి. ఒకసారి కలిపినా ఓ.ఆర్.ఎస్. ద్రవాన్ని 24 గంటలలోపు మాత్రమే వాడాలి. ఈ విధంగా విరేచనాలు తగ్గే వరకూ ఇవ్వాలి. ఈ లోపు బిడ్డకు ఆహారాన్ని (ద్రవాహారం మంచిది) కూడా ఇస్తూనే ఉండాలి. విరేచనాలు అవుతున్నప్పుడు తల్లిపాలు ఆపకూడదు.

6. బిడ్డలో చలనం తగ్గిపోయి, నిస్త్రాణంగా ఉన్నా, కళ్ళు లోతుకు వెళ్ళినా, మాడు లోపలికి వెళ్ళినా, బిడ్డ ఆహారం, నీళ్లను తీసుకోకుండా నిరాకరించినా వెంటనే వైద్య సలహా పొందాలి.

7. విరేచనంలో రక్తం, జిగురు పడుతున్నా, జ్వరం, వాంతులు ఉన్నా వైద్య సహాయం పొందడం అవసరం. ఇవి ప్రమాదకర పరిస్థితులను కలిగిస్తాయి.

8. విరేచనాలు వచ్చినప్పుడు కంగారు పడేకన్నా విరేచనాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తాగే నీరు కాచి చల్లార్చినదై ఉండాలి. ఆహార పదార్థాలుంచిన గిన్నెలమీద ఈగలు వాలకుండా మూతలుంచాలి. మల విసర్జన తరువాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. గోళ్ళు ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి.

9. మానసిక అలజడుల వలన విరేచనాలు అవుతున్నప్పుడు కౌన్సిలింగ్, యోగ, ధ్యానం, వ్యాయామం లాంటి పద్ధతులూ, ధార చికిత్స, శిరోవస్తి చికిత్సలూ ప్రత్యేక ఫలితాలనిస్తాయి.