మింగుతుంటే ఇబ్బంది

1. గొంతులో మంటగా లేదా నొప్పిగా అనిపిస్తోందా?

ఇన్ఫెక్షన్, ఇన్ ఫ్లమేషన్లు (సోర్ త్రోట్)

2. మింగేటప్పుడు నొప్పి, కష్టం రెండూ ఉన్నాయా?

అన్ననాళిక లైనింగ్ కు చెందిన సమస్యలు

3. మీరు తేలికగానే మింగగలిగినప్పటికీ, మింగిన తరువాత అసౌకర్యంగా, నొప్పిగా అనిపిస్తుందా?

అన్ననాళికలో అవరోధం

4. మీరు మానసికంగా చెదిరినప్పుడు, లేదా కోపంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సమస్య ఉత్పన్నమవుతుందా? ఇలాంటి సమయంలో గొంతులో ఏదో అడ్డుపడుతున్నట్లుగా, ఒక కణితి లాంటిది లోపల ఉన్నట్లుగా అనిపిస్తుందా?

మానసిక దోషాలు

5. మింగుతుంటే కష్టంగా ఉండడంతో పాటు గొంతు కూడా బొంగురుపోతుందా?

స్వరభేదం / గొంతు బొంగురు పోవటం

6. ద్రవ పదార్థాలు బాగానే మింగగలిగినప్పటికీ, ఘన పదార్థాలు మింగాలంటే కష్టంగా అనిపిస్తుందా?

అన్ననాళిక పాక్షిక అవరోధం

7. ద్రవ పదార్థాలనూ, ఘనపదార్థాలనూ రెండింటినీ మింగలేకపోతున్నారా?

అన్ననాళిక సంపూర్ణ అవరోధం

8. ఘన పదార్థాలను బాగానే మింగగలిగినప్పటికీ ద్రవపదార్థాలతో సమస్య వస్తుందా?

నరాల సమస్య

9. మీ మెడ ముందు భాగంలో వాపు కనిపిస్తోందా?

గాయిటర్

10. మింగలేకపోవడంతోపాటు, బలహీనంగా ఉంటున్నారా? స్పర్శాజ్ఞానం కూడా మందగిస్తున్నదా?

పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్)

11. మీ వేళ్ళ చివర్లు కొంకర్లు పోయి, నొప్పి పెడుతూ ఉంటాయా?

స్ల్కీరోడేర్మా వ్యాధి

12. బాగానే మింగగలిగినప్పటికీ మింగిన కొంచెం సేపటి తరువాత, తిన్నదంతా బైటకు వచ్చేస్తుందా?

అన్ననాళికలో సంచులు (డైవర్టిక్యులం)

 

శ్వాసించడం ఎంత అసంకల్పితమైన సహజ చర్యో. మింగడం కూడా అంతేనని భావిస్తారు చాలామంది. ఐతే, గుటక వెయ్యడం అనే చిన్న చర్య వెనుక ఎంతో సంక్లిష్టమైన శారీరక విధులు జరగాల్సి ఉంటుందని అది సమస్యగా రూపుదిద్దుకునే వరకూ చాలామందికి తెలియదు.

 

మింగటం అనే చర్యను ఆయుర్వేదంలో 'నిగలడం' అంటారు. దీనికి నరాలూ, కండరాలూ కలసికట్టుగా పనిచేయాల్సి ఉంటుంది. నిగలన క్రియ గొంతు లోపల కృగాగ్రం (స్వరపేటిక) నుంచి మొదలై, అన్ననాళిక – అమాశయం ల పై భాగం వరకూ కొనసాగుతుంది.

 

ఈ పరంపరలో ఎక్కడ అవరోధం ఏర్పడినా, లేక ఎక్కడ సమస్య ఉత్పన్నమైనా అక్కడ 'నిగలన కష్టత' ఏర్పడుతుంది. ఆయుర్వేదం ఈ స్థితిని అయిదు రకాల వాత దోషాలలో ఒకటైన ఉదాన వాత వికృతిగా భావిస్తుంది.

మింగలేకపోవడానికి, లేదా మిన్గుతున్నప్పుడు నొప్పి పుట్టడానికి వెనుక అనేక అంశాల ప్రభావం ఉంటుంది. అయితే అదృష్టవశాత్తూ చాలా వరకూ ఇవన్నీ తేలికగా గ్రహించగలిగే విధంగానే ఉంటాయి. లేదా స్పష్టమైన కారణాలతోనే ఉంటాయి. ఉదాహరణకు, చల్లటి పదార్థాలు తిన్నప్పుడు గొంతు పుండవడం, గొంతులోపలి టాన్సిల్స్ లో చేప ముళ్ళ వంటివి ఇరుక్కుపోవడం మొదలయినవి. వీటిని తేలికగానే ఊహించవచ్చు.

 

అయితే సరిగ్గా మింగలేకపోతున్నప్పుడు, దానికి స్పష్టమైన కారణం అంతుబట్టనప్పుడు, రోజుల తరబడి ఇదే లక్షణం కొనసాగుతున్నప్పుడు. లేదా రోజు రోజుకి ఎక్కువవుతున్నప్పుడు సమస్య జటిలమావుతున్నట్లుగా భావించాలి. తక్షణమే వైద్యసహాయం తీసుకోవాలి. లక్షణ తీవ్రతను బేరీజు వేసుకోవటానికి ఈ కింది విషయాలు దోహదపడతాయి.

 

1. ఇన్ఫెక్షన్, ఇన్ ఫ్లేమేషన్లు (సోర్ త్రోట్) ఈ రెండు స్థితులవలన గొంతు పుండైనట్లు తయారైతే అప్పుడు గొంతులో నొప్పిగా, మంటగా అనిపిస్తుంది. ఇన్ఫెక్షన్లు, ఇన్ ఫ్లమేషన్లు గొంతు నొప్పికి కారణమైనప్పుడు వాటిని తగ్గించుకునే ప్రయత్నిం చేయాలి. సాధారణంగా ఇలాంటప్పుడు గొంతునొప్పి దగ్గుతోనో, జలుబుతోనో కలిసి ఉంటుంది.

గృహచికిత్సలు: 1. పసుపు (అరచెంచాడు), ఉప్పు (అరచెంచాడు గ్లాసు నీళ్లలో కలిపి, మరిగించి వేడిగా ఉండగానే పుక్కిట పట్టాలి.

2. పసుపును (అరచెంచాడు) వేడిపాలతో (కప్పు) కలిపి తేనె చేర్చి రోజుకు రెండుసార్లు తాగాలి.

3. పటికరాయిని పెనం మీద వేడి చేసి పొంగిస్తే దానిలోని నీరంతా ఆవిరై తెల్లగా మారుతుంది. దీనిని పొడిచేసి తేనెతో కలిపి గొంతు తగిలేలా పుక్కిట పట్టాలి.

4. త్రిఫలా చూర్ణం (రెండు చెంచాలు) వేడినీళ్లతో కాలిపు పుక్కిట పట్టాలి.

5. యూకలిప్టస్ నూనెను (ఐదారు చుక్కలు) వేడి నీళ్లలో వేసి ఆవిరి పట్టాలి.

6. మిరియాలు (చిటికెడు) పాలతో కలిపి, తగినంత పటిక బెల్లం (మిశ్రి) చేర్చి రెండు పూటలా తాగాలి.

7. తులసి ఆకుల రసానికి (అరచెంచాడు) తేనెను (చెంచాడు) కలిపి రోజుకు మూడు సార్లు తీసుకోవాలి.

8. అక్కలకర్ర వేరు చూర్ణాన్ని పావు చెంచాడు మోతాదుగా గోరు వెచ్చని నీళ్లతో రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. దీనివల్ల లాలాస్రావం పెరిగి ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.

9. యష్టిమధుకం చూర్ణాన్ని (అరచెంచాడు) పాలతో కలిపి రోజుకి రెండుసార్లు తీసుకోవాలి.

ఔషధాలు: తాళీసాది చూర్ణం, లవంగాదివటి, కాంచనారగుగ్గులు, ఖదిరాదివటి, కఫకేతురసం.

 

2. అన్ననాళిక లైనింగ్ కు చెందినా సమస్యలు: నొప్పిగా ఉండటం, మింగాలంటే కష్టపడాల్సి రావడం - వీటి మధ్య తేడా గమనించండి. మింగుతున్నప్పుడు కష్టంగా ఉండడంతోపాటు, నొప్పి అనుబంధంగా ఉన్నట్లయితే, నరాలకు సంబంధించిన కారణాలను పరిగణనలోకి తీసుకోకూడదు. అన్ననాళిక కండరాలు బిగదీసుకుపోయినప్పుడు ఇలా జరుగుతుంది. అలాగే, అన్ననాళిక లోపల పుండు కావడం. అన్న నాళిక చీరుకుపోవడం, ఎముక ముక్కలూ, చేపముళ్ళూ గొంతులో ఇరుక్కుపోవడం వంటివి కూడా కారణాలుగా ఉండవచ్చు.

సూచనలు: అన్ననాళిక పుండుగా తయారైనప్పుడు అల్సర్లకు తీసుకునే చికిత్స తీసుకోవాలి. అవిపత్తికర చూర్ణం, ధాత్రీలోహం, కామదుఘారసం, సూతశేఖర రసం, శంఖ భస్మం, నారికేళ ఖండం మొదలయినవి ఎసిడిటీ సంబంధ రుగ్మతలను తగ్గించే ఆయుర్వేద ఔషధాలు. కండరాల సంకోచం గొంతునొప్పికి కారణమైనప్పుడు వాటిలో పట్టును సడలించడానికి యాంటీస్పాస్మోడిక్స్ వాడవలసి ఉంటుంది. ఇంగువ, కర్పూరం, ఉమ్మెత్త – ఇంకా ఇలాంటివే చాలా రకాలు ఈ లక్షణాన్ని కలిగిఉంటాయి.

 

3. అన్న నాళికలో అవరోధం: మింగటం తేలికగానే జరిగిపోయినప్పటికి మింగిన తరువాత అసౌకర్యంగా, నొప్పిగా ఉండటమనే లక్షణం అన్న నాళిక (ఈసోఫేగస్) చివరిభాగంలో ఏర్పడిన అవరోధాన్ని సూచిస్తుంది. అవరోదానికి కారణం హైయేటస్ హెర్నియా (అమాశయం, డయాఫ్రం ద్వారా పైకి చొచ్చుకు వెళ్లడం), అల్సర్లు, కణితి మొదలయినవి ఏవైనా కావచ్చు.

సూచనలు: హైయేటస్ హెర్నియా వల్ల సరిగ్గా మింగలేకపోతున్నప్పుడు, అల్సర్లకు తీసుకొనే చికిత్సతోపాటు, అధిక బరువును కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది. ధూమపానం వంటి అలవాట్లు ఉంటే మానేయాలి. ఆహారాన్ని కొద్దికొద్దిగా తీసుకోవాలి. మద్యం, కొవ్వు పదార్థాలు, కోలాడ్రింకులు, పుల్లటి పండ్లు, కాఫీ, టీలు పూర్తిగా వదిలేయాలి. ముందుకు వంగి పనిచేయకూడదు. అలవికాని బరువులను చేతులతో ఎత్తకూడదు. నిద్రకుపక్రమించే ముందు చిరుతిండ్లు తినకూడదు. పడుకునే మంచం తలవైపు భాగం కనీసం పదిహేను సెంటీమీటర్లు ఎత్తు ఉండేలా అమర్చుకోవాలి.

 

4. మానసిక దోషాలు మానసిక కారణాల వల్ల మింగటంలో ఇబ్బంది ఏర్పడటమనే లక్షణం ఎక్కువగా స్త్రీలలో కనిపించే అవకాశం ఉంది. అర్థం లేని ఆలోచనలు, భరించలేనంత మానసిక ఒత్తిడిలు దీనికి కారణాలు. 'గోల్బస్ హిస్టీరికస్' అనే పదంతో ఈ లక్షణాన్ని పిలుస్తారు. కండరాల సంకోచం వల్ల ఈ స్థితి ఉత్పన్నమవుతుంది.

సూచనలు: మానసిక ఉద్విగ్నత కారణంగా మింగటంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నప్పుడు మనో విశ్లేషణ, అశ్వాసనం (ధైర్యాన్ని కలిగించడం), దధారా చికిత్సలు ఉపయోగపడతాయి.

ఔషధాలు: మానసమిత్ర వటకం, బ్రాహ్మీవటి, మోతీ భస్మం.

5. స్వర భేదం/ గొంతు బొంగురు పోవటం కంఠద్వారం సమీపంలో స్వరపేటిక (లారింక్స్) ఉంటుందన్న సంగతీ, దానిలో నాద తంత్రులు (వోకల్ కార్డ్స్) ఉంటాయన్న సంగతీ, ఊపిరితిత్తులలోని గాలి ఈ నాద తంత్రుల ద్వారా వెళ్తూ శబ్దాన్ని పుట్టిస్తుందన్న సంగతీ తెలిసిందే.

అన్ననాళిక, స్వరపేటికలు ఒకే ప్రదేశంలో ఉండటం వలన, ఒక దానికి సమస్య వస్తే, రెండవది కూడా ఆ ప్రభావానికి గురవుతుంది. గ్రంథులు వాయడం, కణితులు తాయారు కావడం వంటివి ఉన్నప్పుడు మింగుతుంటే నొప్పిగా అనిపించడమే కాకుండా, కంఠస్వరం మారే అవకాశం కూడా ఉంది. దీనిలో ప్రధాన సమస్య అయిన స్వరభేదానికి చికిత్స చేస్తే సరిపోతుంది.

 

గృహచికిత్సలు: 1. సరస్వతి ఆకు, బోడతరం, వస కొమ్ము, శొంఠి కొమ్ము, పిప్పళ్ళు వీటి చూర్ణాన్ని అరచెంచాడు మోతాదుగా తేనెతో కలిపి వారంపాటు రెండు పూటలా తీసుకోవాలి.

2. ఉసిరి పండ్ల వరుగును పొడిగా దంచి వస్త్ర గాలితం చేసి, పాలతో కలిపి తాగాలి.

3. రేగు ఆకులను ముద్దగా నూరి ఆవు నెయ్యి, సైంధవ లవణాలను చేర్చి కొద్దిగా వెచ్చచేసి అరచెంచాడు మోతాదుగా రోజుకి రెండు సార్లు తీసుకోవాలి.

4. పుష్కరమూల చూర్ణాన్ని (పావు చెంచాడు) తేనెతో కలిపి రోజుకి రెండు సార్లు తీసుకోవాలి.

5. కాచును శొంఠి, కరక్కాయ పెచ్చులు , పిప్పళ్ళు వీటిలో ఏదో ఒకదానితో కలిపి నూరి, నీళ్ళు చేర్చి గుళికలు చేయాలి. వీటిని నీడలో ఆరబెట్టి నిల్వచేసుకోవాలి. అవసరమైనప్పుడళ్ళా ఈ గుళికలను బుగ్గన పెట్టుకొని చప్పరిస్తుండాలి.

ఔషధాలు: లవం గాదివటి, ఏలాదివటి, ఖదిరాది వటి.

 

6. అన్ననాళిక పాక్షిక అవరోధం ద్రవ పదార్థాలతో ఇబ్బంది లేకుండా ఘనపదార్థాలతో మాత్రమే ఇబ్బంది ఉంటే అది అన్ననాళిక తాలూకు పాక్షిక అవరోధాన్ని సూచిస్తుంది. దీనికి కారణం లోపల పెరిగే కంతులు కావచ్చు, లేదా, అన్న నాళిక వెలుపల పెరిగే కంతి అన్ననాళిక మీద వత్తిడిని కలిగిస్తూ ఉండవచ్చు, ఇలా జరుగుతుంటే ఏ మాత్రం ఆలస్యం చేయకూడదు, సత్వరమే వైద్య సలహా పొందాలి. ఈ లక్షణాలు క్యాన్సర్ లో ఎక్కువగా కనిపిస్తాయి.

 

7. అన్ననాళిక సంపూర్ణ అవరోధం ద్రవపదార్థాలు, ఘన పదార్థాలు రెండు మింగ లేకుండా వుంటే అన్ననాళికలో పూర్తిగా అడ్డంకి ఏర్పడిందని అర్థంచేసుకోవాలి. దీనికి కారణం సాధారణంగా కంతి అయ్యుంటుంది. అయితే కంతి అన్నంత మాత్రాన అది క్యాన్సరేనని కంగారుపడవలసిన అవసరం లేదు. ఒక్కొక్కసారి ప్రమాదకరంకాని కంతులు కూడా పెరుగుతుంటాయి. ఇలాంటి వాటిని బినైన్ ట్యూమర్ అంటారు. ఏది ఏమైనా కంతి అనేది ప్రమదరహితమైన బినైన్ ట్యూమరా లేక ప్రమాదకరమైన మాలిగ్నెంట్ ట్యూమరా అనేది తగిన విధంగా పరీక్షంచి నిర్ణయించాల్సి ఉంటుంది. అన్న నాళిక పూర్తిగానో లేక పాక్షికంగానో మూసుకుపోయినప్పుడు కారణానుగుణమైన చికిత్సలు చేయాల్సి ఉంటుంది.

 

8. నరాల సమస్య: ఒకోసారి కొంత మంది ఘనపదార్థాలను మింగగలిగినప్పటికి ద్రవ పదార్థాలను తేలికగా మింగలేరు. మెడలో - అన్ననాళిక మొదటి భాగం వెనుక ఉండే నరాల పనితీరులో - లోపం ఏర్పడం వల్ల ఈ లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. ఈ స్థితి ఏర్పడినప్పుడు అన్ననాళికకు అవరోధం ఏర్పడే అవకాశం తక్కువ, దీనిని పక్షవాతం మాదిరిగా, వాత హర ఔషధాలతో చికిత్సించాల్సి ఉంటుంది. ఔషధాలు: వాత చింతామణి రసం, వాత విధ్వంసినీ రసం, విషతిందుకవటి.

 

9. గాయిటర్ థైరాయిడ్ గ్రంథి మెడలో ముందు భాగంవైపు ఉంటుందన్న సంగతి తెలిసిందే, ఇది వాచినప్పుడు - చాలా అరుదుగా దీని వెనుక భాగంలో ఉండే అన్న నాళిక మీద వత్తిడి పడే అవకాశం ఉంది. అలా పడినప్పుడు మింగడం కష్టమవుతుంది. ఔషధాలు: కాంచనార గుగ్గులు.

10. పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్) నడుస్తున్నప్పుడు తడబడడం, మాటలు ముద్దగా రావడం, మింగాలంటే కష్టంగా అనిపించడం ఇవన్నీ పక్షవాతాన్ని సూచించే లక్షణాలు, అలాగే ఇలాంటి లక్షణాలు చాలా రకాలైన ఇతర నరాల వ్యాధులలో కూడా కనిపిస్తాయి.

సూచనలు: పక్షవాతం కారణంగా మింగటం కష్టమవుతుంటే వాతహర చికిత్సలు ఉపయోగపడతాయి. శమన చికిత్సలతో ఆశించిన స్థాయిలో ఫలితం లభించనట్లయితే ఆయుర్వేదీయ శోధన చికిత్సలు అవసరమవుతాయి.

 

11. స్ల్కీరోడెర్మా వ్యాధి ఏ మాత్రం చల్లటి వాతావరణంలోకి వెళ్ళినా మీ వేళ్ల మీద చర్మం బిగుతుగా మారిపోతుంటే స్ల్కీరోడెర్మా అనే ఆటోఇమ్యూన్ వ్యాధిని గురించి ఆలోచించాలి. ఈ వ్యాధి ఉన్న వారిలో అన్న నాళిక కూడా కుంచించుకుపోయి మింగడం కష్టతరంగా మారుతుంది.

సూచనలు: ఈ వ్యాధిలో గుడూచి, అశ్వగంధ, ఆమ్లకీ రసాయనం వంటి రసాయన ఔషధాలు పనిచేస్తాయి. ఇవి ఓజస్సును ఇమ్యూనిటీని పరిరక్షిస్తాయి.

 

12. అన్ననాళికలో సంచులు (డైవర్టిక్యులం) కొంతమందిలో అన్న నాళిక మొదటి భాగంలో, లోపలివైపు సంచులవంటి నిర్మాణాలు (డైవర్టిక్యులం) ఏర్పడతాయి. ఆహారం వాటి లోపలికి ప్రవేశిస్తే మింగడం కష్టతరంగా మారుతుంది. తిన్నదంతా బయటకు వచ్చేస్తుంది. దీనికి కారణానుగుణమైన చికిత్సలు అవసరమౌతాయి.