మలబద్దకం

1. మలబద్దకం తరువాత విరేచనాలు అనుసరిస్తూ ఉంటాయా?

పేగుల కదలికల్లో అపక్రమం

2. చాలాకాలంగా - కొన్ని సంవత్సరాల నుంచి - మీకు మలబద్దకం సమస్య ఉందా?

అలవాటుగా మారిన మలబద్దకం

3. అల్లోపతి మందులేమయినా వాడుతున్నారా?

మందుల దుష్ఫలితాలు

4. మలం, ఆకారంలోనూ, చుట్టుకొలతలోనూ మార్పు కనిపిస్తుందా?

పెద్దపేగులో ట్యూమర్లు

5. మలం రంగులో తేడా ఉందా?

మలాశయంలో అల్సర్లు, పుండ్లు

6. మలం నలుపు రంగు రక్తంతో కలిసిపోయి కనిపిస్తుందా?

పేగుల్లో రక్తస్రావం

7. మల విసర్జన సమయంలో బాగా నొప్పిగా అనిపిస్తుందా?

ఆర్శమొలలు, ఫిషర్లు

8. కొత్తప్రదేశానికి వెళ్లినప్పుడు మాత్రమే మలబద్దకం వస్తుందా? స్

థల మార్పుల వల్ల వచ్చే చిక్కులు

9. మలబద్దకంతో ఇబ్బంది పడటంతోపాటు బరువు పెరుగుతున్నారా?

థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గటం (హైపోథైరాయిడిజం)

10. బరువు తగ్గుతున్నారా?

క్యాన్సర్

11. వ్యాయామమ ఆపిన తర్వాత మలబద్ధకం మొదలయిందా?

వ్యాయామరహిత జీవితం

12. మలబద్దకంతోపాటు ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళవలసి వస్తుందా?

పెద్ద పేగులో కంతులు, పెరుగుదలలు

13. మలబద్దకంతోపాటు మీకు తెలియకుండానే మూత్రం పడిపోతుందా?

 

నరాల దౌర్భల్యం (సర్వ్ వీక్నెస్) ఆయుర్వేదం సహజమైన కాలకృత్యాలుగా పదమూడు వేగాలను పేర్కొంది. వీటిలో మల విసర్జన ఒకటి. దీనినెప్పుడు ఆపుకోకూడదు. అలా ఆపితే, మలబద్దకంతోపాటు పలు రకాలైన ఇతర వ్యాధులు ప్రాప్తిస్తాయి.

 

డాక్టర్లు పేషెంట్ల నుంచి ఎదుర్కొనే అతిసాధారణమైన ఫిర్యాదు మలబద్ధకం. కొంతమంది పేషెంట్లకు మలబద్దకమనేది ప్రధాన సమస్య అయినప్పటికీ దానిని చెప్పడానికి సిగ్గుపడి మిగతా వాటిని ఏకరువు పెడతారు. మరికొంతమంది అసలు ముఖ్యమైన సమస్యను పక్కకుపెట్టి మలబద్ధకం గురించే మాట్లాడుతుంటారు.

బాధితుల వైపునుంచి చూసినట్లయితే మలబద్దకం గురించి అందరి అభిప్రాయాలూ ఒకేలా ఉండవు, దీనిని ఒకొక్కరు ఒక్కో రకంగా అన్వయించుకుంటారు. చాలా మందికి ప్రతిరోజు మల విసర్జన చేయడం అలవాటు. ఈ దైనందిన కార్యక్రమంలో మార్పు వచ్చిందంటే వారి దృష్టి ప్రకారం మలబద్ధకం ఉన్నట్లు. మరికొంతమందికి రోజుకు రెండు నుంచి మూడుసార్లు మల విసర్జన చేస్తే తప్ప 'తృప్తి' ఉండదు. కొద్దిమంది వారానికి ఒకసారి మాత్రమే మలవిసర్జన చేస్తుంటాయి. ఇతరత్రా ఆరోగ్యంగా ఉండటం, రొటీన్ గా ఇలాగే జరుగుతుండటం అనేవి ఉంటే వీరికి మలబద్ధకం లేనట్లే. ఇంతకీ చెప్పవచ్చేదేమిటంటే, మలబద్ధకం గురించి మాట్లాడేటప్పుడు వ్యక్తిగత కోణాల నుంచి చూడాల్సి ఉంటుందని. ఎవరిలోనైనా సరే - వారి రొటిన్ లో మార్పు సంభవించి, జరగాల్సిన సమయంలో , మల విసర్జన జరగనట్లయితే దానిని మలబద్దకంగా భావించాలి.

 

మలబద్దకం ప్రాప్తించినప్పుడు సాధారణంగా కడుపు ఉబ్బరించినట్లుగా ఉంటుంది. పొట్టలోపల అసౌకర్యంగా, నులినొప్పిగా ఉంటుంది. అన్నింటికీ మించి ముక్కితే తప్ప మల విసర్జన జరుగని పరిస్థితి ఉంటుంది. ఇటువంటి లక్షణాలున్నప్పుడు చికిత్స అవసరమవుతుంది.

 

మూడు రోజులకు మించి మలబద్దకం ఉంటూ దానికి కారణం ఆహారంలో మార్పులు, ఎండ లేదా వేడి వాతావరణంలో గడపటం, అదేపనిగా కూర్చోవటం, ఎక్కువ సేపు పడుకోవటం వంటివి కాకుండా ఉంటే సరైన వ్యాధి నిర్ణయం కోసం వైద్య సలహా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సూచన 40 సంవత్సరాలు దాటిన వారికి ఎక్కువగా వర్తిస్తుంది.

 

మనం ఆహార పదార్థాలను తిన్నప్పుడు, లేదా తాగినప్పుడు అవి వాటి ప్రాథమిక అంశాలుగా - అంటే ప్రోటీన్లు, పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్లు, క్రొవ్వు తదితరాలుగా తయారవుతాయన్న సంగతి తెలిసిందే. మన నోటిలోని లాలాజలం ఆహార పచానాన్ని మొదలుపెట్టినప్పటికీ పచన క్రియ వేగవంతమయ్యేది మాత్రం ఆమాశయంలోని గాఢాంమ్లం ద్వారానే. ఆహార పచనానంతరం శరీరం జీర్ణరసాలను చిన్న పేగులనుంచి తనలోనికి విలీనం చేసుకుంటుంది. మిగిలిపోయిన వ్యర్థాలు, జీర్ణంకాని పీచు పదార్థాలు, కాలేయం నుంచి విడుదలయ్యేబై - ప్రొడక్టులూ, ఇతర ద్రవ పదార్థాలూ ఇవన్నీ పేగుల కండరాలు కదలికల సహాయంతో చిన్న పేగు నుంచి పెద్ద పేగుకూ, అక్కడినుంచి మలద్వారా వెలుపలికి విసర్జితమవుతాయి. ఇదే సమయంలో పెద్ద పేగు చివరిభాగం శరీరానికి అవసరమైన ద్రవాంశాలను తిరిగి పీల్చేసుకుంటుంది.

 

అధిక చమట, వేడి వాతారవరణం, నీళ్ళను తక్కువగా తాగటం వంటి వాటి వలన శరీరంలో ద్రవాంశం ఉండవలసిన ప్రమాణం కన్నా తగ్గుతుంది. డీ హైడ్రేషన్ లేదా నిర్జలీయత. ఐనప్పటికీ, పెద్ద పేగు ద్రవరూప మలం నుంచి గ్రహించాల్సినంత ద్రవాంశాన్ని గ్రహిస్తూనే ఉంటుంది. ఫలితంగా మలం గట్టిపడి ఉండలుగా తయారై ముక్కితే తప్ప వెలుపలికి రాని స్థితి నెలకొంటుంది. దీనినే మలబద్ధకం అంటారు.

 

ఆహారం తీసుకోవడం ఎంత రోజువారీ కార్యక్రమమో, మల విసర్జన కూడా అంతే. మీ సమస్యకు కారణం ఒకవేళ మీ రొటీన్ లో మార్పు చోటుచేసుకోవడమే అయితే ఆ విషయం డాక్టర్ కంటే మీకే ఎక్కువ స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి మీ సమస్యకు కారణం మీ దైనందిన కార్యక్రమంలో మార్పా లేక మరేదైనా శారీరక రుగ్మతా అనేది తెలుసుకోవాలంటే కొంత తర్కం అవసరం. ఈ కోండి పాయింట్లు చూస్తే మీ సమస్యకు క్లూ దొరకవచ్చు.

 

1. పేగుల కదలికల్లో అపక్రమం మలబద్దకాన్ని అనుసరించి విరేచనాలు అవుతుంటే అది 'గ్రహణి' అనే వ్యాధి లక్షణం. ఈ వ్యాధిని ఐ.బి.యస్ (ఇరటబుల్ బొవెల్ సిండ్రోమ్) తో పోల్చవచ్చు. దీనిలో సాధారణంగా పొట్ట ఎడమ భాగంలో నులినొప్పి ఉంటుంది. మలం, అపాన వాయువులను విసర్జించిన తరువాత కూడా ఈ నొప్పి తగ్గకుండా అలాగే ఉంటుంది. ఒక్కొక్కసారి కడుపు ఉబ్బరించినట్లుగానూ, పేగులను మెలిపెడుతున్నట్లుగానూ, కడుపులో వికారంగానూ అనిపించవచ్చు. మల విసర్జన అయిదార్లు సార్లు చేయాల్సి వస్తుంది. ఎన్నిసార్లు వెళ్లినా పూర్తిగా కానట్లు వుండటం, ఇంకా వెళ్లాలనిపించడం దీనిలోని ప్రధానం లక్షణం. మలం ద్రవయుక్తంగా కాకుండా, మామూలు స్థితిలోనే పల్చగా, స్వల్పంగా వెడలుతుంటుంది. ఈ వ్యాధికి ప్రధాన కారణం అర్థంలేని ఆందోళన, మానసిక అస్థిరతలేనని చెప్పవచ్చు. అల్సర్లూ, పాలిప్ లూ, అపెండిసైటిస్, అమీబియాసిస్ లు లేవని తేలిన తరువాత మాత్రమే ఈ వ్యాధిని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాధితో బాధపడే వారికి రక్త పరీక్ష, మల పరీక్ష, బేరియం ఎక్స్ రే, సిగ్మాయిడోస్కోపీ వంటి వన్నీ నార్మల్ గానే ఉంటాయి.

 

గ్రహణి వ్యాధిలో కనిపించే మలబద్దకం సమస్యను అన్ని కోణాలనుంచి - శారీరకమా లేక మానసికమా అనేది విశ్లేషించవలసి ఉంటుంది. అవసరమైతే 'పర్పటి కల్పాలను' వైద్య సలహాతో వాడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, స్నేహకర్మ, స్వేద కర్మ, శోధన చికిత్సలు కూడా అవసరమవుతాయి.

 

కొన్నిసార్లు షుగర్ వ్యాధిలో కూడా ఇవే లక్షణాలు - అంటే మలబద్ధకాన్ని అనుసరించి విరేచనాలవ్వడమనేది కనిపించవచ్చు. అయితే 50 సంవత్సరాల వయస్సు తరువాత ఈ లక్షణాలు ప్రస్పుటమైతే లోపల పాలిప్ లు, ట్యూమర్లు వంటివి పెరుగుతున్నాయేమో చూడాలి. సమస్య ఏమిటన్నది జాగ్రత్తగా పరీక్షించి దానికి తగిన చికిత్సను చేస్తే మలబద్ధకం తగ్గిపోతుంది.

 

2. అలవాటుగా మారిన మలబద్ధకం: పీచు పదార్థాలను, నీళ్లను తక్కువగా తీసుకునేవారిలోనూ, విరేచనానికి మందు వేసుకోవడం దినచర్యలో భాగంగా ఉన్నవారిలోనూ, పెద్ద పేగు కండరాలలో సహజ శక్తి కోల్పోతుంది. ఫలితంగా మలబద్దకం అలవాటుగా మారుతుంది. దీని నుంచి బయటపడాలంటే ఈ కారణాలను దృష్టిలో పెట్టుకోవాలి.

 

3. మందుల దుష్ఫలితాలు: చాలా రకాలైన అల్లోపతి మందులు మలబద్ధకాన్ని కలిగిస్తాయి. ఉదాహరణకు కొడైల్ కలిగిన దగ్గు మందులు, నొప్పిని తగ్గించే మందులు మొదలైనవి. అలాగే, బైబీపీని నియంత్రించడానికి వాడే విరాపమిల్, బీటా బ్లాకర్లూ. ఆస్టియోపోరోసిస్ లో వాడే కాల్షియం మందులూ, ఆందోళనను తగ్గించడం కోసం వాడే ట్రాంక్విలైజర్లు, కడుపులో మంటను తగ్గించడానికి వాడే యాంటాసిడ్స్ వీటన్నిటికి మలబద్ధకాన్ని కలిగించే గుణం ఉంది. అలోపతి మందుల వలన మలబద్దకం ప్రాప్తిస్తున్నప్పుడు ఆ విషయం మీ డాక్టరు దృష్టికి తీసుకువెళ్లండి.


4. పెద్ద పేగులో ట్యూమర్లు పెద్ద పేగులో ట్యూమర్లు మొదలయినవి తయారైనప్పుడు మల విసర్జనకు అడ్డుపడి మలబద్దకాన్ని కలిగిస్తాయి. పెరుగుదల వల్ల మలం రిబ్బనులాగా బైటకు వస్తుంది. పేగులు ఇన్ ఫేమ్ అయినప్పుడు కూడా ఇలాగే జరగవచ్చు, ఈ సమస్య రోజుల తరబడి ఉంటుంటే తదుపరి పరీక్షలు అవసరమవుతాయి.

ఔషధాలు: లవణ భాస్కర చూర్ణం, కాంకాయనవటి (గుల్మ), పీయూషవల్లి రసం, ప్రాణదా గుటిక

 

5. మలాశయంలో అల్సర్లు, పుండ్లు (అల్సరేటివ్ కోలైటిస్) మలానికి స్వచ్చమైన కాంతి కలిగిన ఎర్రని రక్తం అంటుకుపోయి కనిపిస్తే దానికి మొలల వ్యాధి కారణమయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా, మలం ఉపరితలానికి జిగురు, బంక వంటి పదార్థం అంటుకుని కనిపిస్తే దానిని మ్యూకస్ గా గ్రహించాలి. ఇలా అల్సరేటివ్ కొలైటిస్ లోనూ, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ లోనూకనిపించే అవకాశం ఉంది. వీటన్నిటిలోనూ మలబద్దకం ఉంటుంది. ఈ వ్యాధుల్లో మలబద్ధకానికి చెప్పిన సూచనలను పాటిస్తూ ఆయా వ్యాధులకు చెప్పిన ప్రత్యేక చికిత్సలను తీసుకుంటే సరిపోతుంది.

సూచనలు: ఆహారాన్ని కొద్దిమొత్తాల్లో తరచుగా తీసుకోవాలి. మషాలాల వాడకం తగ్గించాలి. మాంసం, గుడ్లు వంటివాటిని తీసుకుంటే లోపల కుళ్లిపోయి మలాశయాన్ని ఇరిటేట్ చేసే నైజం ఉంటుంది కాబట్టి వాడకూడదు. పంచదార, పెసలు, పిండి పదార్థాలు వాడకూడదు. ఈ వ్యాధిలో మంచివికావు. మజ్జిగ, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. తగినంతగా విశ్రాంతి తీసుకోవాలి.

గృహచికిత్సలు: శల్లకి (అందుగు) నిర్యాసాన్ని గాని లేదా యష్టి మధుకాన్ని గాని లేదా కలబంద గుజ్జుకాని పావుచెంచాడు మోతాదులో తేనె చేర్చి తీసుకోవాలి.

ఔషధాలు: యశద భస్మం, లోహభస్మం, ఈసబ్ గోల్ చూర్ణం, స్వర్ణపర్పటి.

6. పేగుల్లో రక్తస్రావం మలబద్దకంతో పాటు మలం నల్లగా వస్తుంటే పేగులలోపల ఎక్కడో బ్లీడింగ్ అవుతున్నట్లుగా అనుమానించాలి. అల్సర్లు, ట్యూమర్ల వంటివి దీనికి కారణం.

ఔషధాలు: బొలబద్ధరసం, చంద్రకళారసం, బోలపర్పటి, లాక్షాచూర్ణం, వాసారిష్టం

7. అర్శమొలలు/ఫిషర్లు మలబద్ధంకంతోపాటు సాధారణంగా అర్శమొలలు, ఫిషర్లు అనుబంధించి ఉంటాయి. ఫిషర్లవల్ల గాని, మొలలు చిట్లడం వల్ల గాని మల ద్వారం వద్ద నొప్పిగా అనిపిస్తుంటుంది. నొప్పి మల విసర్జన సమయంలో మరీ ఎక్కువవుతుంది. మలబద్దకం వలన ఇవీ, వీటి వలన మలబద్ధకమూ - ఇలా ఒక దాని వలన ,మరొకటి ఎక్కువవుతాయి.

ఔషధాలు: అర్శకుఠారరసం, అర్శోఘ్నవటి, అభయారిష్టం, బాహ్యప్రయోగం - జాత్యాది ఘృతం.

 

8. వృత్తి రీత్యా విభిన్న ప్రదేశాలలో తిరగాల్సి రావటం, లేదా కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ నీళ్లు తాగాల్సి రావటం. లేదా కొత్త రకమైన ఆహారం తినాల్సి రావటం వంటి వాటి వల్ల మలబద్దకం రావచ్చు.ఇలా జరుగుతుంటే తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

 

9. థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గటం (హైపోథైరాయిడిజం) మలబద్ధకంతోపాటు అధికబరువు కూడా ఉంటే అది థైరాయిడ్ గ్రంథి మందగించడాన్ని సూచిస్తుంది. ఈ గ్రంథి మందకొడిగా తయారైనప్పుడు శరీరపు క్రియలన్నీ నెమ్మదిస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ లక్షణాలతో పాటు చలి వాతావరణాన్ని తట్టుకోలేకపోవడం, నాడి వేగం తగ్గటం, చర్మం దళసరిగా మారడం, జుట్టు పలుచన కావడం, చమట పట్టకపోవడం, డిప్రెషన్ మొదలయినవి కనిపిస్తాయి.

థైరాయిడ్ గ్రంథి మందకొడిగా తయారైనప్పుడు కారణానుగుణమైన చికిత్సను చేయాల్సి ఉంటుంది. అపతర్పణ చికిత్సలు వీటిల్లో ప్రధానమైనవి. ఇవి శరీరం పనితీరును వేగవంతం చేస్తాయి.

ఔషధాలు: చతుర్ముఖ రసం, క్రమవృద్ధి లక్ష్మీ విలాస రసం, మకరధ్వజ సింధూరం పూర్ణ చంద్రోదయం, పంచబాణ రసం, స్వర్ణక్రవ్యాది రసం, వసంతకుసుమాకర రసం, ఆరోగ్యవర్ధినీ వటి, చంద్రప్రభావటి, గోక్షురాది గుగ్గులు, కాంచనార గుగ్గులు, మధుస్నుహి రసాయనం, మహాయోగరాజ గుగ్గులు, నవక గుగ్గులు, పంచతిక్త గుగ్గులు ఘృతం, త్రయోదశాంగ గుగ్గులు, యోగరాజ గుగ్గులు, భృంగరాజాసవం, దాత్రీలోహం, కుమార్యాసవం, కాంతవల్లభ రసం, లోహాసవం, లోహరసాయనం, లోకనాధ రసం, నవాయస చూర్ణం, ప్రాణదా గుటిక, రాజతలోహ, రసాయనం, స్వర్ణకాంత వల్లభరసం, సప్తామృత లోహం.

 

11. క్యాన్సర్ మలబద్దకంతోపాటు బరువు కోల్పోతుంటే - ముఖ్యంగా 50 ఏళ్ళు దాటిన వారిలో ఇలా జరుగుతుంటే ఉన్నపళంగా చెకప్ చేయించుకోవడం అవసరం. ఇలాంటి లక్షణాలు పేగులకు సంబంధించిన క్యాన్సర్ లో కనిపించే అవకాశం ఉంది.

 

11. వ్యాయామరహిత జీవితం: వ్యాయామం అనునిత్యం చేసేవారిలో మలబద్ధకం కనిపించదు. అయితే వ్యాయామం చేస్తున్న సమయంలో తగినన్ని నీళ్ళు తాగకపోతే మాత్రం శరీరంలోని ద్రవాంశం స్వేదం రూపంలో ఆవిరైపోయి, మలబద్ధకం ప్రాప్తించే అవకాశం ఉంది.

 

12. పెద్ద పేగులో కంతులూ, పెరుగుదలలు పెద్దపేగు చివరిభాగంలో ఏదయినా కంతి పెరిగితే అది మూత్రకోశం మీద ఒత్తిడిని కలుగచేస్తుంది. దీని వలన మలబద్దకంతో పాటు పలుమార్లు మూత్రానికి వెళ్ళాల్సి వస్తుంది. దీనికి తదుపరి పరీక్షలు అవసరమవుతాయి.

 

13. నరాల దౌర్భల్యం (నర్వ్ వీక్నెస్) మలబద్దకంతోపాటు మూత్రం బట్టల్లో పడిపోవడం అనే లక్షణం నరాలు వ్యాధిగ్రస్తమవడాన్ని సూచిస్తుంది. వెన్నుపూసలో ట్యూమర్లు పెరగడం, డిస్క్ స్లిప్కావడం వంటి సందర్భాలలో కూడా ఇలా జరగవచ్చు, దీనికి శమనౌధాలతోపాటు ఆయుర్వేద పంచకర్మ చికిత్సల్లో ఒకటైన వస్తికర్మను చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది ఒక ఎనిమా లాంటి పధ్ధతి. నరాలు శక్తివంతమవుతాయి.

ఔషధాలు: మాణిక్య భస్మం, వాతకులాంతక రసం, సిద్ధమకరద్వజం, కంజనకారి రసం, రజత సింధూరం, విషతిందుకవటి.

 

సలహాలు: 1. ఇతర అలవాట్ల మాదిరిగా మలబద్ధకం కూడా ఒక అలవాటే. దీనిని క్రమంగా వదిలించుకోవాలి తప్పితే, హైరానా పడిపోకూడదు.

2. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. గోధుమలు, మొక్కజొన్నలు, రాగులు, ఓట్స్, బార్లిగింజలు, ఇతర గింజ ధాన్యాలు (పొట్టుతో కూడిన పెసలు, కందులు, బఠాణీలు), పండ్లు (తోలుతో సహా), కూరగాయలు (చెక్కుతో సహా), బియ్యం (తవుడుతో సహా) - వీటన్నిటిలో ఫైబర్ ఉంటుంది. వీటిని హఠాత్తుగా మొదలెట్టకూడదు. ఆహారంలో క్రమంగా చేర్చుకుంటూ వెళ్లాలి. అలా కాకుండా, ఒకేసారి మొదలెడితే, అజీర్ణం కారణంగా కడుపు ఉబ్బరింపు, విరేచనాలు, గ్యాస్ తయారుకావడం వంటి అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి.

3. అరటిపండు, గింజలు తీసివేసిన జామకాయ వంటివి మలబద్దకంలో అన్ని విధాలా మంచివి.

4. ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు కనీసం ఎనిమిది నుంచి పన్నెండు గ్లాసులు నీళ్లు తాగాలి. ఇలా చేయడం వల్ల మలం మృదువుగా, స్నిగ్ధంగా, హెచ్చుగా తయారవుతుంది. ఉదయం లేచిన తరువాత వెంటనే మూడు నాలుగు గ్లాసుల నీళ్లు తాగండి. అలాగే ఆహారానికి అరగంట ముందుగాని, అరగంట తరువాత గాని మిగిలిన నీళ్లు తాగండి. (ఆహారంతో పాటు నీళ్లు ఎక్కువగా తాగితే జీర్ణరసాలు పలుచబడి అజీర్ణం ప్రాప్తిస్తుంది)

5. రోజు మొత్తంలో మీకు ఏ సమయంలో అనువుగా ఉంటుందో ఆ సమయంలోనే మలవిసర్జన చేయండి. చాలామందికి ఉదయం లేచిన తరువాత మలవిసర్జనకు అనువుగా ఉంటుంది, మరికొంతమందికి ఆహారం తిన్న తరువాత పేగుల కదలిక మొదలై మలవిసర్జన జరుగుతుంది. గ్యాస్ట్రోకోలిక్ రిప్లక్స్ వల్ల ఇలా జరుగుతుంది తప్పితే ఇది వ్యాధి కాదు.

6. మలవిసర్జనకు వెస్ట్రన్ కమోడ్ కు బదులు ఇండియన్ కమోడ్ ను ఉపయోగించడం మంచిది. దీని వల్ల పొట్టమీద ఒత్తిడి పడి మలవిసర్జన సజావుగా జరుగుతుంది. ఒకవేళ వెస్ట్రన్ కమోడ్ ను ఉపయోగించడం తప్పదనుకుంటే, పాదాల క్రింద ఎత్తైన స్టూలు నొకదానిని అమర్చుకోండి.

7. రోజువారీగా వ్యాయామం చేయడం వల్ల మలబద్దకం దరిచేరదు. చాలా మందిలో వయస్సు పెరుగుతున్నకొద్ది స్థిరమైన జీవన శైలి అలవడుతుంది. ఇలాంటి వారు సహజంగానే శారీరక శ్రమకు దూరమవుతుంటారు. కాబట్టి మీరు ప్రత్యేక శ్రద్ధతో వ్యాయామం చేయాలి. వ్యాయామానెప్పుడు అర్థశక్తిగానే చేయాలని ఆయుర్వేదం చెపుతుంది.

8. ప్రతిరోజూ కనీసం నలభై అయిదు నిమిషాలు నడవండి. నడిచేటప్పుడు మొదటి పదిహేను నిముషాలు నెమ్మదిగా నడవాలి. తర్వాత పదిహేను నిమిషాలు వేగంగా, చేతులు ఊపుతూ నడవాలి. చివరి పదిహేను నిమిషాలు మళ్లీ నెమ్మదిగా నడవాలి. నడవడం కుదరకపోతే, ఇంట్లోనేఏదన్నా వ్యాయామం చేయండి. యోగాసనాలు చేయదల్చుకుంటే, ముందుకు, వెనుకకు వంగుతూ చేసే ఏ భంగిమైనా మంచిదే.

9. ఉదయం లేచిన తర్వాత వెల్లికిలా పడుకొని పొట్టప్రాంతంలో మసాజ్ చేసుకోండి.కుడిచేయి పిడికిలి బిగించి పొత్తికడుపు ప్రదేశం నుంచి మొదలెట్టి, ఒత్తిడి ప్రయోగిస్తూ, కుడి ప్రక్కనుంచి ఎడమ ప్రక్కకు నలుచదరంగా మసాజ్ చేసుకోవాలి. దీనితో పెద్ద పేగు సంకోచం వ్యాకోచాలు ఉత్తేజితమవుతాయి. చెయ్యి తేలికగా కదలడం కోసం పొట్ట మీద టాల్కం పౌడర్ జల్లుకోవచ్చు, ఇలా ప్రతిరోజూ కనీసం ఇరవై నుంచి ముప్పై రౌండ్లు చేసేట్టయితే,. పేగులో 'పెరిస్టాటిక్ మూవ్ మెంట్' సక్రమంగా జరిగి మలబద్దకం దరిచేరకుండా ఉంటుంది.

10. మానసిక ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండండి. టెన్షన్లు తగ్గించుకుంటే విరేచనం సాఫీగా జరుగుతుంది.

11. ఒత్తిడి వల్ల శరీరంలో ప్రతిక్రియా వేగవంతమౌతుంది. ఫలితంగా నీరు శాతం తగ్గిపోతుంది. దీనితో మలం గట్టిపడి మలబద్ధత ప్రాప్తిస్తుంది. యోగా, ధ్యానం, మెడిటేషన్, హిప్నోసిస్ ఇలాంటివన్నీ రిలాక్సేషన్ ని కలిగించి, ఒత్తిడిని తగ్గించగలుగుతాయి. అంతేకాదు - మనసారా నవ్వడం వల్ల కూడా పొట్ట కండరాలు మసాజ్ కు గురవుతాయి. పైగా దీని వల్ల కూడా రిలాక్సేషన్ లభిస్తుంది.

12. ఇంగ్లీషు మందులు కొన్నిటికి మలబద్దకాన్ని కలిగించే నైజం ఉంది. ముఖ్యంగా క్యాల్షియం, అల్యూమినియం కలిగిన యాంటాసిడ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మూత్రాన్ని జారీచేసే మందులు, డిప్రెషన్ మందులు, ఎలర్జీ మందులు మొదలైన వాటి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి.

13. గ్యాస్ తయారయ్యే పదార్థాలను మానేయాలి. చిక్కుడు, దోసకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఉల్లిపాయ, శెనగపిండి వంటకాలు, కోడిగుడ్లు, కూల్ డ్రింక్స్, పులిసిన పదార్థాలు, వేపుడు పదార్థాలు, సరిగా ఉదికించని పదార్థాలు గ్యాస్ ను తయారు చేసే నైజం ఉంది. వీటివల్ల కడుపుబ్బరింపు, దానిని అనుసరించి మలబద్దకం ప్రాప్తిస్తాయి.

14. మలవిసర్జన చేసేటప్పుడు వలవంతంగా ముక్కకూడదు; ఇలా చేస్తే ఆర్శమొలలు తయారై మలాన్ని అడ్డుకొని తిరిగి మలబద్దకాన్ని కలిగిస్తాయి.

15. పిల్లలలో మలబద్దకం ఉన్నప్పుడు కుప్పింట (హరిత మంజరి) ఆకులను సపోజిటరీలాగా చేసి మల ద్వారంలో చొప్పించాలి. లేదా తమలపాకు తొడిమను ఆముడంలో ముంచి కూడా ఇలాగే చేయవచ్చు. ఇలా కాదనుకుంటే గాడిదగడపాకును ముద్దగానూరి పొట్టపైన పట్టు వేసినా సరిపోతుంది

. 16. పెద్ద వారిలో మలబద్దకం పోగొట్టడానికి అనేక రకాలైన ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. వాటిలో కొన్ని కేవలం మల విసర్జనకు ఉపయోగపడితే, కొన్ని ఆహారాన్ని పచనం చేసే విధంగా కూడా ఉంటాయి. కొన్ని మలాన్ని యథాతథంగా విసర్జింపచేస్తే మరికొన్ని అపక్వ మలాన్ని పూర్తిగా పక్వం చేసి మరీ విసర్జింపచేస్తాయి. ఈ మందులను అవసరానుసారం ఆయా సందర్భాలను బట్టి వాడవలసి ఉంటుంది.

17. త్రిఫలా చూర్ణం, పంచనకారచూర్ణాలు మలబద్దకాన్ని తగ్గిస్తాయి. ఇక్కడో ముఖ్యమైన విషయం ప్రస్తావించాలి. మలబద్దకాన్ని పోగొట్టుకోవడానికి వాడే కొన్ని రకాల చూర్ణాలలో లవణాలు కలుస్తాయి కనుక రక్తభారం (బిపీ) అధికంగా ఉండే వారు వాటిని వైద్య సలహా మేరకు మాత్రమే వాడాల్సి ఉంటుంది.

18. పంచకర్మ చికిత్సా విధానంలో ఒకటైన విరేచన కర్మ ద్వారా మలబద్దకాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు.

గృహ చికిత్సలు: 1. కరక్కాయ పెచ్చుల చూర్ణాన్ని చెంచాడు మోతాదుగా అంతే భాగం ఉప్పు కలిపి రాత్రి పడుకునేముందు తీసుకోవాలి.

2. రేలపండు గుజ్జును చెంచాడు మోతాదుగా రెండు చెంచాలు చెక్కెర కలిపి గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాలి.

3. రోజు కనీసం పావుకిలో నల్ల ద్రాక్ష పండ్లను తినాలి. తాజా పండ్లు దొరకని పక్షంలో ఎండు ద్రాక్షలను 24 గంటలు నీళ్లలో నానేసి నీళ్ళతోసహా తీసుకోవాలి.

4. వస కొమ్ము, కరక్కాయ పెచ్చులు, చిత్రమూలం వేరు, పిప్పళ్లు, అతివస, చెంగల్వ కోష్టు, యవక్షారం వీటిని సమభాగాలు తీసుకొని అన్నిటిని పొడిచేసికొని నిలువచేసుకోవాలి. ఈ పొడిని అరచెంచాడు మోతాదుగా రాత్రిపూట పడుకునేముందు తీసుకోవాలి.

5. అతసీతైలం (లిన్సీడ్ ఆయిల్) భోజనానికి ముందు చెంచాడు పరిమాణంలో నీళ్లతో కలిపి తీసుకుంటే మలం హెచ్చుమొత్తాల్లో మృదువుగా విసర్జితమౌతుంది.

ఔషధాలు: త్రిఫలచూర్ణం, లశునాదివటి, అభయారిష్టం, పంచసకార చూర్ణం, ఏరండపాకం.