మూత్రాశయం (బ్లాడర్)

 

1. నొప్పితోపాటు ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాలనిపిస్తుందా?

మూత్రకోశపు ఇన్ఫెక్షన్ (సిస్టైసిస్)

2. మూత్రంలో రక్తం కనిపిస్తుందా?

మూత్రాశయంలో రాళ్ళు (కిడ్నీ / బ్లాడర్ స్టోన్స్)

3. మీరు పురుషులైతే - మూత్ర విసర్జన మొదలెట్టాలన్నా, లేదా ఆపాలన్నా కష్టతరంగా ఉంటుందా?

ప్రోస్టెట్ గ్రంథి వాపు (ప్రోస్టటైటిస్)

 

మూత్రాశయం ఉదర ప్రదేశంలో సరిగ్గా మధ్య ప్రాంతంలో, కింది భాగాన అమరి ఉంటుంది.మూత్ర పిండాలనుంచి మూత్రనాళాల ద్వారా వచ్చే మూత్రాన్ని సేకరించి కింద నుండే కండర నిర్మిత కవాటం ద్వారా బైటకు పంపించడం దీని పని. మూత్రాశయం నిండినప్పుడు దాని గోడలు సాగి నరాలను ఉత్తేజితం చేస్తాయి. ఫలితంగా మూత్ర విసర్జన ప్రక్రియ జరుగుతుంది. ఈ పరంపరలో తేడాలు సంభవిస్తే నొప్పి వచ్చేందుకు అవకాశముంది.

1. మూత్రకోశపు ఇన్ఫెక్షన్ (సిస్టైసిస్):

మూత్ర మార్గానికి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు దానిని తగ్గించుకునే ప్రయత్నంలో మూత్రాశయం ఎక్కువగా సంకోచిస్తుంది. దీనితో మూత్రాశయం ఉండే ప్రాంతంలో నొప్పి అనుభవమవుతుంది. పొత్తికడుపు ప్రాంతంలో నొప్పిగా ఉండటంతోపాటు మూత్రం మంటగా ఉంటే మూత్రశాయానికి ఇన్ఫెక్షన్ సోకినట్టుగా అనుమానించాలి. సిస్టయిటిస్ గా పిలిచే ఈ వ్యాధిలో చందనం, తిప్పతీగ, గలిజేరు, కుశగడ్డి వంటివి అమితమైన చలువను చేసి మంటను మటుమాయం చేస్తాయి. మూత్రాన్ని జారీచేసి తద్వారా ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గడానికి దోహదపడతాయి. సామాన్యంగా మూత్ర మార్గానికి సోకే వ్యాధులు చాలా మొండిగా ఉంటాయి. యాంటీబయాటిక్స్ వాడినంతసేపూ తగ్గినట్టే తగ్గి ఆ మందుల ప్రభావం తగ్గిపోయిన తరువాత తిరగబడుతూ ఉంటాయి. ప్రత్యామ్నాయంగా ఆయుర్వేద ఔషధాలను కొంత కాలంపాటు విడవకుండా వాడుతూ ఈ వ్యాధికి పరోక్ష కారణాలుగా నిలిచే మూత్రమార్గావరోధం, మూత్ర్ర మార్గంలో ఏర్పడినరాళ్లు ఇత్యాది వాటికి చికిత్స తీసుకుంటే శాశ్వత ఫలితం కలుగుతుంది.

గృహచికిత్సలు: 1. చిన్న ఏలకుల చూర్ణం (పావు చెంచాడు), అరిటిబేదె రసం (అరకప్పు) రెండూ కలిపి తీసుకోవాలి. 2. కలకండ, ద్రాక్షలను ముద్దగానూరి పెరుగుమీద తేటతో తీసుకోవాలి. 3. బూడిదగుమ్మడికాయ రసం (అరకప్పు), యవక్షారం (చిటికెడు), పంచదార (రెండు చెంచాలు) అన్నీ కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 4. పల్లేరు మొక్కను సమూలంగా తెచ్చి, కషాయం కాచి పూటకు అరకప్పు చొప్పున పంచదార, తేనెలు కలిపి రెండుపూటలా తీసుకోవాలి. 5. ఏలకులు, కొండపిండి వేళ్ళు, శిలాజిత్తు, పిప్పళ్ళు అన్నీ సమానభాగాలు తీసుకుని పొడిచేయాలి. దీనిని పూటకు అరచెంచాడు మోతాదుగా అరకప్పు బియ్యపు కడుగు నీళ్ళతో పుచ్చుకోవాలి.

ఔషధాలు: ఏలాదిచూర్ణం, శుద్ధ శిలాజిత్తు తారకేశ్వరరసం, చంద్రప్రభావటి, ప్రవాళభస్మం, శతావరిఘృతం.

 

 

2. మూత్రాశయంలో రాళ్ళు (కిడ్నీ/బ్లాడర్ స్టోన్స్):

మూత్రమార్గంలో ఏర్పడిన రాయి ముందుకు కదిలి కిందకు జారేటప్పుడు ఉదర ప్రదేశంలో పదునుగా, తీవ్రంగా నొప్పి వస్తుంది. రాయి జరుగుతూ వెళ్లేప్పుడు సున్నితమైన మూత్రమార్గపు పొరలను చీరుకునేట్లు చేస్తుంది. ఫలితంగా రక్తస్రావం జరిగి మూత్రం ఎర్రని రంగులో కనిపిస్తుంది. మూత్రమార్గంలో రాళ్లకు సంబంధించి ఔషధ చికిత్సను పరిగణించాలనుకున్నప్పుడు అన్ని వైద్య విధానాలకన్నా మూలికా వైద్యమే మిన్నగా ఉంటుంది. పాషాణ భేద అనే మూలిక ఈ సందర్భంగా ప్రత్యేకంగా పేర్కొనదగినది. కొండచరియలలో, రాళ్ల మధ్య నెర్రెల్లో పెరిగి ఈ చిన్న మూలిక తరచూ మూత్రమార్గంలో రాళ్లు ఏర్పడే నైజం ఉన్న వారికి సంజీవనిలా పనిచేస్తుంది.

మూత్ర మార్గంలో రాళ్లు ఏర్పడుతున్నప్పుడు రోజుకు కనీసం మూడు లీటర్లు నీళ్లు తాగాలి. వాతావరణం ఉక్కపోతగా ఉన్నప్పుడు ఈ మోతాదును మరింతగా పెంచాల్సి ఉంటుంది. ఒకటి రెండు రోజులు మీ మూత్ర ప్రమాణాన్ని కొలిచి చూడండి. ఇది కనీసం రెండు లీటర్లు ఉండాలి. అలా లేదంటే మీరు మరింత నీటిని తాగాల్సిన అవసరం ఉందని గుర్తించండి.

కొంతమంది విటమిన్లు ఎంత వాడితే అంతమంచిదని అదే పనిగా వేసుకుంటూ ఉంటారుగాని, అవసరానికి మించి మిటమిన్లు వేసుకుంటే మేలు జరగకపోగా కీడే ఎక్కువగా జరుగుతుంది. ప్రస్తుత సందర్భంలో విటమిన్ - డి గురించి మరీ ముఖ్యంగా చెప్పాల్సి ఉంది. మూత్ర మార్గంలో రాళ్లు ఉన్న వారికి విటమిన్ - డి వాడటం ఎంతమాత్రం అభిలషణీయం కాదు. అలాగే పాల పదార్థాలు, పాలకూర వంటివి కూడా ఈ వ్యాధి నైజం ఉన్నవారికి సరిపడవు.

గృహచికిత్సలు: 1. బొప్పాయి వేరును తెచ్చి, పొడిచేసి, పూటకు పావు చెంచాడు చొప్పున మూడుపూటలా తీసుకోవాలి. 2. ముసాంబరాన్ని చిటికెడు ప్రమాణంగా ద్రాక్షపండులో మాటుపెట్టి తీసుకోవాలి. 3. ఆముదపు వేరు కశాయానికి (అరకప్పు) యవక్షారాన్ని (చిటికెడు) కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 4. పసుపును (అరచెంచాడు) బెల్లంతో కలిపి, బియ్యపు కడుగునీళ్ళతో పుచ్చుకోవాలి. 5. పులిమెరిపట్ట, శొంఠి, పల్లేరు వీటి కషాయానికి బెల్లం కలిపి అరకప్పు మోతాదుగా రెండు పూటలా మండలం (40 రోజులు) పాటు తీసుకోవాలి, 6.దోసగింజల కషాయాన్ని లేదా కొబ్బరి పువ్వుల ముద్దను పాలతో కలిపి కొన్ని రోజులు పుచ్చుకోవాలి. 7. పిల్లిపీచర గడ్డల రసాన్ని (అరకప్పు) ఆవుపాలతో కలిపి తాగాలి. 8. కొడిశపాలపట్ట, లేదా వేరుచూర్ణాన్ని అరచెంచాడు చొప్పున అరకప్పు పెరుగుతో కలిపి రెండుపూటలా తీసుకోవాలి. 9. కొండపిండ వేళ్ళ కషాయానికి (అరకప్పు) శుద్ధిచేసిన శిలాజిత్తును (చిటికెడు) కలిపి పంచదార చేర్చి కొన్ని రోజుల పాటు రెండుపూటలా తీసుకోవాలి.

ఔషధాలు: చంద్రప్రభావటి, గోక్షురాదిగుగ్గులు, వరుణాదిక్వాథం, హజ్రల్యహూద్ భస్మం, సహచరాది తైలం.

3. ప్రోస్టెటైటిస్ గ్రంథి (ప్రోస్టటైటిస్):

ప్రొస్టేట్ గ్రంథి అనేది మగారిలో మూత్రాశయపు అగ్ర భాగాన్నీ, అలాగే మూత్ర ప్రసేకాన్నీ చుట్టి ఉంటుంది.రేతస్సు ద్రవయుక్తంగా, స్నిగ్ధంగా ఉండటానికి కారణం ఈ గ్రంథి విడుదల చేసే స్రావాలే. ఇన్ఫెక్షన్ల చేతకాని, వయస్సు చేతకాని, ఈ గ్రంథి వ్యాధిగ్రస్తమైతే, వాపు జనించి మూత్రమార్గం మీద ఒత్తిడి పడుతుంది. దీని ఫలితంగా ప్రతి అరగంటకూ మూత్ర విసర్జన చేయాలనించడం, తీరా అలా చేస్తున్నప్పుడు మూత్రం ధారాళంగా రాకపోవడం, మూత్ర విసర్జనను తేలికగా ప్రారంభించలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శిలాజిత్ అనే పదార్ధం ప్రధాన ద్రవ్యంగా ఉండే ఔషధాలు ఈ వ్యాధిలో సమర్ధవంతంగా పనిచేస్తాయి.

ఔషధాలు: అభ్రక భస్మం, చందనాది వటి, చందనాసవం, చంద్రప్రభావటి, గోక్షురాది చూర్ణం, గుడూచి సత్వం, గోక్షురాది గుగ్గులు, కర్పూర శిలాజతు భస్మం, కాంచనార గుగ్గులు, స్వర్ణవంగం, త్రిఫలాది క్వాథ చూర్ణం.