ఎపెండిక్స్

 

1. కడుపునొప్పి బొడ్డు పరిసర ప్రాంతాల్లో మొదలై, ఉదరప్రాంతంలో - కుడిప్రక్క, కింది భాగంలో కేంద్రీకృతమై ఉందా?

ఇరవై నాలుగు గంటల కడుపునొప్పి (ఎపెండిసైటిస్)

 

1. ఇరవైనాలుగు గంటల కడుపునొప్పి (ఎపెండిసైటిస్):

ఎపెండిసైటిస్ అనేది 'ఇరవైనాలుగు గంటల కడుపు నొప్పి'గా చాలామందికి తెలుసు. ఎపెండిసైటిస్ అనడంతోనే చాలామంది ఆసుపత్రీ, ఆపరేషన్ మొదలైన వాటిని ఊహించుకుని హడాలిపోతుంటారుకాని, నిజానికి ప్రతి ఆరు కేసుల్లోనూ ఒక దానికి మాత్రమే అటువంటి అవసరం వస్తుంది. వయస్సు వారీగా చూస్తే పిల్లలు, యుక్తవయస్కులే దీని బారిన ఎక్కువగా పడుతుంటారు. ఈ తరహా నొప్పిలో మొదట బొట్టుకు కాస్త దిగువన నులినొప్పి మొదలవుతుంది. రెండుమూడు గంటల తరువాత దానంతట అదే తగ్గిపోవచ్చు, అలాంటి సందర్భాలలో పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఐతే, ఒకోసారి ఈ నొప్పి తగ్గకుండా ఉధృతమయ్యే అవకాశం ఉంది. అస్పష్టంగా మొదలైన నొప్పి కొంచెం కుడివైపుకు జరిగి స్పష్టతను సంతరించుకుంటుంది. ఇప్పుడో ముఖ్య విషయం చెప్పాలి. అందరిలోనూ ఎపెండి సైటిస్ వలన వచ్చే నొప్పి ఇక్కడే ఉండాలని లేదు; ఎపెండిక్స్ ఏ భంగిమలో అమరి ఉంటుందో నొప్పి ఆ ప్రకారం వస్తుంది. ఎపెండిసైటిస్ వచ్చినప్పుడు జ్వరం, మలబద్దకం, విరేచనాలు, వాంతులు, ఆహారమంటే అయిష్టత ఇటువంటివి ఉంటాయి, నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఎపెండిక్స్ ప్రాంతంలో ముట్టుకుంటే చాలు, విలవిలలాడతారు.

ఆయుర్వేదం ఎపెండిసైటిస్ ను 'ఆంత్రపుచ్ఛప్రదాహం' అని పిలిచింది. ఈ వ్యాధిని చాలా సందర్భాలలో శాస్త్ర చికిత్సతో పనిలేకుండానే శూలహరణ ఔషధాలతో నియంత్రించవచ్చు. అయితే ఇది ఔషధ సాధ్యమా, శస్త్ర చికిత్స సాధ్యమా అనేది వైద్యులు తేల్చాల్సి వుంటుంది.

ఒకవేళ వైద్య సహాయం అందనంత దూరంలో ఉన్నప్పుడు ఈ నొప్పి వస్తే ఎగుడుదిగుడుగా సాగే మార్గంలో ముందుకు వెళ్లడం ఏ మాత్రం మంచిది కాదు. ఎపెండిక్స్ కు పూర్తిస్థాయిలో విశ్రాంతి నివ్వాలి. దీనికోపద్ధతి ఉంది: పడకకుర్చీలో కూర్చునే మాదిరిగా వీపును కాస్త ఎత్తులోఉంచి, మోకాళ్ల కింద మెత్తను అమర్చుకోండి, ఇలా చేయడం వలన ఉదర ప్రాంతంలో ఉండే కండరాలలో బిగువు తగ్గి ఎపెండిక్స్ పైన ఒరిపిడి తగ్గుతుంది. ఒకవేళ ప్రమాదవశాత్తూ, ఎపెండిక్స్ ఛిద్రమైనా, పేగుల్లోని స్రావాలు ఉదరకోశమంతా వ్యాపించకుండా కిందకు చేరుకుని తటస్థంగా మారేందుకు అవకాశం ఉంటుంది. విరేచనమవటం కోసం మందునుగాని, ఎనిమానుకాని పొరపాటున కూడా తీసుకోకూడదు. అలాగే నోటి ద్వారా ఏ విధమైన ఆహారాన్నీ తీసుకోకూడదు. ఒకవేళ నోరు పిడచకట్టుకుపోతున్నట్లూ, మూత్రం ఇంకిపోతున్నట్లూ అనుమానంగా ఉంటే కొంచెం 'టీ'లో నిమ్మరసం పిండుకుని ఒకటి రెండు చెంచాలు చప్పరించవచ్చు. ఇది కూడా వాంతులు నెమ్మదించిన తరువాతనే. నొప్పి ఉన్నచోట ఐస్ గడ్డలతో సుతారంగా శీతలోపచారాలు చేయగలిగితే ఇన్ ఫ్లమేషన్ తగ్గేందుకు అవకాశం ఉంది. ఈ పద్ధతులలో పరిస్థితి విషమించకుండా చూసుకుంటే ఈలోగా వైద్యసహాయం కోసం ప్రయత్నించాలి.

ఔషధాలు: ఆరోగ్యవర్ధినీవటి, పునర్నవారిష్టం, దశమూలారిష్టం, లవణభాస్కర చూర్ణం, శంఖభస్మం, కపర్థికాభస్మం, సర్జికాక్షారం, అగ్నితుండివటి, ఆహిఫేనాదివటి, కర్పూరాదివటి, బృహత్ వాత చింతామణి రసం, పునర్నవాదిమండూరం, శంఖవటి, శూలహరణయోగం.

ప్రేగులు

ఎపెండిక్స్ తో పాటు పేగుల వలన కూడా ఈ ప్రాంతంలో నొప్పి జనించేందుకు అవకాశం ఉంది.

మూత్రనాళం (యూరెటర్)

ఇది మూతాన్ని మూత్రపిండాల నుంచి మూత్రకోశం వరకు చేరవేస్తుంది. దీనికి నరాలు కూడా ఎక్కువగా చేరడం వల్ల ఏ కాస్త తేడా సంభవించినా అది నొప్పి రూపంలో బహిర్గతమవుతుంది. మూత్ర మార్గంలో రాళ్లు తయారై కదలినప్పుడు నొప్పితోపాటు మూత్రం రక్తయుక్తంగా కనిపిస్తుంది. నొప్పి ఆగి ఆగి వస్తుండటం దీనిలో ప్రధాన లక్షణం. అలాగే దీనిలో నొప్పి పక్కటెముకల కింద ప్రాంతంలో గాని, గజ్జలు, వృషణాలు ఈ మధ్యలో ఎక్కడైనా గాని ఉండవచ్చు. ఒకోసారి రాళ్లు లేక పోయినా, చుట్టుపక్కల పెరిగిన నిర్మాణాలు కాని, కంతులు కాని మూత్రనాళం మీద ఒత్తిడి కలుగచేసి నొప్పిని కలిగిస్తాయి. స్నేహస్వేదాల వంటి ఆయుర్వేద చికిత్సలతోపాటు గోక్షుర, పునర్నవంటి మూలికల ప్రయోగం ఈ స్థితిలో అత్యంత ఉపయుక్తంగా ఉంటుంది.

అండకోశాలు (ఒవరీస్)

స్త్రీలలో ఉండే ముఖ్యమైన శారీరక నిర్మాణాలు ఇవి. బాదం ఆకారంలో, గర్భాశయానికి ఇరుపక్కలా బీజవాహికలు తెరుచుకునే చోట ఇవి అమరి ఉంటాయి. ఇవి అండాలను విడుదల చేయడమే కాకుండా స్త్రీ - సెక్స్ హార్మోన్ల ఉత్పత్తికి సైతం దోహదపడతాయి. ఈ అండకోశాలలో గడ్డలూ, కంతులూ ఏర్పడి నొప్పిని కలిగించే అవకాశముంది. కొన్నిసార్లు బహిష్టు స్రావానికి కారణమైన కణజాలాలు దిశ మార్చుకొని గర్భాశయేతర ప్రాంతాలకు ప్రసరించి, అండకోశాల మీద పొరలాగా ఏర్పడి మాసానుమాసం బహిష్టు స్రావం మాదిరిగా స్రవించడం మొదలెడితే కూడా నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఎండోమెట్రియోసిస్ గా పిలిచే ఈ వ్యాధిలో లోధ్ర, అశోక వంటి మూలికలు సమర్ధవంతంగా పనిచేస్తాయి.

బీజవాహికలు (ఫ్యాలోపియాన్ ట్యూబ్స్)

స్త్రీ శరీరంలో ఇవి అండకోశాలను గర్భాశయంతో కలవడమే కాక, అండాన్ని శుక్రకణంతో ఫలదీకరణం చెందించడానికి మాధ్యమంగా పనిచేస్తాయి. అండకోశంలో విడుదలైన అండం ఈ బీజవాహిక ద్వారా పయనించి గర్భాశయాన్ని చేరుకుంటుంది. మధ్యలో ఫలదీకరణం చెందితే ఈ అండం గర్భాశయంలో పిండంగా పెరుగుతుంది. ఒకోసారి, దురదృష్టవశాత్తూ అండం ఫలదీకరణం చెందిన తరువాత జీజవాహికలోనే పెరగవచ్చు. అలాంటి సందర్భాలలో గర్భాశయంలో ఉండేలాంటి వాతావరణమూ, అమరికా బీజవాహికలో ఉండవు కాబట్టి బీజవాహికలు అసాధారణంగా ఉబ్బిపోయి ఛిద్రమయ్యే అవకాశం ఉంది. దీనితో శరీరంతర్గతంగా రక్తస్రావమై ప్రాణప్రమాదం ఏర్పడవచ్చు. గర్భం ధరించిన తొలినాళ్లలో ఎవరికైనా ఉదరప్రదేశంలో కింద భాగాన నొప్పి వస్తూ, తల తిరుగుతున్నట్లు, స్పృహ కోల్పోతున్నట్లు అనిపిస్తుంటే అత్యవసరంగా వైద్య సహాయం పొందాలి.

కొన్నిసార్లు జ్వరం, తెల్లబట్ట వంటి వాటితోపాటు కడుపునొప్పి కూడా ఉంటుంది. ముఖ్యంగా కాపర్ - టీ అనే కుటుంబ నియంత్రణ సాధనాన్ని అమర్చుకున్న వారిలో భార్యాభర్తల కలయిన తరువాత ఇలా జరుగుతుంటే గర్భాశయ పరిసర ప్రాంతాలు ఇన్ ఫ్లేమ్ అయినట్లుగా అర్థం చేసుకోవాలి. దీనిని అశ్రద్ధ చేస్తే, శాశ్వతంగా సంతానరాహిత్యం ప్రాప్తించే ప్రమాదం ఉంది.


ఉదరంలో ఎడమవైపు కింది భాగం

మన శరీరంలో కొద్దిపాటి మినహాయింపులతో కుడివైపు ఎలా ఉంటుందో ఎడమవైపు కూడా అలాగే ఉంటుంది. కుడివైపు కిందిభాగంలో కడుపునొప్పికి, ఏ రకమైన కారణాలైతే దోహదపడతాయో, ఎడమవైపు భాగానికి అవే వర్తిస్తాయి. కాకపొతే, కుడివైపు ఎపెండిక్స్ ఉంటుంది; ఎడమవైపు ఉండదు. పోతే, ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ వల్ల కూడా ఈ ప్రాంతంలో నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఆయుర్వేద శాస్త్రంలో వివరించిన 'గ్రహణి' అనే వ్యాధికి దీని లక్షణాలు సరిపోతాయి. ఈ వ్యాధిలో పెద్ద పేగుల కండరాలు మాటిమాటికీ సంకోచానికి లోనవుతుండటం వలన తెరలు తెరలుగా కడుపునొప్పి వస్తుంటుంది. ఇంతే కాకుండా ఈ ప్రాంతంలో నొప్పి ఉపశమించకుండా కొనసాగుతున్నపుడు క్యాన్సర్, కణితులు మొదలైన వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని విశ్లేషించాల్సి ఉంటుంది.

పొత్తికడుపు ప్రాంతం: ఈ భాగంలో వెన్నుపాముకు ఇరుప్రక్కలా అమరిన లింఫ్ గ్రంథులు, మూత్రాశయం, పెద్దపేగు తాలూకు చివరి భాగం, గర్భాశయం (స్త్రీలలో) ఇవన్నీ ఉంటాయి. శరీరంలో అన్నిటికన్నా పెద్దదైన బృహద్దమని (అయోర్టా) ఈ ప్రాంతంనుండే రెండు ధమనులుగా విడిపోయి, తుంటి ప్రదేశం మీదగా రెండు కాళ్లలోలో ప్రవేశిస్తుంది.