గర్భాశయం (యుటిరస్)

1. ఉదర ప్రదేశం కింద భాగంలో వాపు ఉండటంతోపాటు, నెలసరిలో అవకతవకలు, ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సిరావడం ఇటువంటివి ఉంటాయా?

గర్భాశయంలో నారవంటి కండర పెరుగుదలలు తయారవ్వటం ( ఫైబ్రాయిడ్స్)

2. భార్యాభర్తల కలయిక తరువాత నొప్పిగా అనిపిస్తుందా?

కటివలయంలో వాపు (పెల్విక్ ఇన్ ఫ్లమేటరీ డిసీజ్)

 

గర్భాశయంలో స్త్రీలలో ఉండే ఓక ముఖ్యమైన అంతరావయవం. హార్మోన్ల ప్రభావంతో మాసానుమాసం లోపలి పొరను బహిష్టు స్రావం రూపంలో విడుదల చేస్తూ ఉండటం దీని ముఖ్య విధులలో ఒకటనే విషయం తెలిసిందే. దీని ముఖ భాగం యోనిలోనికి తెరుచుకుని ఉంటుంది. అలాగే దీనికి ఇరుప్రక్కలా బీజవాహికలుంటాయి. ఇది ఉదర ప్రదేశంలో కింది భాగాన, మూత్రాశాయానికి, పెద్ద పేగు తాలూకు చివరి భాగానికి మధ్య ప్రదేశంలో అమరి ఉంటుంది. ఇదంతా చెప్పాల్సి రావడానికి కారణం - ఈ నిర్మాణాలన్నిటి అనుసంధానంతోనూ, లేదా గర్భాశాయాంతర్గత కారణాలతోనూ ఈ ప్రాంతంలో నొప్పి జనించడానికి అవకాశం ఉండటమే.

1. గర్భాశయంలో నారవంటి కండర పెరుగుదలలు తయారవ్వటం (ఫైబ్రాయిడ్స్):

సాధారణ గర్భధారణలో గర్భాశయ పరిమాణం పెరగడం, కొద్దిగా అసౌకర్యంగా ఉండటం సహజం. కాని ఒకేసారి గర్భధారణతో సంబంధం లేకుండా, గర్భాశయం గోడలకు కంతులు (ఫైబ్రాయిడ్స్) పెరిగినప్పుడు కూడా దాదాపు ఇదే మాదిరిఅసౌకర్యం అనుభవమవుతుంది. అవివాహితలలోనూ, వివాహమైనా గర్భం ధరించిన వారిలోనూ, ఒకవేళ గర్భం ధరించినా ఒక బిడ్డకు మాత్రమే జన్మనిచ్చిన వారిలోనూ ఫైబ్రాయిడ్స్ ఎక్కువగా తయారవుతుంటాయి. మరొక మాటలో చెప్పాలంటే సంతానవంతుల్లో కంటే సంతానరహితుల్లో ఫైబ్రాయిడ్స్ ఏర్పడేందుకు అవకాశాలేక్కువగా ఉంటాయన్న మాట. హార్మోన్లు ఫైబ్రాయిడ్స్ ను పెరగనివ్వకుండా నియంత్రిస్తుంటాయి.

ఫైబ్రాయిడ్స్ ఉన్న వారికి మూత్రాశయం మీద పరోక్షంగా ఒత్తిడి పడి, ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాలనిపించడం, ఉదర ప్రదేశమంతా బరువుగా బిగదీసుకున్నట్లు ఉండటం జరుగుతుంది. అంతేకాకుండా అధిక రుతుస్రావం, బహిష్టు నొప్పి, వంధ్యత్వం, గర్భస్రావం, ఇత్యాదివి కూడా ఫైబ్రాయిడ్స్ వల్ల కనిపించే అవకాశం ఉంది.

ఔషధాలు: త్రిఫలాగుగ్గులు, లోద్రాసవం, ప్రదరరిపురసం.

2. కటివలయంలో వాపు (పెల్విక్ ఇన్ ఫ్లమేటరీ డిసీజ్):

గనోరియా వంటి సుఖవ్యాధులు ప్రాప్తించినప్పుడూ, గర్భాశాయాంతర్గత కుటుంబ నియంత్రణ సాధనాలను అమర్చుకున్నప్పుడూ, గర్బశాయానికి ఇరుప్రక్కలా ఉండే అండాశయాలు వ్యాధిగ్రస్తమైనప్పుడూ గర్భాశయ ప్రదేశంలో నొప్పి జనించేందుకు అవకాశం ఉంది. ఇలాంటివి ఉన్నప్పుడు ఆయా పరిస్థితులకనుగుణంగా చికిత్స చేయాల్సి ఉంటుంది.