ప్లీహం ( (స్ప్లీన్)

1. కడుపు నొప్పితో పాటు చలితో కూడిన జ్వరం ఉందా?

చలిజ్వరం (మలేరియా)

2. కడుపునొప్పితో పాటు బాగా నీరసంగా ఉంటుందా?

రక్తహీనత (ఎనీమియా)

3. ఎడమ ప్రక్క పైభాగపు ఉదార ప్రదేశంలో ఏదైనా దెబ్బ తగిలిందా?

ప్లీహానికి గాయమవటం

 

ఎడమ పక్కటెముకల కింద ప్లీహం ఉంటుంది. రకరకాల రక్తకణాలను కార్యాచరణ క్రమంలోకి తీసుకురావడానికి ఇది దోహదపడుతుంది. కాలం చెల్లిన, నూట ఇరవై రోజులు దాటినా పాత ఎర్రరక్త కణాలను వడపోసి వెలుపలికి పంపడం దీని విధులలో ముఖ్యమైనది. ఈ క్రమంలో రక్త కణాలు విభిన్నమైన అనుఘటకాలుగా విభజితమవుతాయి. వీటిలో కొన్ని అంశాలు వెలుపలికి వెళ్లిపోతే మరొకొన్ని అంశాలు తిరిగి రక్త చంక్రమణంలోకి ప్రవేశించి కొత్త కణాల తయారీకి దోహదపడతాయి. ఈ విధులతో పాటు ప్లీహం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడేందుకు కూడా సహకరిస్తుంది. తెల్ల రక్తకణాలకు ఆశ్రయమిచ్చి తద్వారా వ్యాధి నిరోధక శక్తిని కలిగించడంలో కీలకపాత్ర వహిస్తుంది. ఒకోసారి ఇది విభిన్న కారణాల చేత ఇన్ ఫ్లేమ్అయ్యేందుకు అవకాశం ఉంది. అలాంటప్పుడు దీని పై పొర గణనీయంగా సాగిపోయి నొప్పిని కలిగిస్తుంది. ప్లీహం పెరిగినప్పుడు దానిని పక్కటెముకల కిందగా చేతులతో స్పర్శించి గుర్తుపట్టవచ్చు. కొన్నిసార్లు, కొన్ని రకాల జ్వరాలలో, యాక్సిడెంట్లలో ఈ ప్లీహపు పై పొర విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. అప్పుడు కేవలం నొప్పె కాకుండా, రక్త ప్రసరణ వ్యవస్థలో అవరోధాలేర్పడే ప్రమాదం కూడా ఉంది. ప్లీహం వ్యాధిగ్రస్తం కావడాన్ని ఆయుర్వేదంలో 'ప్లీహవృద్ధి' అంటారు.

చికిత్సా సూత్రాలు: స్నేహనము, స్వేదనం, విరేచనం, నిరూహవస్తి, అనువాసనవస్తి, రక్తమోక్షణం అనే చికిత్సా ప్రక్రియలు చేయాల్సి వుంటుంది.

ఔషధాలు: పునర్నవాది మండూరం, శంఖభస్మం, ఆరోగ్యవర్ధినీవటి, కుమార్యాసవం, చిత్రాకాదివటి, పంచనకారచూర్ణం, యక్రుదారిలోహం, వరాటికా భస్మం, పునర్నవాసవం, రోహితకారిష్టం, యకృత్ ప్లీహారిలోహం, నవాయసలోహం, నేలవేముచూర్ణం, లోహాసవం.

 

1. చలిజ్వరం (మలేరియా):

సాధారణంగా కడుపునొప్పితో పాటు చలితో కూడిన జ్వరం కనిపిస్తుంటే విషజ్వరం (మలేరియా) గురించి ఆలోచించాలి. జ్వరంహఠాత్తుగా ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వాంతులతో ప్రారంభమవుతుంది. ఒకోసారి దగ్గు, విరేచనాలు వంటివి కూడా ఉండి, వ్యాధి నిర్ధారణను పక్కదోవ పట్టిస్తుంటాయి. మలేరియాలో రక్తకణాలు విచ్చిన్నమవడం వల్ల కాలేయమూ, ప్లీహామూ పెరుగుతాయి. కామెర్లు కూడా కనిపించే అవకాశం ఉంది. ప్లీహవృద్ధిలో 'కిరాతతిక్త' అనే మూలిక క్లోరోక్విన్ రెసిస్టెంట్ మలేరియాలలో సైతం ప్రభావవంతంగా పనిచేసినట్లు వెల్లడయింది. విషమజ్వరంతక లోహం వంటి ప్రత్యేక ఆయుర్వేద మందులు కూడా ఈ వ్యాధిలో పనిచేస్తాయి.

గృహచికిత్సలు: 1. వావిలాకు రసానికి (అరకప్పు) తేనె (రెండు చెంచాలు) కలిపి రోజుకు రెండుసార్లు పుచ్చుకోవాలి. 2. పిప్పళ్ళచూర్ణాన్ని (చిటికెడు) తేనెతో (చెంచాడు) కలిపి తీసుకోవాలి. 3. తిప్పతీగ, వేపపట్ట, ఉసిరిపండ్ల పెచ్చులు సమతూకంగా తీసుకొని దంచి రసం తీయాలి. అరకప్పు రసానికి చెంచాడు తేనె కలిపి తీసుకోవాలి. 4. కాకరాకురసానికి (అరకప్పు) తేనె (చెంచాడు) కలిపి తీసుకోవాలి. 5. జీలకర్ర, వెల్లుల్లిపాయలు, శొంఠి,పిప్పళ్ళు, మిరియాలు వీటిని సమానభాగాలుగా తీసుకొని పొడిచేయాలి. దీనికి బెల్లం చేర్చి అరచెంచాడు మోతాదుగా వేడినీళ్ళతో రోజుకు మూడుసార్లు తీసుకోవాలి.

ఔషధాలు: సుదర్శన చూర్ణం, గోదంతీమిశ్రణం, శీతాంశురసం, మల్లసింధూరం, త్రిభువన కీర్తిరసం, విషమజ్వరాంతక లోహం.

2. రక్తహీనత (ఎనీమియా):

కడుపునొప్పితో పాటు బాగా నీరసంగా వుంటే మీకు రక్తహీనత ఉండి ఉండవచ్చు. దీనికి కారణాలు అనేకం. ఇనుము, విటమిన్ బి - 12, ఫోలేట్ వంటివి శరీరంలో సరిపడా లేనప్పుడు ఎముకలలోని మూలుగ రక్త కణాలను పూర్తిస్థాయిలో తయారు చేయలేదు. అంతే కాకుండా ఈ మూలుగను క్యాన్సర్ కణాలు ముట్టడించినప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది. ఇవి రక్తహీనతకు శరీరాంతర్గత కారణాలైతే, రక్తస్రావాలు, మలేరియా వంటి వ్యాధులలో జరిగే రక్తకణాల విచ్యుత్తి వంటివి పరధేయ కారణాలుగా ఉంటాయి. ఏదేమైనా, రక్తాల్పతలో ప్లీహ పరిమాణం పెరిగిపోయి అస్పష్టమైన ఉదరశూలను కలిగించే అవకాశముంది.

గృహచికిత్సలు: 1.ఉసిరికాయలు (6కిలోలు) బెల్లమ (మూడు కిలోలు) తీసుకుని ఒకదానిమీద మరోదానిని పొరలుపొరలుగా ఒక మట్టికుండలో పేర్చాలి. కుండపైన గాలి మూకుడు పెట్టి పైనుంచి మందపాటి గుడ్డతో వాసికం కట్టి భూమిలో మండలం (40 రోజులు) పాతిపెట్టాలి. తరువాత కుండను తీసి లోపలి పదార్థాలను బాగా కలిపి వారంపాటు వదిలేయాలి. పైన ఒకరకమైన ద్రవం తేలుతుంది. దీనిని పారబోసి మిగిలినదానిని పావు కప్పు మోతాదుగా రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 2. కరక్కాయ చూర్ణాన్నిగాని, శొంఠి చూర్ణాన్ని గాని, అరచెంచాడు మోతాదుగా బెల్లంతోకలిపి రోజు రెండు పూటలా తీసుకోవాలి. 3. చెరుకు రసాన్ని గ్లాసెడు చొప్పున రోజుకు కనీసం ఒకసారి తాగాలి. 4. తిప్పతీగ, త్రిఫలాలు, అడ్డరసం, కటుకరోహిణి, నేలవేము, వేపపట్ట, వీటిని సమతూకంగా తీసుకొని కషాయం కాచి రోజుకి రెండుసార్లు తాగాలి.

ఔషధాలు: లోహ భస్మం, పునర్నవాది మండూరం, కాంత వల్లభరసం, నవాయసలోహం, ఆయస్మ్రతి, భృంగరాజాసవం.

3. ప్లీహానికి గాయమవడం:

ఎడమప్రక్కపై భాగపు ఉదర ప్రదేశంలో ఏదైనా దెబ్బ తగిలితే ప్లీహం కమిలిపోవడం, చిద్రమవడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఇలా ఎక్కువగా వాలీబాల్, ఫుట్ బాల్ వంటి ఆటలలోనూ, యాక్సిడెంట్లలోనూ జరుగుతుంది. ప్లీహం ఉండే ప్రాంతంలో నొప్పితోపాటు రక్త ప్రసార వ్యవస్థ దెబ్బతినడం వల్ల బొడ్డు చుట్టూ నీలం రంగు మచ్చలు ఏర్పడతాయి. దీనికి సత్వరమే రోగ నిర్ధారణా పెరీక్షలూ, సారైనా చికిత్సలూ అవసరమవుతాయి.