అమాశయం
1. అజీర్ణంతో బాధపడుతున్నారా?
అమాశయపు పూత (గ్యాస్ట్రైటిస్)
2. ధూమపానం ఎక్కువగా చేస్తారా?
ధూమపాన దుష్ఫలితాలు
3. ముందుకు వంగేటప్పుడూ, బరువులను ఎత్తేటప్పుడూ నొప్పి ఎక్కువవుతుందా?
అమాశయం అన్న నాళికలోకి చొచ్చుకెళ్ళటం (హాయేటస్ హెర్నియా)
4. నొప్పి తీవ్రంగా ఉండటమే కాకుండా, దాని వలన రాత్రివేళ మెళకువ కూడా వస్తుందా?
పరిణామశూల (పెప్టిక్ అల్సర్)
5. బరువు తగ్గడంతోపాటు నలతగా కూడా అనిపిస్తుందా?
అమాశయానికి క్యాన్సర్
అమాశయానికి వ్యాకోచించగల శక్తి ఉంటుంది. తిన్న తరువాత కొంతసేపటి వరకు ఇది ఆహారాన్ని తనలో అట్టిపెట్టుకుంటుంది. నోటిలో లాలాజల స్రావంతో మొదలై, పెద్దపేగు చివరిభాగంలో నీటిని నిలుపుచేయడంతో అంతమయ్యే నిరంతర జీర్ణక్రియలో ఆమాశయం చాలా కీలకపాత్ర పోషిస్తుంది. దీనిలోని శక్తివంతమైన ఆమ్ల పదార్ధం ఆహారాన్ని సూక్ష్మాంశాలుగా విడకొట్టి ఎంజైముల పనిని సులభతరం చేస్తుంది. చాలా మంది ఆమాశయాన్ని కడుపు లేదా పొట్టకు పర్యాయపదంగా వాడుతుంటారు. నిజానికి ఉదరమనేది అనేక నిర్మాణాల సముదాయం. వాటిలో ఆమాశయం ఒక భాగం మాత్రమే. ఇది ఉదర ప్రదేశంలో కాస్త ఎగువన, ఎడమ ప్రక్కగా అమరి ఉంటుంది.
1. ఆమాశయపు పూత (గ్యాస్ట్రైటిస్):
కడుపునొప్పికి ఒక ప్రధాన కారణం ఆమాశయపు పూత. ఇది ఆల్కహాల్ ను సేవించడం వలన, మసాలాలనూ, కొవ్వు పదార్థాలనూ తీసుకోవడం మొదలైన కారణాల వలన వస్తుంది.
సూచనలు: 1. ఆహారం కొద్ది మొత్తాలలో తరచుగా తినాలి. 2. కారం, పసుపు, మసాలాలు తగ్గించాలి. 3. ధూమపానం, మద్యపానాలు పనికిరావు. 4. బరువు తగ్గాలి. 5. ఆహారం విషయంలో సమయపాలన పాటించాలి.
గృహ చికిత్సలు: 1. పిల్లిపీచర గడ్డలను పొడిచేసి, అరచెంచాడు మోతాదుగా పాలతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 2. ఉసిరికాయ పెచ్చులను పొడిచేసి అరచెంచాడు మోతాదుగా గోరువెచ్చని నీళ్ళతో కైపి తీసుకోవాలి. 3. అతిమధురం వేరును పొడిచేసి పావు చెంచాడు మోతాదుగా పాలతో కలిపి తీసుకోవాలి. 4. తిప్పసత్తునురేగు గింజంత మోతాదుగా చన్నీళ్లతో లేదా తేనెతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.
ఔషధాలు: సంశమనీవటి, అవిపత్తికర చూర్ణం, ధాత్రీలోహం, కామధుఘరసం, శంఖభస్మం, నూతశేఖర రసం, ప్రవాళ పంచామృతం, సుకుమార ఘృతం.
2. ధూమపానం దుష్ఫలితాలు:
సిగరెట్ పొగ ఆమాశయపు మ్యూకస్ పొరను తడి ఆరిపోయేలా, ఇన్ పఫ్లేమ్ అయ్యేలా చేస్తుంది. దీని పర్యవసానంగా కడుపు నొప్పి వస్తుంది. సిగరెట్ల వల్ల ఈ రకమైన ఇక్కట్లన్నీ వస్తాయి. కాబట్టి వాటిని మానడం చాలా అవసరం.
3. ఆమాశయం అన్న నాళికలోకి చొచ్చుకెళ్ళటం (హయేటస్ హెర్నియా):
ముందుకు వంగేటప్పుడూ, బరువులను ఎత్తేటప్పుడూ నొప్పి ఎక్కువ కావడం అనేది 'హయేటస్ హెర్నియా' వ్యాధి లక్షణం. ఆమాశయం ఆగ్రా భాగం ఉదర వితానం (డయాఫ్రం) ద్వారా అన్ననాళికలోకి చొచ్చుకు వెళ్ళినప్పుడు ఇలా జరుగుతుంది . ఈ స్థితి ఏర్పడినప్పుడు ఆమాశయంలోని శక్తివంతమైన ఆమ్లాలు పైకి ఎగిరివెళ్లి నొప్పిని కలిగిస్తాయి. ఈ సమస్య అవసరానికి మించి ఆహారాన్ని తీసుకునే వారిలోనూ, స్థూలకాయులలోనూ, శక్తికి మించి శారీరక శ్రమ చేసేవారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి పైన చెప్పుకొన్న గ్యాస్ట్రైటిస్ చికిత్సలు అవసరమవుతాయి. అలాగే ఈ స్థితి ప్రాప్తించినప్పుడు ఆహారం విషయంలో నియంత్రణ పాటించడం అవసరం. ముందుకు వంగి పనిచేయడం, తినగానే పడుకోవడం బరువులను లేపడం వంటి వాటిని మానుకోవాలి.
4. పరిణామశూల (పెప్టిక్ అల్సర్):
నొప్పి వస్తున్న ప్రాంతాన్ని సరిగ్గా చూపుడు వేలితో చూపించగలిగితే అది 'పెప్టిక్ అల్సర్' అయ్యే అవకాశం ఉంది. అల్సర్ వల్ల రాత్రి వేళల్లో నొప్పి వస్తుంటుంది. నడిరాత్రి దాటిన తరువాత సాధారణంగా ఆహారాన్ని తీసుకోవడం కుదరదు కనుక ఆ సమయంలో ఆమాశయపు ఆమ్లాలు తటస్థం చెందేందుకు వీలులేక అల్సర్ ను రేగేట్లు చేస్తాయి. స్థానికంగా నొప్పి ఉత్పన్నమవుతుంది. దీనికి పిత్తహర చికిత్సలు చేయాల్సి ఉంటుంది.
గృహచికిత్సలు: 1. పిల్లీ పీచర గడ్డలు (శతావరి) పచ్చివి తెచ్చి, దంచి రసం తీసి పూటకు అరకప్పు చొప్పున రెండు పూటలా పుచ్చుకోవాలి. 2.శతావరి చూర్ణాన్ని పూటకు అరచెంచాడు చొప్పున అరగ్లాసు పాలతో కాలిపో రెండు పూటలా తీసుకోవాలి. 3. ఉసిరి చూర్ణాన్ని అరచెంచాడు మోతాదుగా పాలతో కలిపి రోజుకు రెండుసార్లు పుచ్చుకోవాలి. 4. శొంఠి, నువ్వులు, బెల్లం అన్నీ సమభాగాలు తీసుకుని ముద్దచేసి పూటకు చెంచాడు చొప్పున రెండు పూటలా గోరువెచ్చని పాలతో పుచ్చుకోవాలి. 5. నత్తగుల్లలను శుభ్రంగా కడిగి, పొడిచేసి చిటికెడు (500 మి.గ్రా) పొడిని వేడినీళ్ళతో కలిపి తీసుకోవాలి. దీనిని వాడేటప్పుడు నోరు పోక్కే అవకాశం వుంది కనుక నోటికి నేతిని పూసుకోవాలి.
ఔషధాలు: కామధుఘారసం, సూతశేఖర రసం, ధాత్రీలోహం, నారికేళలవణం, శతావరి ఘృతం.
5. ఆమాశయానికి క్యాన్సర్:
ఆమాశయానికి వచ్చే క్యాన్సర్ వలన కడుపు నొప్పి వస్తుంది. అయితే దురదృష్టవశాత్తూ ఇలా నొప్పి తెలిసే సమయానికి పరిస్థితి విషమిస్తుంది. నొప్పితోపాటు బరువు తగ్గటం, రక్తాల్పత, ఆకలి మందగించడం వంటివి క్యాన్సర్ లో ప్రధానంగా కనిపించే లక్షణాలు దీనికి వైద్య సహాయం తప్పనిసరి.
క్లోమం (ప్యాంక్రియాస్):
క్లోమం ఉదర ప్రదేశం మధ్య భాగంలో ఉన్నప్పటికీ దాని తాలూకు ప్రభావం వలన ఎడమవైపు పైభాగంలో కూడా నొప్పి వచ్చే అవకాశం ఉంది. మధ్యపానం, క్యాన్సర్ వంటి వాటి వలన ఒకవేళ ఇది వ్యాధిగ్రస్తమైతే దాని నుంచి విడుదలయ్యే స్రావాలు చుట్టుపక్కల కణజాలాలలోకి కలిసిపోయి తీవ్రమైన నొప్పిని కలిగించే అవకాశం ఉంది. ఈ నిర్మాణం వ్యాధిగ్రస్తమైనప్పుడు వాంతులు, స్వేదాతిప్రవృత్తి, పడుకున్నప్పుడు నొప్పి ఎక్కువ కావడం వంటివి అనుభవమవుతాయి.
ప్రేగులు:
పేగులు ఆహారం అరుగుదలకు, ఆహార రసాన్ని గ్రహించడానికి, శరీరం లోపల నీటిని కాపాడటానికి, వ్యర్థాలను విసర్జించడానికి ఉపయోగపడతాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎక్కడ సమస్య ఉత్పన్నమైనా, అక్కడ అలలు అలలుగా నొప్పి బయల్దేరుతుంది ముఖ్యంగా మలబద్దకం, విరేచనాల వంటివి ఉన్నప్పుడు పేగుల కండరాలు అదనంగా పనిచేయాల్సి ఉండటం వలన వాటిమీద అధికభారం పడి నొప్పి వస్తుంది. పేగుల పొరలలో కంతులు ఏర్పడినప్పుడు కూడా ఇలా జరిగే అవకాశం ఉంది.