గొంతు బొంగురు:
1. మీరు సిగరెట్లెక్కువ కాలుస్తారా? ఆల్కహాల్ కూడా తీసుకుంటారా?
ధూమపాన /మద్యపాన దుష్ఫలితం
2. ఎక్కువగా మాట్లాడటం, పాటలు పాడటం చేస్తుంటారా?
గొంతును అతిగా ఉపయోగించడం
3. గొంతు బొంగురు క్రమక్రమంగా ఎక్కువవుతోందా? ముఖ్యంగా దగ్గూ, జలుబులు లేకుండానే బొంగురు మొదలయిందా?
గొంతులో పెరుగుదలలు
4. గస్వరవికృతితో పాటు మీకెప్పుడూ జలుబు చేసినట్లు అనిపిస్తుందా? లావెక్కుతున్నారా? మలబద్దకం కూడా ఉందా?
థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గటం (హైపోథైరాయిడిజం)
5. మీకు థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన చికిత్సలు జరిగాయా? ఆపరేషన్ తరువాత గొంతు బొంగురుపోవడమనే సమస్య మొదలయిందా?
థైరాయిడ్ గ్రంథికి హాని జరగడం / స్వరతంత్రులు చచ్చుపడటం
6. ప్రమాదభరితమైన విషవాయువుల మధ్య పనిచేస్తారా?
విషవాయువుల ప్రభావం
7. తీవ్రమైన అజీర్ణంతో బాధపడుతున్నారా?
జీర్ణరసాలు పైకి పొంగటం (యాసిడ్ రిప్లక్స్)
8. కనురెప్పలు వాలిపోతుంటాయా? కళ్ళు తెరవలేకపోతున్నారా?
మయస్తీనియా గ్రేవిస్
9. ఈ మధ్య మీరు మనసు తట్టుకోలేనంత బాధాకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారా?
హిస్టీరియా
అప్పుడప్పుడు గొంతు బొంగురుపోవడం ఎవరికైనా సహజమే. చాలా వరకూ ఈ స్థితి 'స్వయం అంతం'గా. అంటే తనంతటతానే నెమ్మదించేదిగా ఉంటుంది. గొంతు బొంగురు పాడడానికి వైరస్, ఎలర్జీలు సాధారణ కారణాలు, చక్కగా విశ్రాంతి తెసుకోవడం. ఆవిరిని పీల్చడం మొదలయిన చర్యలతో ఒకటి రెండు వారాలలోనే ఈ ఇబ్బంది నుంచి బైట పడవచ్చు. అలా కాకుండా, పక్షం రోజులు దాటినా తరువాత కూడా గొంతు బొంగురు కొనసాగుతుంటే దాని గురించి శ్రద్ధ వహించడం అవసరం. ఆయుర్వేద సంహితాకారుల్లో ముఖ్యుడైన చరకుడు ఈ లక్షణాన్ని ఎనభై రకాల వాత వ్యాధులలో ఒకటిగా, 'కంఠోధ్వంసం' అనే పేరుతో వ్యవహరించాడు. వివిధ ఆయుర్వేద గ్రంథాలు గొంతు బొంగురుపోవడాన్ని స్వర భంగం, స్వర క్షయం వంటి పేర్లతో వర్ణించాయి. గొంతు బొంగురు పోవడమనేది నిజానికి అల్పమైన లక్షణం. ఐతే, ఒకోసారి ప్రమాదకరమైన వ్యాధులు కొన్ని గొంతుబోరుగుతోనే మొదలవుతుంటాయి. నలభైయ్యేళ్ళు పైబడిన వారిలో, అందునా ధూమపానం అలవాటు వున్న వారిలో గొంతు బొంగురు అనే లక్షణం దీర్ఘకాలం నుంచి కొనసాగుతున్నట్లయితే క్యాన్సర్ ప్రమాదాన్ని శంకించి జాగ్రత్త పడవలసి ఉంటుంది. గొంతు బొంగురు ఉన్నప్పుడు వైద్యులు దీనికి కారణమైన హేతువులను అన్ని కోణాలనుంచి విశ్లేషిస్తారు. ఒక్కొక్క కారణాన్ని గురించి ఆలోచిస్తూ చివరకు ప్రాణానికి ప్రమాదాన్ని కలిగించే స్వరతంత్రుల ట్యూమర్ల గురించి కూడా పరీక్షిస్తారు. ఇలా చేయడం వల్ల సరైన సమయంలో సరైన విధంగా వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. గొంతుబొంగురు అనే లక్షణం ఈ కింది వ్యాధులు లేదా సందర్భాలన్నీటిలోనూ కనిపించే అవకాశం ఉంది.
1. ధూమపాన / మద్యపాన దుష్ఫలితం ధూమపానం, మద్యపానం వంటి అలవాట్ల వల్ల స్వరతంత్రులు (వోకల్ కార్డ్స్) గట్టిపడి వ్యాధిగ్రస్తమయ్యే అవకాశం ఉంది. అలాంటి సందర్భాలలో గొంతుబొంగురు పోతుంది. సిగరెట్ పొగ ఎలర్జీని కలిగించి స్వరతంత్రులను రేగేటట్లు చేస్తే, మద్యంలోని ఆమ్లాంశాలు ఈ పరిస్థితిని మరింత ఎక్కువ చేస్తాయి. స్మోకింగ్, మద్యపానాలు గొంతు బొంగురుకు కారణాలైనప్పుడు వాటిని మానేయడం కన్నా ఉత్తమమైన పధ్ధతి మరొకటి లేదు. 2. గొంతును అతిగా ఉపయోగించడం పాటలు పాడేవారు, రద్దీగా ఉండే వ్యాపారాలను నిర్వహించే వారు. కామెంట్రీలు చెప్పేవారు. వేలం పాటలు నిర్వహించేవారు, సభలలో అదే పనిగా ప్రసగించేవారు - వీరందరికీ - గొంతును ఎక్కువగా వినియోగించడం వలన గొంతు బొంగురు పోయే అవకాశం ఉంది. ఇలా శక్తికి మించి ప్రవర్తించడాన్ని ఆయుర్వేదంలో 'అతియోగం' అంటారు. ఇది త్రివిధ వ్యాధి హేతువుల్లో ఒకటి (మిగత రెండు అయోగ, మిథ్యాయోగాలు). గొంతును అనియతంగా వాడినప్పుడు బొంగురుపోతే అన్నిటికంటే ముందుగా చేయాల్సింది గొంతుకూ, శరీరానికీ విశ్రాంతిని కల్పించడం. 3. గొంతులో పెరుగుదలలు: ప్రమాదకరం కానటువంటి 'బినైన్' పెరుగుదలలు కాని, ప్రమాదకరమైన మాలిగ్నెంట్ పెరుగుదలలుగాని - స్వరతంత్రులమీద వృద్ధి చెందితే స్వరశబ్దంలో మార్పు వస్తుంది. ఆరోగ్యవంతులైన వ్యక్తుల్లో, మామూలు సందర్భాలలో శ్వాస తీసుకునేటప్పుడూ. మాట్లాడేటప్పుడూ స్వర తంత్రులు ఒకదానికొకటి దగ్గరగా, పరదాలమాదిరిగా అమరి ఉంటాయి. అయితే, అనియతంగా గొంతును వినియోగించే వారి స్వరపెటికలలో తంత్రుల మీద చిన్నచిన్న పొక్కులు (సింగర్స్ నాడ్యుల్స్) ఏర్పడతాయి. వీటి వలన స్వరంలో మార్పు వస్తుంది. ఇదే విధంగా కాడ కలిగిన కంతులు (పాలిప్స్) వలన కూడా స్వర వికృతి ఏర్పడవచ్చు. క్షయవ్యాధి వలన లేదా క్యాన్సర్ కారకాంశాలు అభ్యంతర కణజాలాలలోకి చొచ్చుకుపోవడం వలన కూడా స్వరంలో వికృతి చోటుచేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ మరొక విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. క్షయ, క్యాన్సర్ రెండింటిలోనూ స్వరవికృతే కాకుండా, మెడ ప్రక్కల లింఫ్ గ్రంథులు వాయడం, బరువు తగ్గడం, జ్వరం, కఫం రక్తపు చారికలతో కూడి వెలువడడం మొదలైన లక్షణాలు ఉంటాయి. గొంతులో పెరుగుదలలు అనేది గొంతు బొంగురును కలిగిస్తున్నప్పుడు కారణాన్ని కనుగొని, ఆ ప్రకారం చికిత్స చేయాల్సి ఉంటుంది. 4. థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గటం (హైపోథైరాయిడిజం): గొంతుబొంగురు, అతి బరువు, మలబద్దకం వంటి లక్షణాలు థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగించడాన్ని సూచిస్తాయి. పై లక్షణాలే కాకుండా, జుట్టు పలుచబడిపోవడం, చర్మం దళసరిగా మారడం వంటి వాటి వలన కూడా థైరాయిడ్ గ్రంథి చురుకుగా లేదని ఊహించవచ్చు. సూచనలు: థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగించినప్పుడు కారణానుసారం చికిత్స చేయాలి. దీనికి అపతర్పణ చికిత్సలు అవసరమవుతాయి. ఇవి శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి. గృహచికిత్సలు: 1. ఇయోడిన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను (సముద్రపు చేపలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పిల్లిపీచర గడ్డలు) ఎక్కువగా తీసుకోవాలి. 2. థైరాయిడ్ గ్రంథి చురుకుదనాన్ని తగ్గించేలా చేసే ఆహార పదార్థాలను (క్యాబేజీ, మెంతికూర, క్యాలీఫ్లవర్, మొక్కజొన్నలు, చిలకడదుంపలు, తోటకూర) తీసుకోకూడదు. 3. విటమిన్ బి.కాంప్లెక్స్ కలిగిన ఆహారాలు (తృణ ధాన్యాలు, గింజలు) విటమిన్ - ఏ కలిగిన ఆహారాలు (ముదురు ఆకుపచ్చని రంగులో ఉండే ఆకులు, పసుపు పచ్చ రంగులో ఉండే పండ్లు) ఎక్కువగా తీసుకోవాలి. ఔషధాలు: చతుర్ముఖ రసం, క్రమవృద్ధి లక్ష్మీ విలాస రసం, మకరధ్వజ సింధూరం, పూర్ణ చంద్రోదయం, పంచబాణ రసం, స్వర్ణక్రవ్యాది రసం, వసంతకుసుమాకర రసం, ఆరోగ్యవర్ధినీ వటి, చంద్రప్రభావటి, గోక్షురాది గుగ్గులు, కాంచనార గుగ్గులు, మధుస్నుహి రసాయనం, మహాయోగరాజ గుగ్గులు, నవక గుగ్గులు, పంచతిక్త గుగ్గులు ఘృతం, త్రయోదశాంగ గుగ్గులు, యోగరాజు గుగ్గులు, భృంగరాజాసవం, ధాత్రీలోహం, కుమార్యాసవం, కాంతవల్లభ రసం, లోహాసవం, లోహ రసాయనం, లోకనాధ రసం, నవాయస చూర్ణం, ప్రాణదా గుటిక, రజతలోహ రసాయనం, స్వర్ణమాక్షీక భస్మం, స్వర్ణకాంత వల్లభ రసం, సప్తామృత లోహం. 5. థైరాయిడ్ గ్రంథికి హాని జరగడం / స్వరతంత్రులు చచ్చుపడటం: స్వారోత్పత్తికి మూలకారణం స్వరతంత్రులలో కదలికలేనన్న విషయం తెలిసిందే. సర్వతంత్రుల కదలికలనురికరెంట్ లారింజియల్ నరం నియంత్రిస్తుంది. ఇది గొంతులోని సంక్లిష్ట మార్గాల ద్వారా పయనిస్తుంది. ఈ నరం స్థానిక రక్త నాళాల వాపు వల్లనో, లేదా కంతి వల్లనో వ్యాధిగ్రస్తమైతే అప్పుడు కూడా స్వర వికృతి ఏర్పడుతుంది. ఈ విధంగా సాధారణంగా వృద్ధులలో జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో థైరాయిడ్ కి సంబంధించిన శస్త్ర చికిత్సలలో అనుకోకుండా స్వరోత్పత్తి నిర్మాణాలకు నష్టం జరగవచ్చు. అప్పుడు కూడా స్వరంలో మార్పు చోటు చేసుకుంటుంది. సమస్య ఏమిటన్నది తెలుసుకొని చికిత్స చేస్తే గొంతు బొంగురు తగ్గుతుంది. సూచనలు: స్వరతంత్రులు చచ్చుబడినప్పుడు సంబంధిత నరాలను ఉత్తేజం చేయడానికి వాతహర చికిత్సలను చేయాల్సి ఉంటుంది. అదే విధంగా పిత్త దోషాన్ని తగ్గించడం కోసం కొన్ని ఇతర చికిత్సలను చేయాల్సిన అవసరం కూడా రావొచ్చు. 6. విషవాయువుల ప్రభావం: విషవాయువులను పీల్చుకోవడం వలన చాలా రకాల ప్రమాదాలు సంభవిస్తాయి. గొంతు బొంగురుపోవడం వాటిలో ప్రధానమైనది. వాహనాలనుంచి వెలువడే వ్యర్థ వాయువులూ, రబ్బర్, ప్లాస్టిక్ కర్మాగారాలలో వెలువడే విషవాయువులూ ప్రమాదభరితమైన లక్షణాలను కలిగిస్తాయి. విషవాయువుల వలన గొంతు బొంగురుపోతున్నప్పుడు, సాధ్యమైతే వాటినుంచి దూరంగా వెళ్ళి పోవడం ఒక పద్ధతి. లేని పక్షంలో వాటిని నివారించడం కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం మరొక పద్ధతి. 7. జీర్ణరసాలు పైకి పొంగటం (యాసిడ్ రిఫ్లక్స్): అల్సర్లు, పేగుపూత మొదలైన జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులున్నప్పుడు ఆమ్ల పదార్థాలు అమాశయాన్ని దాటుకుని పైకి పొంగి అన్ననాళిక పైభాగాన్ని, దానికి ముందు భాగంలో ఉండే స్వరతంత్రులనూ కల్లోలపరుస్తాయి. దీని పర్యవసానంగా స్వరంలో మార్పు వచ్చి గొంతు బొంగురు పోతుంది. ఎసిడిటి, పేగుపూత తదితర జీర్ణకోశ వ్యాధులలో ఆమ్లాంశాలు ప్యాకి పొంగి స్వరతంత్రులను రేపి స్వరభంగాన్ని కలుగజేసినప్పుడు ఎసిడిటిని తగ్గిస్తూ గొంతుకు ఉపశమనాన్ని కలిగించే మందులను ఉపయోగించాలి. సూచనలు: 1. ఆహారం కొద్దిమొత్తాలలో తరచుగా తినాలి. 2. కారం, పులుసు, మాసాలాలు తగ్గించాలి. 3. ధూమపానం మద్యపానాలు పనికిరావు. 4. బరువు తగ్గాలి. 5. ఆహారం విషయంలో సమయపాలన పాటించాలి. గృహచికిత్సలు: 1. పిల్లిపీచర గడ్డలను పొడిచేసి, అరచెంచాడు మోతాదుగా పాలతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 2. ఉసిరికాయ పెచ్చులను పొడిచేసి అరచెందాడు మోతాదుగా గోరువెచ్చని నీళ్ళతో కలిపి తీసుకోవాలి. 3. అతిమధురం వేరును పొడిచేసి పావు చెంచాడు మోతాదుగా పాలతో కలిపి తీసుకోవాలి. 4. తిప్పసత్తును రేగు గింజంత మోతాదుగా చనీళ్లతో లేదా తేనెతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. ఔషధాలు: సంశమనీవటి, అవిపత్తికర చూర్ణం, ధాత్రీలోహం, కామధుఘరసం, శంఖ భస్మం, సూతశేఖర రసం, ప్రవాళ పంచమృతం, సుకుమార ఘృతం. 8. మయస్తీనియా గ్రేవిస్ కనురెప్పలు రాలిపోవడం, కళ్లు తెరవలేకపోవడం, గొంతు బొంగురు అనేవి 'మయస్తీనియా గ్రేవిస్' వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి వచ్చిన వారిలో కాలం గడిచే కొద్ది కండరాలలో శక్తి తగ్గుతూ ఉంటుంది, పదిహేనేళ్ళ నుండో ఏభై ఏళ్ళ వరకూ ఏ వయసులోని వారినైనా ఈ వ్యాధి బాధించవచ్చు. పురుషులలో కంటే స్త్రీలలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. నరాలకు, కండరాలకు మధ్య వారధిలా పనిచేసే కొన్ని రసాయన పదార్థాలు లోపభూయిష్ఠంగా మారడం వలన (ఎసిటైల్ కొలీన్ తగ్గటం లేదా కోలినెస్టరేస్ అధికమవడం) ఈ వ్యాధి ఉత్పన్నమవుతుంది. మానసిక ఉద్రిక్తతలు, ఇన్ఫెక్షన్లు, గర్భధారణ, తీవ్రమైన శారీరక శ్రమ మొదలయినవి ఈ వ్యాధిని ఎక్కువ చేస్తాయి. సాయంత్రమయ్యేటప్పటికి నీరసంగా అనిపించడం, కండరాలు కొద్దిపాటి శ్రమకేశక్తిహీనంగా మారడం, కనురెప్పలు వాలిపోవడం, దృశ్యాలు రెండుగా కనిపించడం, మింగాలంటే కష్టమనిపించడం, గొంతు బొంగురు పోవడం, కాళ్ళు చేతులను తేలికగా కదల్చలేకపోవడం వంటి లక్షణాలు ఈ వ్యాధిలో కనిపిస్తాయి. శరీరంలోని ఏ కండరమైనా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. ఐతే, భుజాల కండరాలు మాత్రం ఎక్కువగా వ్యాధికి గురవుతుంటాయి. దీని ఫలితంగా తలదువ్వుకోవడం వంటి పనులను చేయాలంటే కష్టమవుతుంది. ఆహారేతర పదార్థాలు శరీరం లోనికి ప్రవేశించినప్పుడు వాటిని వెలుపలికి నెట్టివేయాలంటే దగ్గు బలంగా రావాలి. ఈ వ్యాధిలో దగ్గు కూడా అంత బలంగా ఉండదు. ఫలితంగా ఆయాసం వస్తుంది. సూచనలు: మయస్తీనియా గ్రేవిస్ లో రసాయన చికిత్సలు (వాత చింతామణి రసం, మహావాత విధ్వంసినీ రసం తదితరాలు, బృంహణ చికిత్సలు, పంచకర్మ చికిత్సా పద్ధతులు అవసరమవుతాయి. 9. హిస్టీరియా ఒకోసారి మానసిక కారణాల వలన కూడా స్వర వికృతి ఏర్పడే అవకాశం ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే ఇటువంటి సందర్భాలలో శారీరక మార్పులేవీ సంభవించకపోవడం. మనో సంబంధమైన కారణాల వల్ల గొంతు బొంగురు పోయినప్పుడు ఆశ్వాసనం, శిరోవస్తిమ్ శిరోధార, వ్యక్తిత్వ విశ్లేషణ వంటివి ఉపయోగపడతాయి. ఔషధాలు: యోగేంద్ర రసం, బృహత్ వాత చింతామణి రసం, సర్పగంధఘనవటి. సలహాలు: 1.ఒక లోటాడు నీళ్లను బాగా మరుగబెట్టి, దానిలో కొంచెం పసుపు, తులసి ఆకులు వేసి ఆవిరిని పీల్చితే ఉపశమనం లభిస్తుంది. 2. ఉప్పు నీళ్ళతో పుక్కిట పడితే గొంతుబొంగురు నుంచి రిలీఫ్ లభిస్తుంది. 3. పిప్పళ్ళు, ఉప్పు, ఉసిరికాయల వొలుపు, తేనెలను మెత్తగా పేస్టులా చేసి నాకితే గొంతుబొంగురులో మంచి ఫలితం ఉంటుంది. ఔషధాలు: చ్యవనప్రాశ లేహ్యం, లవంగాదివటి, ఏలాదివటి, కంటకార్యవ లేహ్యం అనేవి స్వర భేధంలోనూ, స్వరక్షయంలోనూ, అధికంగా వాడే ఆయుర్వేద ఔషధాలు. శ్వాస కోశ సమస్యలు: యంత్రానికి ఇంధనమూ, ఇంధనానికి గాలీ అవసరమైనట్లుగానే శరీరం సక్రమంగా పనిచేయాలంటే శ్వాసవ్యవస్థ సక్రమంగా పనిచేయాలి. శ్వాసక్రియ అనేది శరీరానికి అవసరమైన ప్రాణవాయువును సరఫరా చేసి తద్వారా శక్తి విడుదలవ్వడానికి, శరీర క్రియలో బైప్రోడక్టుగా విడుదలైన బొగ్గుపులుసువాయువును బహిర్గత పరచడానికి తోడ్పతుతుంది. విశ్రాంతిగా ఉన్న స్థితిలో మనం నిముషానికి 12 నుంచి 15 సార్లు శ్వాస తీసుకుంటాము. ప్రతి శ్వాసతోనూ సుమారు అర లీటరు గాలిని పీలుస్తాము, దీనర్థం నిమిషానికి ఒకసారి మన శరీరంలోనికి పావు లీటరు ఆక్సిజన్ ప్రవేశించడము, 200 మిల్లీ లీటర్ల బొగ్గుపులుసు వాయువు బహిర్గతమవ్వడమూ జరుగుతాయన్న,మాట. మెదడులో కొన్ని ప్రత్యేకమైన కేంద్రాలు శ్వాసవ్యవస్థను అప్రతిహతంగా కొనసాగేలా చేస్తాయి. ఈ కేంద్రాలు విద్యుత్ తరంగాలను పంపుతాయి. ఇవి వివిధ నాడుల ద్వారా ప్రయాణించి శ్వాస క్రియకు తోడ్పడే కండరాలను ఉత్తేజపరుస్తాయి. ఉదాహరణకు, ఛాతీని, ఉదరాన్ని వేరు పరిచే డయాఫ్రం అనే కండరమూ, పక్కటెమూకల మధ్యనుండే అనేక కండరాలూ ఈ విధంగా ప్రేరేపితమై శ్వాసక్రియను కొనసాగిస్తుంటాయి. గాలిపీల్చుకుంటున్నప్పుడు ఊపిరితిత్తులు, ఛాతిగోడలు వ్యాకోచం చెందడాన్ని గమనించవచ్చు. అంటే శ్వాస క్రియకు తోడ్పడే కండరాలు పని చేస్తున్నాయన్న మాట. అలాగే, ఉద్విగ్నపరిస్థితుల్లోనూ, రక్తంలో కార్బన్ డైఆక్సైడ్ మోతాదు పెరిగిన సందర్భాల్లోనూ శ్వాస వేగం పెరగడం, బలంగా శ్వాస తీసుకోవాల్సి రావడం జరుగుతాయి. శ్వాస వ్యవస్థ నిరాటంకంగా పనిచేయాలంటే వెలుపలి నుంచి ప్రాణవాయువు శ్వాస మార్గాల ద్వారా ఊపిరితిత్తుల్లోకి సక్రమంగా ప్రవేశించగలగాలి. అంతే కాకుండా ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లోని పలుచని పొరలగుండా రక్తంలోనికి విలీనమవ్వడమూ, అక్కడనుంచి రక్త ప్రవాహం ద్వారా వివిధ కణజలాలలోనికి చేరుకోవడమూ జరగాలి. ఇన్ఫెక్షన్లు, దెబ్బలు, కండరాల శక్తి తగ్గటం, నరాలవ్యాధులు, రక్తచంక్రమణపు సమస్యలు ఇత్యాదివన్నీ శ్వాస వ్యవస్థను దెబ్బతీసి సమస్యలను కలిగించే వీలుంది. ఈ భాగంలోని వివిధ అధ్యాయాలు ఇటువంటి శ్వాసవ్యవస్థకు సంబంధించిన అనేక రకాల వ్యాధులు, లక్షణాల మీద అవగాహనా కల్పిస్తాయి.