దగ్గు:
1. మీకు దగ్గు జలుబులోనూ, గొంతునొప్పితోనూ మొదలయిందా?
జలుబుతో కూడిన దగ్గు
2. శీతకాలంలో దగ్గుతోపాటు ఎక్కువ మోతాదుల్లో కఫం పడుతుంటుందా?
శ్వాసనాళ సంబంధ రుగ్మత (బ్రాంకైటిస్)
3. దగ్గుతున్నప్పుడు ఛాతిలోపల పదునైన నొప్పి అనుబంధంగా ఉంటుందా?
న్యుమోనియా, ఇతర ఊపిరితిత్తుల వ్యాధులు
4. బరువును కోల్పోతున్నారా? రాత్రిపూట చమట ఎక్కువ పోస్తుందా? ఆకలి తగ్గి, సాయంత్రం జ్వరం వస్తుందా?
క్షయవ్యాధి (ట్యుబర్క్యులోసిస్)
5. దగ్గుతోపాటు తీవ్రమైన జ్వరం ఉందా? దగ్గినప్పుడల్లా ఆకుపచ్చ, పసుపు పచ్చరంగుల మిశ్రమ వర్ణంలో శ్లేష్మం పడుతుందా?
ఉరః క్షతం (బ్రాంకియాక్టాసిన్)
6. ఛాతి ఆకారంలో మార్పు వచ్చిందా? అంటే పైనా కింద సన్నగా ఉండి మధ్యలో వెడల్పుగా 'పీపా' ను పోలి ఉందా? శ్వాస తీసుకోవడానికి కష్టపడుతున్నారా?
ఎంఫిసీమా
7. రాత్రిపూట అదేపనిగా పొడి దగ్గు వస్తుందా? లేక శ్వాస విడిచేటప్పుడు పిల్లి కూతలు వినిపిస్తాయా?
ఉబ్బసం (ఆస్తమా)
8. దగ్గేటప్పుడు చాతిలో నొప్పితోపాటు, కఫంలో రక్తపు చారికలు కూడా కనిపిస్తున్నాయా?
ఊపిరితిత్తుల్లో రక్తపు గడ్డలు
9. పొగతాగుతారా? దగ్గు మూడు వారాల నుంచి ఉందా?
ఊపిరితిత్తుల క్యాన్సర్ / ట్యూబర్క్యులోసిస్)
10. దగ్గుతోపాటు తుమ్ములు, ముక్కుకారటాలు అనేవి ఇబ్బంది పెడుతున్నాయా?
శ్వాసకోశ సంబంధ ఎలర్జీలు (ఈసినోఫిలియా)
11. దగ్గుతోపాటు ఊపిరితిత్తుల నిండుగా సంతృప్తికరమైన స్థాయిలో గాలి పీల్చుకోలేకపోతున్నారా?
ఊపిరితిత్తుల వాపు (పల్మనరీ ఎడిమా)
మనలో చాలామంది చాలా తరుచుగా చవిచూసే లక్షణం దగ్గు. మామూలుగా మనం మింగిన ఆహారం గొంతు నుంది నేరుగా అన్ననాళికలోకి ప్రవేశించాలి. ఒక్కొక్కసారి అదే ఆహారం తన గతిని మార్చుకుని స్వరతంత్రులను తాకి, స్వరపేటిక ద్వారా వాయునాళంలోకి ప్రవేశిస్తే వెంటనే ఆ ప్రదేశమంతా రేగుతుంది. ఆహారమైనా, ఇతర హానికర పదార్థమేదైనా ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తే ప్రమాదకరం కాబట్టి అడ్డగించబడి, బైటకు నెట్టివేయబడాలి. అది కూడా అసంకల్పితంగా జరగాలి. ఏ మాత్రం ఆలస్యమైనా తీవ్ర పరిణామాలెదురవుతాయి.
ఈ పరిస్థితిని ఎదుర్కొనడం కోసం దగ్గు వస్తుంది. ఇది ఒక రక్షణ కవచంలా మనల్ని నిరంతరం అహితకర అంశాలనుండి రక్షిస్తుంటుంది. దగ్గును ఒక 'ప్రతిక్రియ'గా భావించినప్పుడు అది కేవలం ఆహార కారణాల వల్లనే రావాలని నియమం లేదు, ఎన్నెన్నో శరీరాంతర్గత కారణాలు కూడా దగ్గును పుట్టిస్తాయి. ఆరోగ్య వంతుల్లో, సాధారణ పరిస్థితులలో శ్వాసనాళాలను ఆవరించి ఉండే మ్యూకస్ గ్రంథులు ద్రవయుక్తంగా ఉండే శ్లేష్మాన్ని విడుదల చేస్తుంటాయి.
ఈ శ్లేష్మం శ్వాసక్రియ ద్వారా ప్రవేశించే చిన్న చిన్న రేణువులను ఆటకాయించి, తటస్థపరిచి, వెలుపలకు నెట్టి వేస్తుంది. ఒకోసారి -వ్యాధి అవస్థలోనైతేనేం, లేదా ధూమపానం వల్ల నైతేనెం - ఈ మ్యూకస్ గ్రంథులు అతిగా ప్రతిస్పందించి, అసాధారణ స్థాయిలో శ్లేష్మాన్ని స్రవిస్తాయి. శ్లేష్మం కిందికి - ఊపిరితిత్తులలోకి - జారితే ప్రయోజనం నెరవేరదు కాబట్టి కొంత ఒత్తిడితో, శక్తితో బైటకు గెంటివేయబడాలి. ఇలా ఈ విధంగా దగ్గు ప్రారంభమవుతుంది. దగ్గును వ్యాధిగానో లేదా ప్రతికూల పరిస్థితిని వ్యక్తీకరించే లక్షణంగానో అన్వయించుకోవడం వరకూ బాగానే ఉంటుందిగాని, దాని వలన ఏర్పడే ఇబ్బందిని భరించడమే కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా వైద్యపరంగా దగ్గను ఆపే ప్రయత్నం చేస్తున్నారంటే, కేవలం దగ్గు అనే లక్షణాన్ని మాత్రమే ఆపుతున్నట్లుగా కాకుండా, దానికి కారణమైన హేతువును ఎదుర్కొంటూన్నట్లుగా అర్థం చేసుకోవాలి.
ఆయుర్వేద వైద్య శాస్త్ర 'కాస' అనే పదంతో దగ్గును గురించి చెప్పింది. గొంతునుండి, అసహజమైన 'కుత్సిత' శబ్దం వస్తుంది కనుక దీనిని కాస అంటారు. సంహితాకారులు దగ్గును వాత పిత్త కఫాలనే మూడు దోషాల ఆధారంగానూ, వ్యాధుల ఆధారంగానూ, శారీరక చేష్టల ఆధారంగానూ వివిధ రకాలుగా విభజించి వర్ణించారు. దగ్గు చాలా తేలికపాటి లక్షణమైనప్పటికి దాని ఆవలి ఒడ్డున ప్రమాదకరమైన అంశాలు పొంచి ఉండటాన్ని విసర్జించకూడదు. దగ్గు మొదలై వారం రోజులు దాటినట్లయితే వ్యాధి కారక సూక్ష్మక్రిములు గొంతునుండి కిందకి, అంటే ఊపిరి తిత్తులలోనికి జారి. అక్కడి కణజాలాన్ని వ్యాధిగ్రస్తం చేసే అవకాశం ఉంటుంది.
అప్పుడు ఉపేక్షించకుండా వైద్య సలహా తీసుకోవడం ఎంతైనా అవసరం. దగ్గుకు గల కారణాలను ఆలోచించేటప్పుడు ధూమపానం నుంచి ఊపిరితిత్తుల క్యాన్సర్ వరకు అనేక అంశాలను పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. దగ్గుఅనేది చాలా రకాలైన వ్యాధులలో ఒక లక్షణంగా ఉంటుంది కనుక ప్రధానమైన వ్యాధికి చికిత్స జరిగితే దద్దు దానంతట అదే తగ్గిపోతుంది.
1. జలుబుతో కూడిన దగ్గు:
మనం మాట్లాడేటప్పుడు, దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు లాలాజలం అత్యంత సూక్ష్మమైన బిందువుల రూపంలో బైటకు వెలువడుతుంది. ఒకవేళ మనకు జలుబు చేసినట్లయితే దానికి కారణమైన వైరస్ లు ఈ సూక్ష్మ బిందువుల ద్వారా ఎదుటి వారి శ్వాస కోసం లోనికి ప్రవేశిస్తాయి. సూక్ష్మజీవులు, వాటి తాలూకు విష పదార్థాలు శ్వాస మార్గంలోని శ్లేష్మపు పొరలపై పెరుకున్నప్పుడు, వాటిని వదలించుకునే ప్రయత్నంలో దగ్గుం తుమ్ములు వస్తాయి.
జలుబు చేసిన వారు ముక్కుకు, నోటికి రుమాలనో, చేతినో అడ్డం పెట్టుకోకుండా తుమ్మినా, లేదా దగ్గినా వైరస్ లు సునాయాసంగా ఇతరుల శరీరంలోనికి చేరుకుంటాయి. వైరస్ లు మనిషి శరీరంలోనికి ప్రవేశించినప్పుడు, వాటికి వ్యతిరేకంగా పోరాడటం కోసం ప్రతిరక్షక కణాలు తయారవుతాయన్న సంగతి తెలిసిందే, కాకపొతే ఈ కణాలు తయారయ్యే కాల వ్యవధి వ్యాధినుండి వ్యాధికి మారుతుంటుంది. జలుబు విషయమే తీసుకుంటే ప్రతి రక్షక కణాలు తయారుకావడానికి కనీసం వారం రోజులు పడుతుంది; జలుబుకు చికిత్స చేస్తే వారం రోజులలో తగ్గుతుందనీ, చికిత్స చేయకపోతే ఏడురోజులకు తగ్గుతుందనే జన వాక్యం ఇందుకే పుట్టి ఉండొచ్చు.
జలుబుతో మొదలైన దగ్గు, జలుబుతో పాటే తగ్గుముఖం పడుతుంది. అలా తగ్గకుండా చాలా రోజుల పాటు కొనసాగుతున్నప్పుడు, శ్లేష్మం పసుపు ఆకుపచ్చల మిశ్రమ వర్ణంలో కనిపిస్తున్నప్పుడు వ్యాధి ప్రథమావస్థను దాటి ద్వితీయాంకంలోకి ప్రవేశించినట్లుగా అర్థం చేసుకోవాలి. అప్పుడు మందులు వాడటం తప్పనిసరి. దగ్గుకు అతి సాధారణ కారణం జలుబు అనుకున్నాం కదా. దగ్గు వల్ల పెద్ద ప్రమాదమేదీ జరుగదుగాని ఇబ్బందిగా, నలతగా అనిపిస్తుంటుంది. ఇది పూర్తిగా పని మానేసి విశ్రాంతి తీసుకోవలసినంత పెద్ద వ్యాధి కాదు. అలగాని దీనితో పనిచేయాలన్నా చిరాకుగానే ఉంటుంది.
గృహచికిత్సలు: 1. పొడి దగ్గులో గొంతును మార్దవం చేయడానికి పాలు నెయ్యిల మిశ్రమం బాగా పనిచేస్తుంది. 2. ఒకవేళ దగ్గుకు కారణం కఫమైతే, యష్టిమధుకం (అతిమధురం) వేరును డికాక్షన్ కాచి, తేనెతో, లేదా పంచదారతో కలిపి తీసుకుంటే కఫం తెగి, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. 3. మిరియాల చూర్ణాన్ని (చిటికెడు) నెయ్యి, చక్కెర, తేనెలతో కలిపి తీసుకోవాలి. 4. దగ్గు నుండి సత్వరమే ఉపశమనం పొందడానికి మిరియాలు, ఖర్జూరం, వాయువిడంగాలు, పిప్పళ్లను అన్నిటిని సమభాగాలు కలిపి పేస్టులాగా తయారుచేసి అరచెంచాడు చొప్పున చెంచాడు తేనెతో కలిపి తీసుకోవాలి.
ఔషధాలు: తాళీసాది చూర్ణం, ప్రవాళ భస్మం, అభ్రక భస్మం, శృంగి భస్మం, మహాలక్ష్మి విలాస రసం, స్వర్ణమాలినీ వసంత రసం, ప్రవాళ పంచామృతం, వాసరిష్టం, వాసా కంటకార్యవలేహ్యం, అగస్త్య హరీతకీ రసాయనం, చ్యవనప్రాశ లేహ్యం, లవంగాది వటి, ఏలాది వటి.
2. శ్వాసనాళ సంబంధ రుగ్మత (బ్రాంకైటిస్):
ఊపిరితిత్తులలోని శ్వాసనాళాల ఉపశాఖలు, వాటి శ్లేష్మపు పొరలూ వ్యాధిగ్రస్తమైనప్పుడు ఆ స్థితిని 'బ్రాంకైటిస్' అంటారు. ఇది దీర్ఘవ్యాధిగా పరిణమించినప్పుడు దగ్గు శ్లేష్మానుబంధంగా వస్తుంటుంది. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలమంతా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ధూమపానం చేసే వారిలో బ్రాంకైటిస్ లక్షణాలేక్కువగా కనిపిస్తాయి. దగ్గు వస్తునప్పటికి లెక్కచేయకుండా అదేపనిగా ధూమపానంధూమపానం చేసేటట్టయితే పరిస్థితి విషమిస్తుంది. శ్వాస వేగం పెరగడం, గాలి పీలుస్తున్నప్పుడు పిల్లి కూతలు ధ్వనించడం, శారీరక శ్రమను తట్టుకోకపోవడం అనే లక్షణాలు కనిపిస్తాయి. అంతే కాకుండా శరీరానికి సరిపడ్ద ప్రాణవాయువు అందకపోవడం వలన ముక్కు, పెదవులు, చేతులు నీలంగా మారుతాయి, ఇదే చాలా ప్రమాదకరమైన స్థితి కనుక వైద్య సహాయం తీసుకోవాలి.
ఔషధాలు: అగస్త్య రసాయనం, భారంగి గుడం, చ్యవన ప్రాశ లేహ్యం, దశమూలారిష్టం, ద్రాక్షాది చూర్ణం, ఏలాది చూర్ణం, కర్పూరాది చూర్ణం, కూష్మాండ లేహ్యం, లోకనాథ రసం, తాళీసాది చూర్ణం, విదార్యాది ఘృతం, వాసా కంటకారిలేహ్యం.
3. న్యుమోనియా, ఇతర ఊపిరితిత్తుల వ్యాధులు:
ముక్కునుండి, గొంతునుండి వ్యాధి కారకాంశాలు శ్వాసనాళికలోకి ప్రవేశించి శ్లేష్మపు పొరలను వాపునకు గురిచేసినప్పుడు దగ్గుతోపాటు ఛాతిలో నొప్పి కూడా వస్తుంది. మన శరరంలో ఊపిరితిత్తులు ఒక పొర మధ్య పదిలంగా ఉంటాయి. ఏదైనా కారణం చేత ఈ పొర వ్యాధిగ్రస్తమైతే (బ్రాంకోన్యుమోనియా) ఊపిరితిత్తులు పూర్తిస్థాయిలో వ్యాకోచించలేవు. ఇలాంటి సందర్భాలలో కూడా దగ్గుతోపాటు ఛాతిలో నొప్పి వస్తుంది.
ఔషధాలు: దశమూల కటుత్రయాది క్వాథ చూర్ణం, కస్తూరి మాత్రలు, కాలకూట రసం, మహాజ్వరాంకుశ రసం, నవగ్రహి సింధూరం, నారాయణ జ్వరాంకుశ రసం, ప్రతాప లంకేశ్వర రసం, సన్నిపాత భైరవ రసం (మహా, లఘు), స్వచ్చందభైరవ రసం, తాళీసాది చూర్ణం, త్రిభువన కీర్తి రసం.
4. క్షయ వ్యాధి (ట్యుబర్క్యులోసిస్):
దగ్గుతో పాటు బరువు కోల్పోవడం, రక్తహీనత, రాత్రిపూట చమట ఎక్కువగా పట్టడం తదితర లక్షణాలు కనిపిస్తున్నట్లయితే అన్ని కారణాల కంటే ముందు క్షయవ్యాధిని (ట్యుబర్క్యులోసిస్) గురించి ఆలోచించాలి. ఇది ట్యూబర్కిల్ బ్యాసిలై లేదా మైకోబ్యాక్తీరియం ట్యుబర్క్యులోసిస్ అనే సూక్ష్మజీవుల వలన వచ్చే సాంక్రమిక వ్యాధి, ఊపిరితిత్తులు ఇన్ ఫ్లేమ్ అవ్వడం, త్యూబర్కిల్ అనే బొడిపెల మాదిరి నిర్మాణాలు ఏర్పడటం, కణజాలలు కుళ్ళిపోయి వెన్నవంటి పదార్ధం తయారవడం, చీము గడ్డలు ఏర్పడటం, ఊపిరితిత్తులలోని గాయాలు మానేటప్పుడు సహజ కణజాలంతో కాకుండా నార వంటి పీచు పదార్థంతో పూరించబడటం వీటన్నిటి ఫలితంగా ఊపిరితిత్తుల కదలిక పరిమితమవుతుంది. ఈ లక్షణాలన్నీటి ద్వారానూ, ఇతర పరీక్షల ద్వారానూ క్షయ వ్యాధిని నిర్ధారించాల్సి ఉంటుంది.
గృహచికిత్సలు: 1. పెన్నేరు, పిప్పళ్ళు సమతూకంగా తీసుకొని, పొడిచేసి అరచెంచాడు మోతాదుగా పంచదార, తేనె, నెయ్యిలు కలిపి రోజు రెండుపూటలా తీసుకోవాలి. 2. పిప్పళ్ళు, ఎండుద్రాక్ష, పంచదారలను సమభాగాలు కలిపి పూటకు అరచెంచాడు మోతాదుగా రెండు పూటలా తీసుకోవాలి. 3. లాక్షా చూర్ణాన్ని (రెండు చెంచాలు), బూడిదగుమ్మడికాయ రసంలో ముద్దుగా నూరి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 4. అడ్డసారం ఆకులను దంచి రసం తీసి పూటకు పావు చెంచాడు మొతాడుగా రెండుపూటలా తగినంత తేనె చేర్చి తీసుకోవాలి. 5. రావి చెట్టు బెరడు, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, మండూరం వీటిని సమతూకంలో తీసుకొని తగినంత బెల్లం చేర్చి ముద్దగా నూరి రేగు గింజంత మాత్రలు చేసి అనుదినము వాడాలి.
ఔషధాలు: అమృతప్రాశ ఘృతం, అశ్వగంధాది లేహ్యం, చ్యవనప్రాశలేహ్యం, ద్రాక్షాది రసాయనం, ద్రాక్షారిష్టం, కూష్మాండ లేహ్యం, క్రమవృద్ధి లక్ష్మీ విలాస రసం, మకరధ్వజ సింధూరం, మహాలక్ష్మీ విలాస రసం, పూర్ణచంద్రోదయం, పంచబాణ రసం, స్వర్ణమాలిని వసంత రసం, విదార్యాది ఘృతం, వసంత కుసుమాకర రసం.
5. ఉరః క్షతం (బ్రాంకియక్టాసిస్):
క్షయం, బ్రాంకైటిస్, కోరింత దగ్గు, న్యుమోనియా మొదలయిన దీర్ఘకాల వ్యాధుల వలన ఊపిరితిత్తులలోని 'గాలినాళాలు' సాగగలిగే గుణాన్ని కోల్పోయి గట్టి పడతాయి. ఫలితంగా శ్లేష్మం తనంతట తాను బైటకి రాలేదు. ఈ స్థితిని వైద్యపరిభాషలో 'బ్రాంకియోక్టాసిస్' అంటారు. తీవ్రమైన దగ్గు, ఒక్కొక్కసారి రక్తం పడటం, అసాధారణ మోతాదులో శ్లేష్మం తయారవడం వంటివి ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు.
ఔషధాలు: అగస్త్య రసాయనం, చ్యవన ప్రాశ లేహ్యం, దశమూలకత్రయాది క్వాథ చూర్ణం, కనకాసవం, మకరధ్వజ సింధూరం, ప్రవాళ భస్మం, ప్రవాళ పంచామృతం, రస మాణిక్యం, శుభ్ర వటి, శృంగారాభ్ర రసం, వాతాఘ్ని కుమార రసం, వాసా కంటకారి లేహ్యం.
6. ఎంఫిసీమా
కాలుష్యం వలన 'ఎంఫిసీమా' అనే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి వస్తుంది. ఆరోగ్యవంతుల ఊపిరితిత్తుల్లో శాఖోపశాఖలుగా విస్తరించిన శ్వాస నాళాలు చివరాఖరుగా చిన్న చిన్న గాలి అరల్లోకి తెరచుకుంటాయి. ధూమపానం, కాలుష్యం, విషవాయువులు తదితరాల వల్ల ఈ అరల గోడలు శిథిలమై సాగగలిగే గుణాన్ని శాశ్వతంగా కోల్పోతాయి. ఫలితంగా ఈ అరల ద్వారా ప్రాణ వాయువు మారకం పరిపూర్ణంగా జరగదు. దీని పర్యవసానంగా ప్రాణవాయువు లోటుగా భర్తీ చేయడానికి శ్వాస వేగం పెరుగుతుంది. అయినప్పటికీ, శరీరావసరాలకు సరిపడా ఆక్సిజన్ అందక శరీరమంతా కొద్దిపాటి శ్రమకే నీలంగా మారుతుంది.
సూచనలు: ఈ వ్యాధిలో ప్రాణాయామం చేస్తే అంచి ఫలితం కనిపిస్తుంది. ఊపిరితిత్తుల వ్యాధుల్లో పేర్కొన్న అన్ని ఔషధాలు దీనిలో పనిచేస్తాయి.
7. ఉబ్బసం (ఆస్తమా):
చాలామంది అస్తమాను పిల్లికూతల ఆధారంగా మాత్రమే గుర్తించవచ్చునని అనుకుంటారు. అయితే ఆస్తమా ఒకోసారి, పొడి దగ్గు రూపంలో కూడా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా, రాత్రివేళల్లో పొడి దగ్గు మాత్రమే ఉంటే అస్తమాను అనుమానించాలి. ఇది చిన్న పిల్లలకు మరీ వర్తిస్తుంది. ఉబ్బసం వ్యాధిలో శ్వాస నాళాల గోడలలోని కండరాలు కుంచించుకుపోయి, గాలి ప్రవాహాన్ని అడ్డగిస్తాయి. కొన్ని సందర్భాలలో శ్లేష్మం ఎక్కువగా తయారవడం, గాలి నాళాలు వాయడం వంటి వాటి వల్ల గాలి మార్గాలు మరింత మూసుకుపోయి ఒక రకమైన కూత కూడా ధ్వనిస్తుంది.
గృహచికిత్సలు: 1. శ్వాసనాళాలు కుంచించుకుపోవడం వలన వచ్చే ఆయాసం, దగ్గులలో అడ్డరసం (సంస్కృతంలో వాసా) అద్భుతమైన ఔషధం. యోగ రత్నాకరుడనే ఆయుర్వేదాచార్యుడు తన యోగరత్నాకరంలో 'వాసా దొరుకుతున్నప్పుడు జీవించాలనే కోరిక బలీయంగా ఉన్న క్షయ వ్యాధిగ్రస్తులుగాని, రక్తస్రావంతో బాధపడే రక్త పిత్తవ్యాధిగ్రస్తులుగాని, దగ్గుతో పీడించబడే వ్యక్తులుగాని దుఖించాల్సిన అవసరం ఏముంది?” అని అభాయస్తమిస్తాడు. అల్లోపతి వైద్యవిధానంలోకూడా ఈ మొక్కనుంచి తీసిన వాససిన్ అనే ఆల్కలాయిడ్ ని 'బ్రోమోహెక్సిన్'గా తయారుచేసి బ్రాంకోడైలేటర్ గా, శ్వాస నాళాలను వ్యాకోచపరిచే నిమిత్తం వాడుతున్నారు. 2. శొంఠి పొడిని చెంచాడు వంతున రోజు 3 పూటలా నీళ్లతో/తేనెతో తీసుకోవాలి. 3. ఆవనూనె (రెండు చెంచాలు), బెల్లం (పెద్ద ఉసిరికాయంత) కలిపి, ముద్దచేసి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. 4. మేకమేయనిఆకు గుప్పెడు తెచ్చి ముద్దచేసి ఉదయం ఖాళీ కడుపునాతీసుకోవాలి. (దీనితో వాంతి జరిగి కఫం తెగి సాంత్వన లభిస్తుంది). 5. గుంటభారంగి (అరచెంచాడు, శొంఠిపొడి (అరచెంచాడు) గ్రహించి తగినంత తేనె కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 6. పిప్పళ్ళ చోర్ణం (పావు చెంచాడు). బెల్లం లేదా తేనెతో కలిపి తీసుకోవాలి. 7. ఉమ్మెత్త ఆకులను ఎండపెట్టి, నిప్పుల మీద వేసి దూపాన్ని పీల్చాలి.
ఔషధాలు: శ్వాస కుఠార రసం, సితోపలాది చూర్ణం, కర్పురాది చూర్ణం, తాళీసాది చూర్ణం, కనకాసవం, శ్వాసానంద గుళిక. అగస్త్య హరీతకీ రసాయనం.
8. ఊపిరితిత్తుల్లో రక్తపు గడ్డలు:
ధూమపానం చేసే వారిలోనూ, గర్భనిరోధక మాత్రలు వాడే వారిలోనూ (ఒకవేళ స్త్రీలైతే) వారో శరీరంలోని రక్తానికి "అంటుకుపోయే" గుణము, గడ్డకట్టే నైజము పెరిగిపోయి రక్తం గడ్డలుగా తయారవుతుంది. ఈ రక్తపు గడ్డలు రక్త ప్రవాహం ద్వారా ఊపిరి తిత్తులలోకి ప్రవేశించి, ఏదైనా ఒక రక్త నాళంలో తట్టుకుని, ఆ భాగానికి రక్త సరఫరాను నిలిపివేస్తాయి. దీని వలన ఆ ప్రాంతంలోని కణజాలాలు నిర్జీవమైపోతాయి. ఇటువంటి సందర్భాలలో తీవ్రమైన జ్వరం, ఛాతిలో పొడుస్తున్నట్లు బాధ ఉంటాయి. అంతే కాకుండా దగ్గు వస్తుంది. ఇది కఫం, రక్తాలతో కూడిగాని, లేకుండాగాని కనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆయా కారణాలను కనిపెట్టి వైద్యసలహాలతో వాటికి తగిన చికిత్సలు తీసుకోవాలి.
9. ఊపిరితిత్తుల క్యాన్సర్:
50 సంవత్సరాలు దాటినా వ్యక్తుల్లో - ముఖ్యంగా ధూమపానం చేసే అలవాటున్న వారిలో చాలా కాలంగా దగ్గు వస్తూ, కఫం రక్తంతో కలిసికాని, లేకుండా కాని పడుతున్నట్లయితే ఆ వ్యక్తికీ అత్యవసరంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ కు సంబంధించి అన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. మూడు వారాల నుంచి దగ్గు ఉండటం, సాధారణ మందులకు దగ్గు లొంగకపోవడం, బరువు తగ్గటం, శ్వాస వేగం పెరగడం ఈ లక్షణాల ఆధారంగా ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్ ను అనుమానించాలి.
10. శ్వాసకోశ సంబంధ ఎలర్జీలు (ఈసినోఫిలియా):
వాతావరణంలోని పుప్పొడి రేణువులు, దుమ్ము, ధూళి మొదలగునవి చాలా మందిలో దగ్గును, తుమ్ములను కలిగిస్తాయి. ఒక్కో వ్యక్తికీ ఒక్కో పదార్ధం ఎలర్జీని కలిగిస్న్తుంది. ఫలానా వస్తువుల వల్ల మాత్రమే ఎలర్జీ వస్తుందని తేల్చి చెప్పలేము, ఎలర్జీ వలన దగ్గు వస్తుందనుకుంటే దానికి కారణాన్ని కనిపెట్టి దూరంగా వుంచడం / వుండటం ఉత్తమమైన పధ్ధతి.
ఔషధాలు: దశమూల కుటుత్రయాది క్వాథ చూర్ణం, కామదుఘారసం, మంజిష్టాది క్వాథ చూర్ణం, మౌక్తీక భస్మం, ప్రవాళ భస్మం, ప్రవాళ పంచామృతం, రసమాణిక్యం, శ్వాసకుఠారం, శ్వాసానంద గుటిక, తాళీసాదిచూర్ణం, తాళక భస్మం, వాతగ్ని కుమార రసం, హరిద్రాఖండ యోగం (బృహత్)
11. ఊపిరితిత్తుల వాపు (పల్మనరీ ఎడిమా):
గుండె కండరాలు సమర్థవంతంగా రక్తాన్ని పంప్ చేయలేనప్పుడు, సిరలలో రక్తం నిలిచిపోయి రక్త భారానికి కారణమవుతుంది. పర్యవసానంగా ఊపిరితిత్తులు కూడా నిండిపోతాయి. అటువంటి స్థితిలో ఊపిరితిత్తులలోని గాలి, గుండె గదులలోకి లీక్ అవడం వలన ప్రాణవాయువు శరీరంలోని ప్రవేశించడం కష్టమవుతుంది. దీని ఫలితంగా శ్వాసవేగం పెరగడం, వెల్లకిలా పడుకున్నప్పుడు ఉక్కిరిబిక్కిరి అయినట్లు అనిపించి లేచి కూర్చోవాలనిపించడం జరగవచ్చు, వైద్య పరిభాషలో ఇలాంటి స్థితిని 'పల్మనరీ ఎడిమా' అంటారు. ఈ వ్యాధి వచ్చినవారిలో ఊపిరితిత్తుల పనితీరు సరిగా ఉండనందున శరీరంలో వాపు జనిస్తుంది.
సూచనలు: దీనికి దగ్గు మందులతో పాటు మూత్రాన్ని జారీ చేసే మందులను గోక్షురాది గుగ్గులు, చంద్రప్రభావటి, దుగ్ధవటి, గుడపిప్పలి, పునర్నవాసవం) కూడా వాడాల్సి ఉంటుంది.