ఆయాసం:

 

1. మీరు తెల్లగా పాలిపోయినట్లు కనిపిస్తారా? తీవ్రమైన నీరసం, నిస్సత్తువులు అవహిస్తున్నాయా?

రక్తహీనత (ఎనీమియా)

2. సిగరెట్లు ఎక్కువగా తాగుతారా?

ధూమపాన దుష్ఫలితం

3. ఊపిరి తీసుకునేటప్పుడు పిల్లి కూతల వంటి శబ్దాలు వస్తున్నాయా? రాత్రిపూట పొడిదగ్గు వస్తుందా?

ఉబ్బసం (ఆస్తమా)

4. చేతి గోర్లు కుంభాకారంలో - తెరించిన గొడుగు వెలుపలి తలంలాగా ఉంటాయా?

ఎంఫిసీమా

5. ఛాతీలో నొప్పిగా ఉంటుందా? ముఖ్యంగా శారీర శ్రమ చేసినప్పుడిలా జరుగుతుందా? మీకు అధిక రక్తపోటు ఉన్నట్లుగాని, గుండెలో ధ్వని (మర్మర్స్) వినిపించినట్లుగాని మిమ్మల్ని పరీక్షించిన వైద్యులన్నారా?

గుండె జబ్బులు (హార్ట్ డిసీజెస్)

6. శరీరం లోపల వేడిగా, ఆరాటంగా అనిపిస్తుందా? లేక ఈ మధ్య నెప్పుడన్నా తీవ్రమైన ఉష్ణోగ్రతతో బాధపడ్డారా?

ప్రాణవాయువు చాలకపోవడం

7. ఆయాసం హఠాత్తుగా, ఛాతిలో పొడుస్తున్నట్లుండే నొప్పితో మొదలయ్యిందా?

స్పాంటేనియస్ న్యూమోథొరాక్స్

8. ముందుగా కాలి పిక్కల్లో నొప్పి, వాపులు మొదలై ఆ తరువాత ఆయాసం వచ్చిందా?

ఊపిరితిత్తుల నాళాల్లో గడ్డలు అడ్డుపడటం

9. విషవాయువుల మధ్య పనిచేస్తారా?

కాలుష్యపూరిత వాతావరణ దుష్ఫలితం

 

చాలామంది అయాసమూ, ఉబ్బసమూ ఒకటే అనుకుంటారు గాని కాదు, ఉబ్బసం అనేది ఒక వ్యాధి, ఆయాసం అనేది ఒక లక్షణం. ఉబ్బాసంలో ఆయాసం ఉంటుందికాని ఆయసంలో ఉబ్బసముండాలని నియమం లేదు.

ఎవరికైనా అకారణంగా ఆయాసం వస్తున్నట్లు అనిపిస్తే దానిని తీవ్రమైన అంశంగానే భావించాలి. కారణం లేకుండా ఫలితం ఉండదు కాబట్టి ఆకారణంగా వస్తున్నట్లు అనిపించినప్పటికి, దాని వెనుక ఏదో నిగూఢమైన లేదా ప్రమాదమైన కారణం వుండే ఉంటుంది. దానికి కూలంకషంగా శోధించాలి.

శ్వాసక్రియ గత సంఖ్యల్లో కష్టత, వైషమ్యాలు చోటు చేసుకున్నప్పుడు దానిని ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలు శ్వసకృస్చ్రత వికృత శ్వాసగా వర్ణించాయి.

ఒకోసారి ఆయాసం ఒక లక్షంగా కాకుండా, ఒక స్వతంత్రమైన వ్యాధిగా కూడాసంభవించే అవకాశముందని ఈ గ్రంథాలు తెలిపాయి. అలా వచ్చే ఆయాసాన్ని 'శ్వాస వ్యాధి' అంటారు. యోగరత్నాకరం అనే ఆయుర్వేద గ్రంథం శ్వాస కలగడానికి కారణాలను సమగ్రంగా వివరించింది. వాటిల్లో ప్రధానమైనవి - పాండు వ్యాధి (రక్తాల్పత), జ్వరం, ధూళితో నిండిన వాతారవరణంలో తిరగడం, ఆహితరకమైన పోగలను పీల్చుకోవడం, చల్లని వాతావరణంలో తిరగడం, దగ్గును అశ్రద్ధ చేయడం, విషతుల్యమైన ఆహార పదార్థాలను తీసుకోవడం, అజీర్ణం వల్ల విరేచనాలు కావడం (అమాతిసారం) మొదలైనవి.

ఆయుర్వేదం శ్వాస వ్యాధిని అయిదు విధాలుగా విభజించి వర్ణించింది. ఉబ్బసం వ్యాధికి ప్రాచుర్యాన్ని పొందిన 'తమక శ్వాస' ఈశ్వాస వ్యాధిలో ఒక విభాగమే. ఎక్కువ లావుగా ఉన్నవారు, అదేపనిగా ధూమపానం చేస్తూ వ్యాయామం జోలికి పోకుండా వుండేవారు కదిలే బస్సులోనికి లంఘించినప్పుడో, రెండేసి మెట్లను అమాంతం ఒకేసారి ఎక్కినప్పుడో ఆయాస పడటం అసహజం కాదు. కాని, ఎవరిలోనైనా స్పష్టమైన కారణమేది లేకుండా - టీవీ చూస్తున్నప్పుడో, భోజనం చేస్తున్నప్పుడో హఠాత్తుగా ఆయాసం మొదలైతే దానిని సీరియల్ గానే తీసుకోవాలి.

మనలో శ్వాసక్రియ అసంకల్పితంగా, నిమిషానికి పదిహేనుసార్లు చొప్పున జరుగుతుంటుందన్న సంగతి తెలిసిందే. మామూలు సందర్భాల్లో శ్వాస తీసుకుంటున్నామన్న సంగతే మనకు తెలియదు. బాగా వ్యాయామం చేసినప్పుడు, ఆందోళనగా ఉన్నప్పుడు, ఉత్కంఠతతో బిగదీసుకుపోయినప్పుడు మన శరీరపు క్రియాధర్మాలు వేగవంతమవుతాయి. ఫలితంగా హెచ్చు ప్రాణ వాయువు (ఆక్సిజన్) ఖర్చవుతుంది. దానితోపాటే హెచ్చు బొగ్గు పులుసు వాయువు (కార్బన్ డైఆక్సైడ్) శరీరంలో సంచితమవుతుంది. ఇది శరీరానికి ఎక్కువగా అవసరం లేనిదీ, హెచ్చు మోతాదుల్లో నిల్వ ఉండకూడనిది కనుక బయటకు వెళ్ళిపోవాల్సి వుంటుంది. అలా వెళ్ళాలంటే శ్వాస వేగం పెరగాలి. ఆయాసం ఇలా మొదలవుతుంది.

శారీరక శ్రమ వల్ల ఆయాసం వస్తున్నప్పుడు కొంతమంది ఆదుర్దాతో కల్పితంగా శ్వాస క్రియను వేగవంతం చేస్తారు. ఇలా చేయడం వల్ల కావలసిన దానికన్నా ఎక్కువ మోతాదుల్లో బొగ్గుపులుసు వాయువు బయటకు వెళ్ళిపోవడం వల్ల వల్ల శరీరంలో రసాయన పదార్థాల సమతూకం దెబ్బతింటుంది. ఫలితంగా కళ్ళు తిరిగినట్లనిపించడం, కాళ్ళు చేతులు తిమ్మిర్లు పట్టడం, స్పృహతప్పడం వంటివి జరుగుతాయి. ఇటువంటి సందర్భాల్లో ముక్కు ఎదురుగా కాగితపు సంచిని ఒక దానిని తెరిచి ఉంచి, వదిలిన గాలినే మళ్ళీ పీల్చాలి. ఇలా చేయడం ద్వారా కార్బన్- డై -ఆక్సైడ్ తిరిగి భర్తీ అవుతుంది. అది కుదరకపోతే ఒక ముక్కు రంధ్రాన్ని వేలితో మూసి, మరో రంధ్రంతో గాలి పీల్చినా సరిపోతుంది.

శ్వాస వేగం ఏ సందర్భాల్లో లేదా ఏ వ్యాధుల్లో పెరుగుతుందో తెలుసుకునే ముందు, అసలు ప్రాణవాయువు రక్తంలో ఎలా కలుస్తుందో తెలుసుకోవడం అవసరం.

ప్రాణ వాయువు రక్తంలో కలిసే విధానం:

వాతావరణంలో ఇతర వాయువులతోపాటు ప్రాణ వాయువు కూడా ఉంటుందన్న సంగతి తెలిసిందే. మనం గాలి పీల్చుకున్నప్పుడు ఇది ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. ప్రాణ వాయువు ఊపిరితిత్తుల్లో ఉండే చిన్న చిన్న కుహరాల (అల్వియోలై) గోడల ద్వారా రక్తంతో (రక్తకణాలలో వుండే హిమోగ్లోబిన్ తో) కలిసిపోయి సర్వశరీరగతంగా పయనిస్తూ కణాలలోనికి వీలినమవుతుంది. ఇలా సరఫరా అయిన ప్రాణవాయువు ద్వారా కణజాలలు తమ క్రియాధర్మాలను నిరాటంకంగా కొనసాగిస్తాయి. ఏదైనా కారణంచేత హిమోగ్లోబిన్ లోపిస్తే, లేదా ఎర్ర రక్తకణాలు వ్యాధిగ్రస్తమైతే, అప్పుడు రక్తానికి ప్రాణవాయువును సరఫరా చేసే శక్తి తగ్గిపోతుంది.

మన దైవందిన జీవితంలో అనేక సందర్భాల్లో ప్రాణ వాయువు కొరత ఏర్పడే అవకాశం ఉంది. అందరికీ, అన్ని వేళలా సమస్య ఉత్పన్నం కాకపోవచ్చుగాని. ప్రతి వారికి - కొంతమందికి తరచుగాను, మరి, కొంతమందికి అరుదుగాను ఈ సమస్య ఎదురవ్వచ్చు. హిల్స్టేషన్లు లాంటి ఎత్తైన ప్రదేశాల్లో నివసించే వారికీ, పర్వతారోహాలకు చుట్టుపక్కల వాతావరణంలో ఆక్సిజన్ శాతం తగ్గటం వల్ల ఆయాసంగా అనిపించవచ్చు. కొంతమందికి గొంతులో ఏదన్నా అడ్డుపడ్డప్పుడు ఊపిరందకపోవడం మూలాన ఆయాసం వస్తుంది. అలాగే, మరి కొంతమందిలో గుండె సమర్థవంతంగా పనిచేయలేని సందర్భాల్లో, ఊపిరితిత్తులు నిండుకుపోవడం మూలాన ఆయాసం రావచ్చు. అంతే కాకుండా న్యుమోనియా వంటి వ్యాధులు సోకి ఊపిరితిత్తులు పూర్తిస్థాయిలో పనిచేయనప్పుడు కూడా ఆయాసం వస్తుంది. ఒకోసారి గుండె, ఊపిరితిత్తులు, శ్వాసనాళాలు అన్నీ సక్రమంగానే ఉన్నా ఆయాసం పుట్టే అవకాశం ఉంది. ఉదాహరణకు - తీవ్రమైన జ్వరం, థైరాయిడ్ గ్రంథి అసాధారణ స్థాయిలో చురుకుదనాన్ని సంతరించుకోవడం, స్థూలకాయం, శరీరపు లోపలి పొరల్లో ఎక్కడో, చడీ చప్పుడు కాకుండా క్యాన్సర్ పెరగడం, కొన్ని రకాల మందులు. వీటన్నిటివల్లా ఆయాసం రావచ్చు.

మరి మీ విషయంలో, ఆయాసానికి కారణం ఏమై వుంటుంది? చూద్దాం.

1. రక్తహీనత (ఎనీమియా):

రక్తాల్పతతో ఊపిరి అందనట్లు ఆయాసంగా ఉంటుంది. రక్తాల్పతను కొన్ని ప్రాంతాల్లో 'తెల్లకామెర్లు' అని పిలుస్తుంటారు. ఆయుర్వేదం రక్తాల్పతను 'పాండు వ్యాధి'గా పేర్కొంది. రక్తాన్ని కోల్పోవడం, రక్త కణాలు ఎక్కువగా వినాశం చెందటం వంటి కారణాల చేత రక్తాల్పత ఏర్పడుతుంది. ఈ వ్యాధిలో ఆయాసంతోపాటు చర్మం, గోళ్లు, శ్లేష్మపు పొరలు తెల్లగా, 'రక్తహీనంగా' కనిపిస్తాయి. అలాగే అలసట, కళ్ళు తిరిగినట్లనిపించడం, గుండె దడ, అన్న వాహిక సమస్యలు, నెలసరిలోపాలు, లైంగిక స్తబ్ధత కూడా ఉండే అవకాశం ఉంది. రక్తాన్ని హిమోగ్లోబిన్ కోసం పరీక్ష చేయిస్తే రక్తాల్పత వుందో లేదో తెలుస్తుంది.

ఆయాసం వస్తున్నప్పుడు, దానికి కారణం రక్తహీనతే అయినప్పుడు, దానికి దారితీసే కారణాలన్నిటినీ కూలంకషంగా పరిశీలించవలసి ఉంటుంది. క్షారాలు. పుల్లటి పదార్థాలు, ఉప్పు వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్లగాని, వేడిచేసే పదార్థాలు, విరుద్ధమైన ఆహార ద్రవ్యాలు, శరీరానికి పడని 'అసాత్మ్య' పదార్థాలు వీటిని హెచ్చు మొత్తాల్లో తీసుకోవడం వల్లగాని పాండు వ్యాధి వస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. కాబట్టి, ముందుగా వీటన్నిటిని వదిలేయాలి. అలాగే పగటిపూట నిద్రపోవడం, అతిగా వ్యాయామం చేయడం, అతిగా కామకపాలాల్లో పాల్గొనడం వల్ల కూడా ఈ వ్యాధి సంభవిస్తుంది కాబట్టి ఈ విహారాలన్నిటినీ వదిలేయాలి. అంతేకాకుండా, చరక సంహిత ఇతర వ్యాధులను అశ్రద్ధ చేయడం వల్ల కూడా పాండు వ్యాధి వస్తుందని చెబుతూ రక్తస్రావం ప్రధానంగా వుండే రక్తపిత్త వ్యాదినీ, రక్తాతిసారాన్నీ, రక్తం పడే నైజం వున్న మొలల వ్యాధినీ, క్షయవ్యాధినీ, నెలసరిలో అధికంగా కోల్పోయే రక్తప్రదర వ్యాధినీ ప్రముఖ కారణాలుగా చెప్పింది. కాబట్టి, పాండు వ్యాధికి చికిత్స చేసే ముందు దానికి కారణమైన ఈ వ్యాధులకు కూడా చికిత్స చేయాలి.

గృహచికిత్సలు: 1.ఉసిరికాయలు (6 కిలోలు), బెల్లం (మూడుకిలోలు) తీసుకొని ఒకదానిమీద మరోదానిని పొరలుపొరలుగా ఒక మట్టికుండలో పేర్చాలి. కుండపైన గాలి చొరబడకుండా మూకుడు పెట్టి పైనుంచి మందపాటి గుడ్డతో వాసికం కట్టి భూమిలో మండలం (40 రోజులు) పాతిపెట్టాలి. తరువాత కుండను తీసి లోపలి పదార్థాలను బాగా కలిపి వారంపాటు వదిలేయాలి. పైన ఒక రకమైన ద్రవం తేలుతుంది. దీనిని పారబోసి మిగిలినదానిని పావు కప్పు మోతాదుగా రోజుకు రెండుసార్లు చొప్పున తీసుకోవాలి. 2. కరక్కాయ చూర్ణాన్ని గాని, శొంఠి చూర్నాన్నిగాని, అరచెంచాడు మోతాదుగా బెల్లంతోకలిపి రోజు రెండు పూటల తీసుకోవాలి. 3. చెరుకు రసాన్ని గ్లాసెడు చొప్పున రోజుకు కనీసం ఒకసారి తాగాలి. 4. తిప్పతీగ, త్రిఫలాలు, అడ్డరసం, కటుకరోహిణి, నేలవేము, వేప పట్ట. వీటిని సమతూకంగా తీసుకొని కషాయం కాచి రోజుకి రెండుసార్లు తాగాలి.

ఔషధాలు: లోహ భస్మం, పునర్నవాది మండూరము, కాంత వల్లభరసం, నవాయసలోహం, లోహాసవం, ఆయత్మ్రతి, భృంగరాజాసవం.

2. ధూమపాన దుష్ఫలితం:

సిగరెట్ల వల్ల శ్లేష్మపు పొరలు తడారిపోయి, ప్రాణవాయువు సరఫరాలో సమస్య ఏర్పడుతుంది. ఫలితంగా, గాలి కోసం ఆయాస పడాల్సి వస్తుంది, ఆయాసం వస్తున్నప్పుడు సిగరెట్ మానేస్తే చక్కటి మార్పుకనిపిస్తుంది. అయితే అప్పటికే ధూమపానం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిని వుంటే కేవలం సిగరెట్లు మానేసినంత మాత్రాన సరిపోదు, చికిత్స కూడా తీసుకోవాలి.

3. ఉబ్బసం (ఆస్తమా):

ఆయాసంతోపాటు ఉబ్బాసంలో పిల్లోకూతలు, రాత్రిపూట పొడిదగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది ఎక్కువగా వంశపారంపర్యంగా వస్తుంటుంది.

శ్వాసనాలికల గోడలు ముడుచుకోవడం, వాటిల్లోని శ్లేష్మపు పొరలు ఉబ్బడం తదితర కారణాల చేత ఉబ్బసం వస్తుంది. వాతావరణంలోనిపుప్పొడి రేణువులు, దుమ్ముధూళిల్లో వుండే కీటకాలూ, అవి విడుదలచేసే రసాయనాలూ, పశువుల మల మూత్రాలూ, పక్షుల ఈకలతోచేసిన అలంకరణసామగ్రీ, దిండ్లు - పరుపులు మొదలైనవీ, కొన్ని రకాల మందులూ (ఆస్ర్పిన్, నొప్పిని తగ్గించడానికి తీసుకునే నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ ఫ్లమేటరీ డ్రగ్స్ మొదలైనవి) ఇవన్నీ శరీరంలో ఎలర్జీని కలిగించే అంశాలు. వీటికి వ్యతిరేకంగా ప్రతిరక్షక కణాలు తయారై ఉబ్బసాన్ని కలిగిస్తాయి.

ప్రపంచజనాభాలో 10 నుంచి 20 శాతం మంది ప్రజలు ఉబ్బసంతో బాధపడుతున్నారు. దురదృష్టకరమైన విషయమేమిటంటే, ఈ వ్యాధి, ప్రాప్తించే విధానం గురించి, వ్యాధి సమగ్రరూపం గురించి ఎన్ని కొత్త సంగతులు తెలుస్తున్నప్పటికీ రోజు రోజుకి దీనితో బాధపడేవారు ఎక్కువవుతున్నారు తప్పితే తగ్గడం లేదు. దీనికి కారణం నివారణ పద్దతుల మీద అవగాహన లేకపోవడమే..

ఉబ్బసం వ్యాధికి లోనయినవారు గాలి సరిగా అందకపోవడం మూలాన, అదనపు కండరాలను శ్వాస క్రియకు ఉపయోగించడం కోసం, భుజాలను బిగదీసి, ముందుకు వంగి శ్వాస పీల్చుకుంటూ ఉంటారు.

చేపలు, గుడ్లు, పాలు, గోధుమలు, మద్యం మొదలైనవి ఈ వ్యాధిని తీవ్రతరం చేసే అవకాశం ఉంది. అలాగే మానసికంగా, శారీరకంగా అలసిపోయినప్పుడూ, విషవాయువులకు గురైనప్పుడూ, భావావేశానికి లోనయినప్పుడూ ఇది తిరగబెడుతూ ఉంటుంది.

ఉబ్బసాన్ని ఆయుర్వేద గ్రంథాలు 'తమక శ్వాస' అనే పేరుతో వర్ణించాయి. ఈ వ్యాధి సాధ్యాసాధ్యతల విషయాన్ని తీసుకున్నట్లయితే, దీనిని 'యావ్య' వ్యాధిగా ఈ గ్రంథాలు పేర్కొన్నాయి. యావ్య వ్యాధులంటే నియంత్రించగలిగినవేగాని, నిర్మూలించలేనివని అర్థం. అదృష్టమేమిటంటే ఉబ్బస వ్యాధి తొలిదశలో ఉన్నప్పుడు, రోగి బలహీనంగా లేనప్పుడూ ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించగలిగే అవకాశం వుంది.

పుప్పొడి రేణువులు ఎలర్జీలకో, ఆస్త్మాకు ప్రధానం కారణం. అందుకే సాధ్యమైనంత వరకూ, మొక్కలు పుష్పించే సమయాలలో తోటల వైపు వెళ్ళకూడదు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా పుప్పొడి లేకుండా తలుపులన్నీ వేసుకుంటే మంచిది. ఇంటిని చీపురుతో కాకుండా వ్యాక్యూము కీనర్ తో శుభ్రం చేస్తే దుమ్ములేవకుండా ఉంటుంది. అలాగే దుప్పట్లను ప్రతిరోజు దులుపుతూ వుండాలి (మీరు కాకుండా, ఎలర్జీ తత్వం లేని ఇతరులు), పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లులు, గుఱ్ఱాలు వంటి వాటి రోమాలవల్ల ఎలర్జీ వస్తున్నప్పుడు వారి జోలికి వెళ్లకుండా ఉండటం అన్నిటికంటే ఉత్తమం. అలాగే ఈకలతో చేసిన పరుపులనూ, ఇతర వస్తువులనూ ఉపయోగించకూడదు. ఆహారం కూడా ఏది పడుతుందో, ఏది పడదో చూసుకుని, ఆ ప్రకారం తీసుకోవాలి.

గృహచికిత్సలు: 1. శ్వాస నాళాలు కుంచించుకుపోవడం వలన వచ్చే ఆయాసం, దగ్గులలో అడ్డరసం (సంస్కృతంలో వాసా) అద్భుతమైన ఔషధం. యోగ రత్నాకరుడనే ఆయుర్వేదాచార్యుడు తన యోగరత్నాకంలో “వాసా దొరుకుతున్నప్పుడు జీవించాలనే కోరిక బలీయంగా ఉన్న క్షయవ్యాధిగ్రస్తులుగాని, రక్త స్రావంతో బాధపడే రక్త పిత్తవ్యాధిగ్రస్తులుగాని, దగ్గుతో పీడింపబడే వ్యక్తులు గాని దుఃఖించాల్సిన అవసరం ఏమున్నది?” అని అభయహస్తమిస్తాడు. అల్లోపతి వైద్య విధానంలోకూడా ఈ మొక్కనుండి తీసిన వాసనిన్ అనే ఆల్కలాయిడ్ ని 'బ్రోమోహేక్సిన్'గా తయారుచేసి బ్రాంకోడైలెటర్ గా, శ్వాస నాళాలను వ్యాకోచపరచే నిమిత్తం వాడుతున్నారు. 2. శొంఠి పొడిని చెంచాడు వంతున రోజు 3 పూటలా నీళ్లతో / తేనెతో తీసుకోవాలి. 3. ఆవనూనె (రెండు చెంచాలు), బెల్లం (పెద్ద ఉసిరికాయంత కలిపి, ముద్దచేసి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. 4. మేకమేయనిఆకు గుప్పెడు తెచ్చి ముద్దచేసి ఉదయం ఖాళీ కడుపున తీసుకోవాలి. (దీనితో వాంతి జరిగి కఫం తెగి సాంత్వన లభిస్తుంది. 5. గంటు భారంగి (అరచెంచాడు), శొంఠిపొడి అరచెంచాడుగ్రహించి తగినంత తేనె కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 6. పిప్పళ్ళ చూర్ణాన్ని (పావు చెంచాడు), బెల్లం లేదా తేనెతో కలిపి తీసుకోవాలి. 7. ఉమ్మెత్త ఆకులను ఎండబెట్టి, నిప్పుల మీద వేసి ధూపాన్ని పీల్చాలి.

ఔషధాలు: శ్వాసకుఠార రసం, సితోపలాది చూర్ణం, కర్పూరాది చూర్ణం, తాళీసాది చూర్ణం, కనకాసవం, శ్వాసానంద గుళిక, అగస్త్య హాకీతకీ రసాయనం.

4. ఎంఫిసీమా:

ఊపిరితిత్తుల్లోని గాలి కుహరాలు అసాధారణంగా వ్యాకోచం చెంది, సాగుడు గుణాన్ని కోల్పోయినప్పుడు 'ఎంఫిసీమా' అంటారు. ప్రాణవాయువు సరిగా అందకపోవడం మూలాన ఈ వ్యాధికి గురైన వాళ్ళ పెదవులూ, గోర్లూ, శ్లేష్మపు పోరాలూ నీలంగా కనిపిస్తాయి. ఈ లక్షణాలతో పాటు ఆయాసం కూడా ఉంటుంది. ఇవే లక్షణాలు ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్ లో కూడా కనిపించే అవకాశం ఉంది. సూచనలు: దీనికి వెంటనే వైద్య సహాయం పొందాలి. ఎంఫిసీమా వ్యాధిలో ప్రాణాయామం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఊపిరితిత్తుల వ్యాధుల్లో పేర్కొన్న అన్ని ఔషధాలు దీనిలో పనిచేస్తాయి.

5. గుండె జబ్బులు (హార్ట్ డిసీజెస్):

గుండె కవాటాలు వ్యాధి గ్రస్తమవడం (వాల్వులర్ హార్ట్ డిసీజెస్), గుండెకు రక్త సరఫరా సరిగా అందక నొప్పి రావటం (యాంజైనా), రక్తపోటు పెరగటం వంటివి జరిగినప్పుడు శ్వాస వేగం పెరుగుతుంది. ఇదొక పరిహారాత్మక (కాంపెన్సేటరీ)క్రియాదర్మం. ఈ స్థితుల్లో ప్రాణ వాయువు శరీర కణజాలలకు పరిపూర్ణంగా చేరలేదు కాబట్టి. హెచ్చు ప్రాణవాయువు కోసం అదనంగా గాలి పీల్చుకోవాల్సి వస్తుంది.

గుండె కండరాల శక్తి క్షీణించినప్పుడు కాళ్ళ మడమలు వాయడం, వెల్లకిలా పడుకున్నప్పుడు ఆయాసం అనిపించడం జరుగతాయి. రక్త ప్రసరణ అప్రతిహతంగా జరగకుండా అడ్డగించబడటం వల్ల ఇలా జరుగుతుంది. గుండె జబ్బులవల్లా, రక్తపోటు వల్లా ఆయాసం వస్తుంటే కారణానుగుణమైన చికిత్సలు అవసరమవుతాయి.

ఔషధాలు: హృదయశూలలో (యాంజైనా)- శృంగిభస్మం, మహావాత విధ్వంసినీ రసం, త్రైలోక్యచింతామణి రసం, జహర్ మొహర్ భస్మం, బృహత్ వాత చింతామణి, హృదయశోథ (కంజేస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్)లో - అభ్రకభస్మం, పునర్నవాది మండూరం, ప్రభాకరవటి, లక్ష్మీ విలాస రసం, ఆరోగ్యవర్ధినీవటి, మాక్షీక భస్మం, వాల్వులు వ్యాధిగ్రస్తమైనప్పుడు - అకీక భస్మం అకీకపిష్టి, మాణిక్యభస్మం, సంగేజహరాత్ భస్మం, పూర్ణచంద్రోదయ రసం, యాకూతి, స్వర్ణమాలినీ వసంత రసం.

6. ప్రాణవాయువు చాలకపోవడం:

జ్వర తీవ్రతలోనూ, థైరాయిడ్ గ్రంథి అసాధారణంగా చురుకుదనాన్ని సంతరించుకున్నప్పుడు శరీరపు కణజాలాలు సాధారణ స్థితిలో కంటే అధికంగా పనిచేస్తాయి. దీనితో శరీరానికి అదనపు ప్రాణవాయువు అవసరమవుతుంది. పర్యవసానంగా, శ్వాస వేగవంతమవుతుంది. ఈ రెండు స్థితులేకాకుండా - శరీరం బరువెక్కినప్పుడు, లోపలకంతులు లేదా ట్యూమర్లు పెరుగుతున్నప్పుడు, శక్తికి మించి శ్రమించినప్పుడు, ఇంకా ఇలాంటి చాలా రకాల అసాధారణ పరిస్తితులల్లో 'రొప్పు' వచ్చే అవకాశం ఉంది. ఈ లక్షణం కనిపిస్తున్నప్పుడు కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవాలి.

7. స్పాంటినియస్ న్యూమోథొరాక్స్:

రెండు ఊపిరితిత్తుల్లో ఒకటి పతనం చెందినప్పుడు ఆయాసంతోపాటు ఉన్నట్లుండి 'ఛాతిలో పొడుస్తున్నట్లుండే' నొప్పి ప్రారంభమవుతుంది. వివిధ కారణాలచేత ఒక పక్క ఊపిరి తిత్తులోని 'గాలి' ఊపిరితిత్తి గోడను చేధించుకొని ఛాతి కుహరం లోనికి ప్రవేశించి, ఊపిరి తిత్తులను, గుండెను ఒక పక్కకి నెట్టేస్తుంది. ఇలాంటప్పుడు ఛాతిలో పదునైన నొప్పి రావడం, శ్వాస వేగం పెరగడం, దగ్గు రావడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఇలా జరగడాన్ని 'స్పాంటినియస్ న్యూమోథొరాక్స్' అంటారు. దీనికి సత్వరమే వైద్య సహాయం పొందాలి.

8. ఊపిరితిత్తుల నాళాల్లో గడ్డలు అడ్డుపడటం:

కాళ్ల సిరల్లో గడ్డలు ఏర్పడినప్పుడు (డీప్ వీన్ త్రాంబోసిస్), ఒకోసారి అవి ఎగువకు - ఊర్ద్వముఖంగా వెళ్లి ఊపిరితిత్తుల్లో తట్టుకుపోయే అవకాశం ఉంది, అలాంటప్పుడు ఛాతి నొప్పితో పాటు శ్వాస వేగం కూడా పెరుగుతుంది. ఒకోసారి దగ్గు, రక్తపు జీరతో కూడిన శశ్లేష్మం పడటం వంటివి కూడా సంభవిస్తాయి. ఇలా ఎక్కువగా సంతాన నిరోధక మాత్రలు వాడే స్త్రీలలో జరిగే అవకాశం ఉంది. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు మూత్రాన్ని జారీ చేసే మందులనూ, రక్తాన్ని పలుచగా ఉంచే మందులనూ వైద్య సలహా మేరకు ఉపయోగించాల్సి ఉంటుంది.

ఔషధాలు: లశునాదివటి, నాగార్జునాభ్రరసం, గోక్షురాది గుగ్గులు, సమీరపన్నగ రసం, రస సింధూరం.

9. కాలుష్యపూరిత వాతావరణ దుష్ఫలితం:

పట్టు పరిశ్రమలు, తోలు కర్మాగారాలు, బొగ్గు గనులు, ఆస్ బెస్తాస్ ఫ్యాక్టరీలు వంటి వాటిల్లో పనిచేసే వారు విషవాయువులను పీల్చుకునే అవకాశం ఎక్కువ, వీరిలో చాలామంది ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులతో బాధపడుతుంటారు. ఈ వ్యాధులన్నిటిలోనూ ఆయాసం అనేది ఒక ప్రధానమైన లక్షణం. ఆహారేతర పదార్థాలు అడ్డుపడటం వల్ల ఆయాసం వస్తున్నట్లయితే ప్రథమ చికిత్సతో సరిపోతుంది. అనారోగ్యకరమైన వాతావరణ పరిస్థితులు, ఆహితమైన విషవాయువుల వల్ల ఆయాసం వస్తుంటే వాటినుంచి దూరంగా ఉండటం అత్యుత్తమమైన పద్ధతి.