ఉదర వితానం (డయాఫ్రం):

 

1. పక్కకు తిరిగితే నొప్పి వస్తుందా?

దెబ్బలు / గాయాలు

2. దగ్గు, జ్వరాల్లాంటివి ఉన్నాయా?

ఊపిరితిత్తులలో నెమ్ముచేరటం (న్యూమోనియా / ఫ్లూరసి)

3. కత్తితో కోసినట్లు, పదునైన నొప్పి రావటంతో పాటు స్పృహతప్పి పడిపోయారా?

ఉదార అవయవాలు చిద్రమవటం

 

ఉదర వితానం అనేది చాతిని ఉదరం నుంచి వేరుపరుస్తూ అడ్డంగా ఏర్పడిన కండరపు పొర. బరువును ఎత్తేటప్పుడో, శరీరాన్ని అసహజంగా తిప్పాల్సి వచ్చినప్పుడో ఈ కండరంలోని తంతువులు చిట్లిపోయి నొప్పి జనించే అవకాశం ఉంది. అలాగే డయాఫ్రం కు క్రింద భాగంలోనూ, పై భాగంలోనూ ఉండే అనేక నిర్మాణాల వలన కూడా ఉదర ప్రదేశంలో నొప్పి వచ్చే అవకాశం ఉంది.

1. దెబ్బలు / గాయాలు:

పక్కకు తిరిగినప్పుడల్లా కడుపునొప్పి వస్తుంటే కండరపు నొప్పిని గురించి, ప్రక్కటేముకలకు దెబ్బ తగలడం వల్ల ఏర్పడే నొప్పిని గురించి ఆలోచించాలి. దెబ్బ తగిలిన తరువాత మూడు రోజుల తర్వాత ఇది స్పష్టంగా అనుభవం అవుతుంది.

ఔషధాలు: లక్షాదిగుగ్గులు,

బాహ్యాప్రయోగం - దశాంగలేపం.

2. ఊపిరితిత్తులలో నెమ్ముచేరటం (న్యుమోనియా / ఫ్లూరసి):

ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకినప్పుడుగాని, ఊపిరితిత్తుల పై నుండి పొర వ్యాధిగ్రస్త మైనప్పుడుగాని డయాఫ్రం కూడా వ్యాధిగ్రస్తమై నొప్పిని కలిగిస్తుంది. దగ్గినప్పుడూ, బలంగా శ్వాస పీలుస్తున్నప్పుడూ ఈ రకం నొప్పి ఎక్కువవుతుంటుంది. సూచనలు: అవసరమైతే ఆక్సిజన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం కూడా ముఖ్యం. పరిసరాలు కూడా వెచ్చగా, పొడిగా, సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే ఛాతి మీద వేడి బట్టతో కాపడం పెట్టుకోవాలి. శ్వాస మార్గంలో తెమడ గట్టిపడి దగ్గు, ఛాతినొప్పి వంటివి వస్తుంటాయి కనుక గోరువచ్చని నీళ్లు తాగితే తెమడ తెగి శ్వాసకు అడ్డు తొలుగుతుంది. ఏ వైపు ఊపిరితిత్తిలో నొప్పి ఉంటుందో అదే వైపు తిరిగి పడుకోవాలి, ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ రెండవ ఊపిరితిత్తికి వ్యాపించకుండా ఉంటుంది.

ఔషధాలు: బృహత్ కస్తూరి భైరవ రసం, లక్ష్మీవిలాసరసం (నారదీయ), త్రైలోక్య చింతామణి రసం, అభ్రక భస్మం, మకరధ్వజం, ముక్తాపిష్టి, త్రిభువనకీర్తిరసం, ఆనంద భైరవ రసం, సమీరపన్నగ రసం, హిమగర్భపోట్టలీ రసం, శ్వాసకాసచింతామణి, రససింధూరం, శృంగి భస్మం, కఫకేతురసం, యవక్షారం, అపామార్గక్షారం, తాళీసాదిచూర్ణం, ద్రాక్షారిష్టం, వ్యోషాదివటి, వాసావలేహ్యం.

3. ఉదరఅవయవాలు ఛిద్రమవటం:

గర్భాశయేతర గర్భం (ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ) ఏర్పడిన సందర్భంలోనూ ఇంకా పేగులు, అమాశయం తదితరాలు ఛిద్రమైనప్పుడూ వాటినుంచి స్రావాలు డయాఫ్రం కిందకు, గాలితోపాటుగా చేరి పదునైన నొప్పిని కలిగించే అవకాశం ఉంది. ఇటువంటి సందర్భాల్లో అన్ని కారణాలను పరీక్షించి తగిన చికిత్స చేయాల్సి ఉంటుంది. దీనికి వైద్యసహాయం తప్పనిసరి.

ఉదరంలో కుడివైపు కింది భాగం:

కడుపు నొప్పిని మనిషి శరీర నిర్మాణానుసారం విశ్లేషించి చూసేతప్ ముందస్తుగా ఈ ప్రాంతంలో ఉండే ఆంత్రపుచ్చాన్ని (ఎపెండిక్స్) పరిగణించాలి. అలాగే ఈ ప్రాంతంలో ప్రధానంగా పేగులు, కుడి మూత్రనాళం (యురేటర్) మొదలైనవి ఉంటాయి, మహిళల విషయానికి వస్తే, ఈభాగాలతో పాటు, కుడి అండకోశం (ఒవరీ), కుడివైపు బీజవాహిక (ఫాలోపియస్ ట్యూబ్) కూడా ఉంటాయి.