మన ప్రపంచంలో అన్ని రోజులకి ఏదో ఒక ప్రత్యేకత ఉంటూనే ఉంటుంది. అయితే అన్ని రోజులని మన సంతోషాన్ని వ్యక్తపరచటానికి కేటాయించుకుంటే ఈ రోజుని మాత్రం ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నవాళ్ళకి గుండెల నిండా ధైర్యం నింపి వాళ్ళు తొందరగా కోలుకునేలా వాళ్ళ కోసం మంచి కోరుకునే రోజు. అదే వరల్డ్ సిక్ డే.
మనింట్లో ఒకరికి ఆరోగ్యం కాస్త బాగోలేకపోతేనే మనం దేముడికి దణ్ణం పెట్టుకుని మొక్కుకుంటాం. వాళ్లకి తొందరగా నయమవ్వాలని. దేముడి ఆశీర్వాదం ఎలా ఉన్నా మనస్పూర్తిగా మనం వాళ్ళ ఆరోగ్యం కుదటపడాలానే ధృడ సంకల్పాన్ని చూసే ఆ రోగికి కొండంత ధైర్యం వచ్చి తొందరగా కోలుకుంటారు.
ప్రపంచంలో ప్రతి 20 మందిలో ఒకరు ఏదో ఒక వ్యాధితో బాధపుతున్నారని ఒక అంచనా. రోజురోజుకి పెరిగిపోతున్న వ్యాధుల్లో కొన్నిటికి చికిత్సా పద్దతులు ఉంటె మరికొన్నిటికి ఇంకా నివారణా మార్గాలే కనుక్కోలేకపోతున్నారు. ఎంతోమంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ తొందరగా కోలుకోవాలనే ఆశతో జీవితం గడుపుతూ ఉంటారు. రోగికి చికిత్స కన్నా ముఖ్యంగా కావాల్సింది గుండె నిబ్బరతే అంటున్నారు వైద్యులు. ఆ గుండె నిబ్బరతని అందించటానికే ఈ రోజుని వరల్డ్ సిక్ డే గా ప్రకటించారు. మనం వ్యక్తిగతంగా వెళ్లి రోగాలతో బాధపడేవారికి చేయూత ఇవ్వనక్కర్లెద్దు. ప్రపంచంలోని అందరు ఒక్కసారి ఆ రోగులకి తొందరగా నయమవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటే చాలు. అదే ఈ రోజు జరుపుకోవటంలో ఉన్న ప్రత్యేకత. ఎదుటి మనిషి కోసం మన వంతు సాయం మనం చెయ్యటంలో ఉండే తృప్తిని మనం కూడా ఆస్వాదిద్దాం. సర్వే జనా ఆరోగ్య ప్రాప్తిరస్తు.
--కళ్యాణి