అప్సరసలాంటి అమ్మాయి ఎదురయితే గుండె దడదడ లాడిన పర్వాలేదు గానీ, మాములుగా ఉన్నప్పుడు కూడా అలా  కొట్టుకుంటుంటే? ఇదేదో బాగా ఆలోచించాల్సిన విషయమే అని గుర్తుపెట్టుకోండి. 
 
గుండెని పదిలంగా చూసుకోవాలంటే కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు అసలు డాక్టర్ని కలవాల్సిన పనే ఉండదంటున్నారు ప్రకృతి వైధ్య నిపుణులు. మనం తీసుకునే ఆహారపు విషయంలో కొంతమేర జాగ్రత్త తీసుకుంటే చాలట. 

రోజువారి నడక, వ్యాయామం తో పాటు కింద చెప్పినవి కొన్ని పాటిస్తూ మన గుండెని ప్రేమగా చూసుకుందాం. 

 

*  ఆకుపచ్చని రంగులో వుండే ఆకు కూరలు, కూరగాయలులో విటమిన్‌ - బి కాంప్లెక్స్ , నియాసిన్‌ అధిక మోతాదులో వుంటాయి. ఇవి రక్తనాళాలు మూసుకుపోకుండా వుండేందుకు సహాయపడతాయి. ఇంకా ఇవి బెర్రీస్‌, పుల్లటి రుచిగల పండ్లలో కూడా ఎక్కువగా లభిస్తాయి.

 

* గింజ దాన్యాలలో సోయా చాలా ప్రత్యేకమైనది.త్వరగా జీర్ణము అవుతుంది. అందుకే దీన్ని అన్ని వయసుల వారు తీసుకోవచ్చు.శరీరానికి అవసరమైన అమినోయాసిడ్లు, లైసీన్లతోపాటు ఇసోఫ్లేవిన్స్ ని కలిగిఉంటుంది. ఇది గుండెకు బలాన్నిస్తుంది.

* ఆలివ్‌ ఆయిల్‌లో వుండే మోనో-శాటురేటెడ్స్‌ వల్ల శరీరంలో చెడు కొవ్వు తగ్గేందుకు ఉపయోగపడతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధిక మోతాదులో ఉంటాయి. ఇవి గుండె కవాటాలు సక్రమంగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి. గుండె సంబంధిత సమస్యలను కూడా ఇవి నివారిస్తాయి.

 

* ఈ మద్య కాలంలో గుండెజబ్బుల నివారణకు, కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచడానికి ఓట్స్ ని వాడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీటిల్లో ఉండే ప్రత్యేక పీచు పదార్థం బెటాగ్లూకాన్. ఇది పైత్య రస ఆమ్లాలతో కలిసి శరీరంలోని కొలెస్ట్రాల్ ని నియంత్రణలో ఉంచుతుంది.


* బాదాం పప్పు  గుండెకు మేలు చేస్తుంది. మన ఆహారనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బాదంలో ఉండే  ఒమెగా 3 ఆల్ఫా లినోలిక్ యాసిడ్  ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. కరోనరీ గుండెజబ్బులను నివారిస్తుంది.

గుమ్మడి కాయలలో బీటాకెరోటిన్‌ లు ఎక్కువగాఉంటాయి. ఇవి శరీరములో విటమిన్‌ ' ఎ ' గా మార్పుచెంది చాలా ప్రయోజనాలు కలిగిస్తాయి. గుండెజబ్బులు, క్యాన్సర్ కి కారణమయ్యే ఫ్రీరాడిలల్స్ ను ప్రారదోలడములో సహకరించి గుండెను కాపాడుతుంది. పొటాషియం ఎక్కువగా ఉన్నందున గుండెకు మేలు జరుగుతుంది .

ఇలా కొద్దిపాటి జాగ్రత్తలతో మన గుండెని పదిలంగా చూసుకుందాం.

- కళ్యాణి