వాతావరణం ఒక సీజన్ నుంచి మరో సీజన్ కు మారుతున్న సమయంలో మన శరీరం ఒక రకమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది. క్రమంగా వాతావరణానికి అలవాటు పడుతుంది. అయితే ఈ సమయంలోనే కొన్ని రకాల సీజనల్ వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం చలికాలం ప్రారంభ దశలో చాలా మంది జలుబు, దగ్గు, ఫ్లూ, న్యుమోనియా వంటి వ్యాధుల బారిన పడుతుంటారు. పెద్దవాళ్లు ఈ సమస్యల నుంచి సులభంగా కొలుకున్నప్పటికీ పిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఈమధ్య చైనాలో పెద్ద సంఖ్యలో పిల్లలు న్యుమోనియాతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇది సాధారణ సీజనల్ ఇన్ఫెక్షన్ అని అక్కడి వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదం ఎక్కడైనా ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఐదేళ్ల కంటే తక్కువ వయస్సున పిల్లల్లో న్యుమోనియా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. చలికి వాయు కాలుష్యం కూడా తోడవ్వడంతో పిల్లలు ఊపిరితిత్తుల సమస్యలను ఎదుర్కొంటారు.

అందుకే పిల్లల్లో న్యుమోనియా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం అందించాలి. దగ్గు, వేగంగా శ్వాసతీసుకోవడం, జ్వరం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. అలాగే న్యుమోనియాతో పోరాడే శక్తిని పొందేందుకు ఊపిరిత్తుల ఆరోగ్యం కోసం కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటంటే...

జలుబు:
సాధారణ జలుబు లక్షణాలే న్యుమోనియా లక్షణాలుగా ఉంటాయి. జలుబు క్రమంగా న్యుమోనియాకు దారితీసే ఛాన్స్ ఉంటుంది. అందుకే జలుబు చేసినప్పుడు, మరింత తీవ్రమైన న్యుమోనియాగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే చికిత్స తీసుకుని మందులు వాడాలి.

పరిశుభ్రత:
న్యుమోనియా అనేది బ్యాక్టీరియా, వైరస్ లు , శిలీంధ్రాలు వంటి అనేక రకాల సూక్ష్మజీవులతో వస్తుంది. సాధారణంగా న్యుమోనియా అంటువ్యాధి కాదు..కానీ వేగంగా వ్యాప్తిచెందుతే అంటువ్యాధిగానే గుర్తించాలి. అందుకే బయటకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించడం తప్పనిసరి. ఇంట్లోకి రాగానే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. వ్యాధి ప్రాబల్యం ఉన్న ప్రాంతాలకు వెళ్లినప్పుడు ముక్కు, నోరును ఎక్కువగా తాకకూడదు.

దగ్గు:
దగ్గు న్యుమోనియా సాధారణ లక్షణంగా చెబుతారు. బాధితులు దగ్గినప్పుడు రోగి నుంచి ఆరోగ్యకరమైన వ్యక్తికి వ్యాధి కారకాలు వ్యాపించే మార్గం ఇది. అందుకే దగ్గు వచ్చినప్పుడు నోటికి గుడ్డ అడ్డుగా పెట్టుకోవాలి. దీంతో ఇతరులకు వ్యాపించకుండా అడ్డుకోవచ్చు.

వ్యాక్సిన్:
న్యుమోనియాకు కారణమయ్యే సాధారణ బ్యాక్టీరియా, వైరస్ లను నిరోధించేందుకు వ్యాక్సిన్ తీసుకుంటే సమస్య ప్రభావం ఎక్కువగా ఉండదు. ఆసుపత్రిలో చేరేంత తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదాన్ని వ్యాక్సిన్ తగ్గించేస్తుంది. ఇమ్యునిటీ లేనివారు న్యుమోనియా వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది.

లైఫ్ స్టైల్:
సీజనల్ ఇన్ఫెక్షన్ తో పోరాడే శక్తి శరీరానికి ఉండాలంటే ఇమ్యునిటీ బలంగా ఉండాలి. దీనికి ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి. మంచి ఆహారం తీసుకోవాలి. వ్యాయాయం చేయాలి. విశ్రాంతి తీసుకోవాలి. స్మోకింగ్, డ్రింకింగ్ వంటి అలవాట్లను మానేయాలి.