ఎండుద్రాక్ష సాధారణంగా పాయసం, స్వీట్ల తయారీలో ఉపయోగిస్తారు. కొన్నిచోట్ల వంటకాలలోనూ, స్పైసీ స్నాక్స్ లో కూడా వీటిని జత చేస్తుంటారు. అయితే ఎండుద్రాక్షను నానబెట్టి తినమని అమ్మమ్మల మొదలు అమ్మలు కూడా చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా మహిళలు ఎండుద్రాక్ష నానబెట్టుకుని తినడం వల్ల చాలా ఆరోగ్యమని అంటారు. ఎండుద్రాక్షను నానబెట్టి ప్రతిరోజూ తింటే కలిగే అద్భుత ఫలితాలు ఇవే..
కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది..
రాత్రంతా నీటిలో నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం గుండెకు చాలా మంచిది. నానబెట్టన ఎండు ద్రాక్ష శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను ప్రోత్సహిస్తుంది . ఇది ధమనులలో ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిని తినడం వల్ల ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి ఇది స్ట్రోక్, గుండె జబ్బుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి..
యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ డ్యామేజీని తగ్గిస్తాయి. ఎండుద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని నీటిలో నానబెట్టి తినడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు త్వరగా విడుదలవుతాయి. యాంటీ-ఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి.
బరువు తగ్గించడంలో సహాయపడుతుంది..
ఎండు ద్రాక్ష బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎండుద్రాక్ష తినడం వల్ల చాలా శక్తి లభిస్తుంది, దీని వల్ల పదే పదే ఆకలి అనిపించదు. ఆహారం ఎక్కువగా తినాలనే కోరికలు కూడా తగ్గుతాయి. ఆహారం నియంత్రణ కారణంగా బరువు పెరిగే అవకాశాలు తగ్గుతాయి. తద్వారా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.
రక్తపోటును నిర్వహిస్తుంది..
ఎండుద్రాక్షలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది రక్త నాళాలు గట్టిపడకుండా నిరోధిస్తుంది. దీని కారణంగా రక్తపోటు ఎక్కువగా ఉండదు. ఒకవేళ రక్తపోటు ఎక్కవగా ఉంటే దాని ప్రభావం తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇందులో పొటాషియం కూడా ఉంటుంది, ఇది అధిక రక్తపోటును కూడా నివారిస్తుంది. కాబట్టి రాత్రంతా నీటిలో నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
జీర్ణక్రియకు ప్రయోజనకరం..
ఆహారం జీర్ణం కావడానికి, మలబద్ధకం నుండి ఉపశమనం పొందడానికి ఫైబర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎండుద్రాక్షలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల పేగు ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ప్రేగులలో ఆహారాన్ని తరలించడంలో సహాయపడుతుంది, ఇది ఉబ్బరం, మలబద్ధకాన్ని నివారిస్తుంది.
కాలేయానికి మంచిది..
బయోఫ్లావనాయిడ్స్ ఎండుద్రాక్షలో ఉంటాయి. ఇవి రక్తం, కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి . యాంటీ-ఆక్సిడెంట్లు కూడా ఎండుద్రాక్షలో పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కాలేయానికి మేలు చేస్తాయి. శరీరం నుండి విషాన్ని తొలగించడానికి ఆరోగ్యకరమైన కాలేయాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం. అందువల్ల ప్రతిరోజూ రాత్రిపూట ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టి తినడం కాలేయానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
*నిశ్శబ్ద.