వర్షాకాలంలో  దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. భారీ వర్షాలు, నీరు నిలిచిపోవడం, వరదలు, నీరు కలుషితమవడం వంటివి  దోమల సంతానోత్పత్తికి అత్యంత అనుకూలమైనవి, అందుకే డెంగ్యూ-మలేరియా,  చికున్‌గున్యా వంటి వ్యాధులు ప్రభలుతాయి. వీటి బాధితుల సంఖ్య వర్షాకాలంలో,  ఆ తర్వాత కొన్ని నెలల వరకు కూడా  నమోదవుతుంది.

డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా  జ్వరాలు చాలా ప్రమాదకరమైనవి. ఇవి ఓ దశ దాటితే ప్రణాలను చాలా సులువుగా లాగేసుకుంటాయి. ఈ వ్యాధుల కారణంగా ఏటా వందల మంది మరణిస్తున్నారు. అందుకే ఈ వ్యాధుల తీవ్రతను అర్థం చేసుకోవడం, వీటి నివారణ చర్యలపై శ్రద్ధ వహించడం అవసరం.

డెంగ్య, మలేరియా, చికున్‌గున్యా వీటి  మధ్య తేడాను ఎలా గుర్తించాలంటే..

డెంగ్యూ..

డెంగ్యూ అనేది డెంగ్యూ వైరస్ (DENV) వల్ల కలిగే వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వైరస్ సోకిన దోమలు పగటిపూట ఎక్కువగా కుడతాయి, అందుకే  వర్షాకాలంలో  ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించడం మంచిది. తేలికపాటి డెంగ్యూలో అధిక జ్వరం,  ఫ్లూ-వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. అయితే  డెంగ్యూ తీవ్రరూపం దాలిస్తే అది  హెమరేజిక్ జ్వరానికి దారితీస్తుంది, ఇది తీవ్రమైన రక్తస్రావం, రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవడం, షాక్ కు లోనవడం, తద్వారా  మరణానికి కూడా దారి తీస్తుంది. డెంగ్యూ జ్వరంలో బ్లడ్ ప్లేట్‌లెట్స్ చాలా వేగంగా తగ్గడం ప్రారంభిస్తాయి. డెంగ్యూ సోకిన వ్యక్తి దగ్గర ఉండటం వల్ల మీకు డెంగ్యూ జ్వరం రాదు. దీని నివారణకు దోమలు వృద్ధి చెందకుండా, కుట్టకుండా చర్యలు తీసుకోవాలి.

మలేరియా..

డెంగ్యూ మాదిరిగానే మలేరియా కూడా తీవ్రమైన వ్యాధి. మలేరియా అనేది పరాన్నజీవుల వల్ల వచ్చే వ్యాధి. ఈ పరాన్నజీవులు సోకిన దోమల కాటు ద్వారా మానవులకు వ్యాపిస్తాయి. మలేరియా ఉన్న వ్యక్తులు సాధారణంగా అధిక జ్వరం, చలి ని అనుభవిస్తారు. మలేరియా కూడా తీవ్రమైన పరిస్థితులకు కారణమవుతుంది. మలేరియా వల్ల ఊపిరితిత్తులలో ద్రవం పేరుకుపోయి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. కొన్ని సందర్భాల్లో, ఈ వ్యాధి  కిడ్నీకాలేయం ను  కూడా దెబ్బతీస్తుంది. మలేరియాను మందులతో నయం చేయవచ్చు.

చికున్‌గున్యా ..

చికున్‌గున్యా అనేది చికున్‌గున్యా వైరస్ (CHIKV) వల్ల దోమల ద్వారా సంక్రమించే వైరల్ వ్యాధి. ఈ వ్యాధి  మొదటి లక్షణాలు సాధారణంగా జ్వరం,  చర్మపు దద్దుర్లు రూపంలో కనిపిస్తాయి. ఇది కాకుండా, రోగులకు అకస్మాత్తుగా అధిక జ్వరం (సాధారణంగా 102°F పైన), కీళ్ల నొప్పులు, తలనొప్పి, వికారం,  వాంతులు కూడా ఉండవచ్చు. చికున్‌గున్యాకు నిర్దిష్ట యాంటీవైరల్ మందు లేదు, కాబట్టి చికిత్స లక్షణాలను తగ్గించడానికి,  సమస్యలను నివారించడానికి ప్రయత్నిస్తారు. దీని చికిత్సలో  రోగి పుష్కలంగా ద్రవాలు త్రాగుతూ  ,  విశ్రాంతి బాగా తీసుకోవాలి.

నివారణ ఎలాగంటే..

దోమల వల్ల వచ్చే వ్యాధులన్నింటిని అరికట్టాలంటే దోమ కాటును నివారించే పద్ధతులను అవలంబించడం ఉత్తమమైన మార్గమని వైద్యులు చెబుతున్నారు. పొడవాటి చేతుల బట్టలు ధరించాలి. రాత్రి పడుకునేటప్పుడు కిటికీలు, తలుపులు మూసి ఉంచి, దోమతెరలు వాడాలి. దోమల వికర్షక కాయిల్స్ అనేక విధాలుగా హానికరం అని కనుగొనబడింది, కాబట్టి వాటిని చాలా తక్కువగా వాడాలి. దోమల నివారణకు సహజ మార్గాలు ఫాలో అవ్వాలి.

                                                         *నిశ్శబ్ద.