శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోధక శక్తి చాలా అవసరం. చాలావరకు చలికాలంలో జబ్బులు, అంటువ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే అధికశాతం మంది రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి  కషాయాలు,  రోగనిరోధక శక్తి పెంచే ఆహారాలు, చ్యవనప్రాశ్ వంటి లేహ్యాలు వాడతారు. అయితే శరీరంలో రోగనిరోధక శక్తి  లోపిస్తే శరీరం కొన్ని లక్షణాలను వ్యక్తం చేస్తుంది. ఆ లక్షాలేవీ లేకుండా ఊరికే ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు, పానీయాలు అతిగా తీసుకోవడం కూడా సమస్యను తెచ్చిపెడుతుంది. శరీరం అసౌకర్యానికి గురవుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందనడానికి కనిపించే కొన్ని లక్షణాలేంటో తెలుసుకుంటే..

ఒత్తిడి, నిరాశ..

ఒత్తిడి, నిరాశ మనిషిలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్లే సంభవిస్తాయి. ఒత్తిడి శరీరంలో తెల్లరక్తకణాల పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఇవి శరీరానికి ఆర్మీ ఫోర్స్ లాంటివి.  ఇన్ఫెక్షన్లతో పోరాడి వాటిని విచ్చిన్నం చేసేది ఇవే. కాబట్టి ఒత్తిడి, నిరాశ అనేవి శరీరంలో తెల్లరక్తకణాలు తగ్గాయనడానికి సూచన,  తెల్లరక్తకణాలు లోపిస్తే రోగనిరోధక శక్తి లోపించింది అనడానికి సూచన.

జలుబు, దగ్గు..

చలికాలంలో రెండు నుండి మూడు సార్లు జలుబు, దగ్గు రావడం సహజమే. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ వ్యాధులతో పోరాడే ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడానికి 3 నుండి 4 రోజుల సమయం పడుతుంది. ఆ తరువాత శరీరం సమస్యల నుండి కోలుకోవడానికి 6 నుండి 8 రోజుల సమయం పడుతుంది. కానీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే ఎక్కువ రోజులు జలుబు, దగ్గు వేధిస్తాయి.

చెవి సమస్యలు..

చెవి సమస్యలు చాలామందిలో వాతావరణ మార్పుల వల్ల కలుగుతుంటాయి. సంవత్సరంలో నాలుగు సార్లకు మించి చెవి సమస్యలు వస్తున్నా, సంవత్సరంలో రెండు సార్లకు మించి న్యుమోనియా వస్తున్నా రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉన్నట్టు లెక్క. ఇలాంటి సమస్యలు వస్తే మాత్రం అస్సలు నిర్లక్ష్యంగా ఉేండకూడదు.

కడుపు సమస్యలు..

ప్రతి వ్యక్తి రోగనిరోధక శక్తి 70శాతం జీర్ణవ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. జీర్ణవ్యవస్థ వల్లే బాక్టీరియా, సూక్ష్మజీవుల ఇన్పెక్షన్ల  నుండి ప్రేగులను రక్షిస్తాయి. మలబద్దకం, అతిసారం వంటి సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నట్టైతే  రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని అర్థం.

గాయాలు..

శరీరంలో గాయాలు నయం కావడంలో ఇబ్బందులుంటే రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నట్టు అర్థం. చాలావరకు కాలిన, తెగిన, పడినప్పుడు తగిలిన గాయాల్లాంటివి  రోగనిరోధక శక్తి బాగుంటే అవే తొందరగా తగ్గిపోతాయి. కానీ రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే ఇవి తొందరగా మానవు. కొన్నిసార్లు అవి పుండ్లుగా మారి పెద్ద సమస్యలకు కూడా దారితీసే అవకాశం ఉండచ్చు. శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువ ఉందనడానికి ఇది కూడా కారణం.

                                      *నిశ్శబ్ద.