మలబద్ధకం అనేది చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య. ఈ సమస్య చాలా చిన్నదిగా అనిపించినప్పటికీ ఇది దీర్ఘకాలికంగా మారితే అది చాలా ఇబ్బంది పెడుతుంది. సరైన జీవనశైలి, నీరు తక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మలబద్ధకం సమస్య వస్తుంది. తినే ఆహారమే మలబద్ధకం సమస్యకు కారణం అవుతుంది. కొన్ని ఆహార పదార్థాలు దీర్ఘకాలిక మలబద్ధకాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. ప్రాసెస్ చేయబడిన ఆహారాలు మలబద్దకం రావడానికి గల కారణాలలో మొదటి స్థానంలో ఉన్నాయి. వీటిలో చక్కెరలు ఎక్కువగానూ, ఫైబర్ తక్కువగానూ ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను నాశనం చేస్తాయి. పేగు కదలికలు సాఫీగా జరగడానికి సహాయపడే ఫైబర్ లేకపోవడం వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది.
మలబద్దకానికి కారణమయ్యే ఆహారాలు..
పాల ఉత్పత్తులు..
పాలు, పాల ఉత్పత్తులు కాల్షియం, ఇతర పోషకాల గొప్ప మూలం. అయితే కొంతమంది లాక్టోస్ అసహనం కారణంగా మలబద్ధకంతో బాధపడవచ్చు. జున్ను, పాలు వంటి పాల ఉత్పత్తులు కొంతమందికి మలబద్ధకం కలిగిస్తాయి, దీనివల్ల అసౌకర్యం, మలం విసర్జించడంలో కష్టం ఏర్పడుతుంది.
అరటిపండు
ఆశ్చర్యకరంగా పోషక విలువలు సమృద్దిగా ఉంటాయని చెప్పుకునే అరటిపండు అధికంగా తీసుకుంటే మలబద్ధకాన్ని కలిగిస్తుంది. వీటిలో పొటాషియం, ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, అరటిపండ్లలో పెక్టిన్ ఉంటుంది. ఇది మలబద్ధకం కలిగించే ఒక రకమైన కరిగే ఫైబర్.
రెడ్ మీట్..
ఎర్ర మాంసంలో ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా ఉన్పప్పటికీ ఇది జీర్ణవ్యవస్థకు సవాలుగా ఉంటుంది. అధిక కొవ్వు, ఫైబర్ లేకపోవడం మలబద్ధకానికి ప్రధాన కారణం.
ఆల్కహాల్
అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది, ఇది మలబద్ధకానికి దారితీయవచ్చు. ఆల్కహాల్ అధిక వినియోగం శరీరం నీటిని నిలుపుకోవడాన్ని దెబ్బతీస్తుంది, దీని వలన మలం గట్టిపడుతుంది.
మలబద్ధకాన్ని నివారించడానికి ఏమి తినాలి?
తృణధాన్యాలు, బ్రౌన్ రైస్, క్వినోవా, ఓట్స్, వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. కాయధాన్యాలు, శనగలు, బీన్స్ వంటి చిక్కుళ్ళు చేర్చుకోవాలి. ఆపిల్, బెర్రీ, స్ట్రాబెర్రీ, నారింజ, బత్తాయి, రేగు వంటి ఉన్న పండ్లను ఎంచుకోవాలి. బ్రోకలీ, క్యారెట్లు, బచ్చలికూర, మొలకలు వంటి కూరగాయలను తీసుకోవడం పెంచాలి. నీరు బాగా తాగాలి.
*నిశ్శబ్ద.