మగవారి కంటే మహిళలకు ఒమేగా-3 ఎక్కువ అవసరం ఇందుకే..!

శరీరం ఆరోగ్యంగా ఉండటానికి చాలా రకాల పోషకాలు అవసరం అవుతాయి. విటమిన్లు, ఖనిజాలు,  ప్రోటీన్, ఫైబర్ తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా అవసరం.  వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా ప్రధానమైనవి. ఆరోగ్యకరమైన జీవనానికి ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అత్యవసరం. పురుషుల కంటే మహిళలకు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా అవసరమట. శరీరం ఎదగడానికి,  అనేక  శారీరక విధులకు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు చాలా అవసరం. పురుషుల కంటే మహిళలకు ఒమేగా-3లు ఎందుకు ఎక్కువగా అవసరమవుతాయి? దీని గురించి మహిళా వైద్యులు ఏం చెప్తున్నారు? వివరంగా తెలుసుకుంటే..

నెలసరి నొప్పి..

చాలా మంది మహిళలు నెలసరి సమయంలో కడుపు నొప్పితో సహా తీవ్రమైన బాధను అనుభవిస్తారు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఈ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు.

కీళ్ల సమస్య..

పురుషుల కంటే మహిళలకు కీళ్లవాతం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 40 ఏళ్ల తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది, ఇది శరీర రోగనిరోధక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. కీళ్ల నొప్పి , వాపును తగ్గించడంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ప్రయోజనకరంగా ఉంటాయి.

హార్మోన్ల నియంత్రణ..

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లను తీసుకోవడం గర్భాశయానికి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అందువల్ల, మహిళలు తమ ఆహారంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లను చేర్చుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లను తీసుకోవడం వల్ల శరీరంలో వాపు కూడా తగ్గుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు గర్భాశయంలో పిండం అభివృద్ధి చెందే సామర్థ్యాన్ని పెంచుతాయి.

శరీరంలో హార్మోన్లను నియంత్రించడం ద్వారా నెలసరి సమస్యలు,  హార్మోన్ల అసమతుల్యత వంటివి రాకుండా చేయడంలో కూడా ఒమేగా--3 ఫ్యాటీ యాసిడ్లు సహాయపడతాయి.

గుండె ఆరోగ్యం..

ఒమేగా 3 గుండె ఆరోగ్యానికి మంచిది. ఒమేగా 3 తీసుకోవడం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది , రక్తంలోని కొవ్వును తగ్గిస్తుంది, తద్వారా ధమనులలో అడ్డంకులు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఒమేగా-3 లభించే ఆహారాలు..

సాల్మన్ పిష్,ట్రౌట్, కాడ్ , రొయ్యలు,   ఆయిస్టర్స్ వంటి కొవ్వు చేపలలో ఒమేగా-3 యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి.

వాల్నట్,  చియా గింజలు,  అవిసె గింజలు, ఆకుప్చచ ఆకుకూరలలో కూడా ఒమేగా-3 ఉంటుంది.

                              *రూపశ్రీ.