శ్రావ‌ణ మాసం వ‌చ్చిందంటే చాలు నోములు, వ్రతాల‌తో ప్రతి ఇల్లూ క‌ళ‌క‌ళ‌లాడిపోతుంటుంది. వీటిని ఆచ‌రించ‌డం కుద‌ర‌నివారూ, ఆస‌క్తిలేనివారు కూడా ఎవ‌ర‌న్నా పేరంటానికి పిల‌స్తే వెళ్లి తాంబూలాన్ని అందుకుంటారు. ఆ పేరంటాల‌లో నాయ‌క‌త్వమంతా శ‌న‌గ‌ల‌దే! ఇక వ‌ర‌ల‌క్ష్మివ్రతంలో అమ్మవారికి శ‌న‌గ‌ప‌ప్పుతో చేసే పిండివంట‌ల‌ను నివేదిస్తారు. ఇన్ని ర‌కాల ధాన్యాలు ఉండ‌గా శ‌న‌గ‌ల‌కే ఎందుకంత ప్రాముఖ్యత అని త‌ర‌చి చూస్తే ఎన్నో విష‌యాలు స్ఫురిస్తాయి.


శ‌న‌గ‌ల‌ని పండించ‌డంలో వేల సంవ‌త్సరాలుగా మ‌న దేశానిదే తొలి స్థానం. సింధునాగ‌రిక‌త‌కు సంబంధించిన త‌వ్వకాల‌లో కూడా శ‌న‌గ‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. వేల సంవ‌త్సరాల‌కు పూర్వమే ఇత‌ర‌దేశాల‌కు శ‌న‌గ‌ల‌ను ఎగుమ‌తి చేసిన ఘ‌న‌త మ‌నది. కానీ వాటిని జీర్ణం చేసుకోవ‌డం అంత సుల‌భం కాదు. శ‌న‌గ‌ల‌ను అధికంగా తీసుకుంటే క‌డుపు ఉబ్బరంగా ఉండ‌టం అంద‌రికీ అనుభ‌వ‌మే. ఇక జీర్ణశక్తి స‌రిగా లేనివారు శ‌న‌గ‌పిండికి కూడా దూరంగా ఉంటారు. కందిప‌ప్పు, పెస‌ర‌పప్పులాగా శ‌న‌గ‌ప‌ప్పుతో కూడా ప‌ప్పుని వండుకోవ‌చ్చు కానీ, అజీర్ణానికి భ‌య‌ప‌డి మ‌నం సాహ‌సించం.


నిజానికి శ‌న‌గ‌ల‌లో ఉన్నన్ని పోష‌కాలు మ‌రే ఇత‌ర ధాన్యంలోనూ ఉండ‌వేమో! ఇందులో ఉండే విట‌మిన్లు, ఖ‌నిజాల చిట్టా చాలా పెద్దది. మెద‌డుని చురుగ్గా ఉంచే మాంస‌కృత్తులు, శ‌రీరానికి శ‌క్తినిచ్చే పిండిప‌దార్థాలు కూడా శ‌న‌గ‌ల‌లో పుష్కలంగా ఉంటాయి. అందుకే న‌వ‌గ్రహాల‌లో ఒకటైన బృహ‌స్పతిని శాంతింప‌చేసేందుకు, శ‌న‌గ‌ల‌ను దానం చేయాల‌ని చెబుతారు. జ్యోతిష‌రీత్యా మేథ‌స్సుకీ, విద్యకీ కార‌కుడైన బృహ‌స్పతికి త‌గిన పోష‌కాలు అందిచ‌గ‌లిగేది శ‌న‌గ‌లే క‌దా!

 

 

ప్రాచీన వైద్య విధానంలో కూడా శ‌న‌గ‌ల‌ది గొప్ప పాత్ర. చ‌క్కెర వ్యాధికీ, కిడ్నీలో రాళ్లకీ శ‌న‌గ‌లు మేలు చేస్తాయ‌ని ఇప్పటి ప‌రిశోధ‌న‌ల్లో కూడా తేలింది. శ‌న‌గ‌ల‌లో ఉండే పోష‌కాలు ప‌శువుల‌కి కూడా ఉప‌యోగ‌మే! శ‌న‌గ‌ల‌ని ఆహారంగా అందించిన‌ప్పుడు గేదెల‌లో పాల‌దిగుబ‌డి ఎక్కువ‌య్యింద‌ట‌. ఇన్ని ఉప‌యోగాలు ఉన్నా కూడా ఇత‌ర ప‌ప్పుధాన్యాల‌తో పోలిస్తే శ‌న‌గ‌లు చాలా చ‌వ‌క‌గానే దొరుకుతాయి. అందుక‌నే కొన్నాళ్ల క్రితం కందిప‌ప్పు ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగిపోయిన‌ప్పుడు సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే, కందిప‌ప్పు బ‌దులు శ‌న‌గ‌ప‌ప్పుని వంట‌లో వినియోగించుకోమ‌ని ప్రక‌ట‌న‌లు రూపొందించింది.


అతి త‌క్కువ ధ‌ర‌లో అత్యధిక పోష‌కాల‌ను అందించే శ‌న‌గ‌ల‌ను మ‌నం ఎలా ఉపేక్షించ‌గ‌లం. వంట‌ల్లోకి ఎలాగూ అంత‌గా వాడుకోం. కాబ‌ట్టి వాటిని నాన‌బెట్టి కానీ, నాన‌బెట్టిన‌వాటిని సాతాళించుకుని కానీ తింటే బోలెడు ఉప‌యోగం. విడిగా ఎలాగూ మ‌నం ఆ ప‌ని చేయం కాబ‌ట్టి శ్రావ‌ణ‌మాసంలోని పేరంటాల స‌మ‌యంలోనైనా శ‌న‌గ‌ల‌ని వినియోగిస్తుంటాం. శ్రావ‌ణ మాసంలో చ‌లి, వేడి స‌మంగా ఉంటాయి. అలాంటి వాతావ‌ర‌ణం కూడా శ‌న‌గ‌ప‌ప్పుని జీర్ణం చేసుకునేందుకు అనువుగా ఉంటుంది. అందుక‌నే శ‌న‌గ‌ప‌ప్పుతో చేసే పూర్ణంబూరెలు, కుడుములు వంటి ప‌దార్థాల‌ను కూడా అమ్మవారికి నైవేద్యంగా అందిస్తారు.


ఇలాంటి సూక్ష్మమైన ఆరోగ్యసూత్రాల‌ను వంద‌ల సంవ‌త్సరాలకు పూర్వమే సంప్రదాయాల‌తో మిళితం చేసిన మ‌న పూర్వీకుల మేథ అమోఘం క‌దా!!!

- నిర్జర‌.