సీజన్ ఏదైనా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.  అయితే సీజన్ కు తగ్గట్టు జీవనశైలి,  ఆహార వేళలు,  శారీరక చురుకుదనం మారుతూ ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో చాలామంది జీవనశైలి చాలా బద్దకంగా మారుతుంది.  దీని వల్ల బరువు పెరిగి గుండ్రాయిలా మారిపోతారని అంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు.  ఇంతకీ చలికాలంలో చాలామంది చేసే తప్పులేంటో తెలుసుకుంటే..


చలికాలంలో శారీరక శ్రమ తగ్గిపోతుంది.  ఉదయం ఎంత సేపైనా చలి తగ్గదు.. సాయంత్రం చాలా తొందరగా చలి వచ్చేస్తుంది.  ఈ కారణాల వల్ల ఇంటి పనులు,  ఉద్యోగం చేసుకోవడంతో రోజును గడిపేస్తుంటారు.  పైగా చలి కారణంగా తొందరగా తెల్లవారదు,  సాయంత్రం తొందరగా చీకటి పడుతుంది.  దీని వల్ల శరీరం బరువుగా అనిపిస్తుంది. ఇది కూడా బరువు పెరగడానికి దారితీస్తుంది.


చలికాలంలో చలి నుండి ఉపశమనం కోసం వేడివేడిగా పకోడాలు,  సమోసాలు, మిర్చి బజ్జీలు బేకరీ ఆహారాలు ఎడాపెడా తింటారు. వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి.  వీటిని ఎక్కువ తినడం వల్ల  బరువు పెరుగుతారు.

చలికాలంలో చలి కారణంగా తొందరగా నిద్ర లేవరు.  దీని వల్ల ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది.  ఎక్కువ సేపు నిద్రపోవడానికి కేటాయిస్తారు. దీని వల్ల బద్దకం పెరుగుతుంది. సాధారణ సమయంలో 7,8 గంటలు నిద్రపోతే చలికాలంలో 10 గంటల వరకు నిద్రపోయే వారు ఉంటారు. దీని వల్ల బరువు పెరుగుతారు.

చలి కారణంగా చల్లని వాతావరణంలో నీరు తాగడం మరచిపోతుంటారు. దీని వల్ల శరీరం డీహైడ్రేషన్ కు లోనవుతుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.


చలికాలంలో శరీరంలో హార్మోన్ల మార్పులు  ఏర్పడతాయి.  దీని కారణంగా జీవక్రియ మందగిస్తుంది. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది. అంతేకాదు.. చలికాలంలో సీజనల్ ఎఫెక్ట్ వల్ల ఎక్కువగా తినేస్తారు. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది.


                           *రూపశ్రీ.