శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి హిందూ స్త్రీ కాళ్లకు పసుపుతో, నుదుట కుంకుమతో కళకళలాడుతుంది. అమ్మవారికి పూజ చేయాలన్నా, ముత్తయిదువులకు వాయినాలు ఇవ్వాలన్నా, పేరంటాళ్లకు తాంబూలం అందించాలన్నా పసుపుకుంకుమలు తప్పనిసరి. కానీ మనం వాడుతున్న ఈ పసుపుకుంకుమలు ఎంతవరకూ సురక్షితం అంటే కాస్త ఆలోచించక తప్పదు! ఏదో లాంఛనం కోసమో, దగ్గరలో ఉన్న కొట్లో దొరుకుతోందనో చాలామంది ఏ కుంకుమని పడితే ఆ కుంకుమని వాడేస్తుంటారు. ఒంటికి రాసుకునేందుకు కూడా దాన్నే ఉపయోగిస్తుంటారు. కానీ ఇప్పటి కుంకుమ మరీ ముదురు ఎరుపు రంగులో ఉండటం, రోజుల తరబడి ఆ ఎరుపు ఒంటి మీదే ఉండిపోవటం మనం గమనిస్తూనే ఉంటాం. కుంకుమలో కలుపుతున్న కృత్రిమ పదార్థాలే దీనికి కారణం.
మన పెద్దలు కుంకుమని ఇళ్లలోనే చేసుకునేవారు. పసుపుకి సున్నాన్ని, పటికనీ కలపడం ద్వారా కుంకుమని తయారుచేసేవారు. ఉత్తరాంధ్ర వంటి కొన్ని ప్రాంతాల్లో ఎర్రటి రాళ్లను పొడి చేసి కుంకుమగా వాడుకునే సంప్రదాయం కూడా ఉంది. కానీ ఇప్పుడు బజార్లో దొరికే కుంకుమల్లో అధికభాగం లెడ్, మెర్క్యురీ వంటి హానికారక పదార్థాలను కలుపుతున్నారు. వీటిని ఒంటికి రాసుకున్నప్పుడు ఇందులోని 60 శాతం కెమికల్స్ మన చర్మం మీద ఉండే సూక్ష్మరక్తానాళాల ద్వారా మన శరీరంలోకి వెళ్తాయని తేలింది. వాటివల్ల చిన్నపాటి దురదలు మొదల్కొని నరాల బలహీనత వరకూ చాలా శారీరక ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉంది. మరీ మాట్లాడితే కేన్సర్‌కు దారితీయగల `కార్సినోజన్` అనే విభాగం కిందకి ఈ పదార్థాలను చేర్చవచ్చు. ఇక చిన్నపిల్లలు ఇలా తయారైన కుంకుమని తెలియక నోట్లో వేసుకుంటే అది విషంగా పరిణమించే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాలన్నీ తెలిసితెలిసీ చాలా సంస్థలు ఇష్టమొచ్చినట్లు కృత్రిమ రసాయనాలతో కుంకుమను తయారుచేస్తుంటాయి. తయారీ తేలికగా ఉంటుందనో, వినియోగదారులను ఆకర్షించేలా ఎర్రటి ఎరుపులో ఉంటుందనో, ఎక్కువకాలం నిలువ ఉంటుందనో... కారణం ఏదైనా కస్టమర్ల జీవితంతో ఆడుకుంటూ ఉంటాయి. వీటిని నియంత్రించాల్సిన ప్రభుత్వం కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తూ ఉంటుంది. కుంకుమ ప్యాకెట్ మీద దాని తయారీలోకి వాడిన పదార్థాల గురించి ముద్రించాలన్న విషయాన్ని కూడా ఈ సంస్థలు పట్టించుకోవు.
దురదృష్టం ఏమిటంటే కుంకుమనే కాదు మనవాళ్లు పసుపుని కూడా కల్తీ చేస్తుంటారు. పసుపు ఆ రంగులో ఉండటానికి కారణం `curcumin` అనే సహజమైన పదార్థం. కానీ పసుపుని చవగ్గా, ఆకర్షణీయంగా తయారుచేసేందుకు `మెటానిల్ ఎల్లో` అనే రసాయనాన్ని కలుపుతారు. మెటానిల్ ఎల్లో కలిసిన పసుపుని వంటలో వాడినప్పుడు అది మన లివర్‌ను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఇక శరీరం మీద దీన్ని రాసుకున్నప్పుడు లేనిపోని చర్మవ్యాధులన్నీ వస్తాయి.
ఇప్పుడు మార్కెట్‌లో దొరికే పసుపుకుంకుమలు ఎంతవరకూ సురక్షితమో చెప్పడం అంత తేలిక కాదు. పసుపుని కాస్త వేడినీటిలో వేసి, దానికి కొన్ని చుక్కల హైడ్రోక్లొరిక్ యాసిడ్ వేసినప్పుడు ఆ నీరు ముదురు రంగులోకి మారితే.... అందులో కల్తీ జరిగిందని చెప్పవచ్చు. కొన్ని సందర్భాలలో వాటి రంగును చూసి వాటిలో కృత్రిమ రంగులను కలిపి ఉంటారని పోల్చుకోవచ్చు. ఏదేమైనా శరీరానికీ, వంటల్లోకీ వాడుకోవాలనుకున్నప్పుడు కాస్త ఖరీదు ఎక్కువైనా నమ్మకమైన సంస్థలు రూపొందించేవాటినే కొనుక్కుంటే మంచిది. ఒకవేళ వాటిని శరీరానికి రాసుకున్నప్పుడు అక్కడ చర్మం ఏమాత్రం తేడా వచ్చినా వెంటనే ఆ ప్రాంతాన్ని శుభ్రపరచుకోవాలి. పసుపుకుంకుమలు రాసుకున్న కొన్నిరోజుల పాటు ఆ ప్రదేశంలో మంట కానీ దురద కానీ ఉండి తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఇక పసుపుకుంకుమలు కంట్లో పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే చిన్నపిల్లలకు వాటిని దూరంగా ఉంచాలి.
- నిర్జర.