
ఇళ్ళు, ఆఫీసులు మంచి వాసన రావడానికి తరచుగా రూమ్ ఫ్రెషనర్లు, పెర్ఫ్యూమ్‌లు, సువాసనగల ధూపం లేదా సువాసనగల కొవ్వొత్తులను ఉపయోగిస్తుంటారు. ఇది ఒక సాధారణ అలవాటులా అనిపిస్తుంది. కానీ ఈ "సువాసన" నెమ్మదిగా ఆరోగ్యానికి "సైలెంట్ కిల్లర్"గా మారుతుందని తెలుసా.. చాలామంది ఇలాంటి సువాసన వల్ల ఇల్లు వాతావరణం బాగుంటుందని, ప్రశాంతంగా ఉంటుందని అనుకుంటారు. కానీ ఈ రూమ్ ఫ్రెషనర్ల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే.. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
రూమ్ ఫ్రెషనర్ల తయారీలో ఉపయోగించే రసాయనాలు..
రూమ్ ఫ్రెషనర్లు, పెర్ఫ్యూమ్‌లు, సౌందర్య సాధనాలు, శుభ్రపరిచే ఉత్పత్తులు, సువాసనగల కొవ్వొత్తులు వంటి ఉత్పత్తులలో ఆరోగ్యానికి హానికరమైన వేలాది రసాయనాలు ఉంటాయి. వీటిలో ప్రధానంగా ద్రావకాలు, స్టెబిలైజర్లు, UV-అబ్జార్బర్‌లు, ప్రిజర్వేటివ్‌లు, రంగులు ఉంటాయి. ఇవి ఇండోర్ వాయు కాలుష్యానికి కారణం అవుతాయి.
ఈ రసాయనాలు ఎక్కువ కాలం పీల్చడం వల్ల అలెర్జీలు, శ్వాసకోశ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, క్యాన్సర్, న్యూరోటాక్సిసిటీ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
రూమ్ ఫ్రెషనర్లు ఎక్కువకాలం వాడితే కలిగే సమస్యలు..
రూమ్ ఫ్రెషనర్లలో ఉండే రసాయనాలు కళ్ళు, గొంతు, ఊపిరితిత్తులను కప్పే సున్నితమైన పొరలను చికాకుపరుస్తాయి. ఇది చికాకు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది.
ఎటువంటి కారణం లేకుండా తరచుగా మైగ్రేన్లు లేదా తలనొప్పుల సమస్య ఉంటే అది రూమ్ ఫ్రెషనర్ల వల్ల ఏర్పడే సమస్య కావచ్చని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా, ప్లగ్-ఇన్ ఎయిర్ ఫ్రెషనర్లు, ఫాబ్రిక్ సాఫ్ట్‌నర్లు, లాండ్రీ క్రిస్టల్స్, పెర్ఫ్యూమ్‌లు, కొలోన్‌లు వంటి ఉత్పత్తులు మెదడులో సున్నితమైన నరాల ప్రతిస్పందనలను ప్రేరేపిస్తాయి. తలనొప్పిని పెంచుతాయి.
చాలా మందికి రూమ్ ఫ్రెషనర్లు అంటే అలెర్జీ ఉంటుంది. రసాయనాల వాసన రియాక్షన్ కు తొందరగా గురయ్యేవారిలో దగ్గు, తుమ్ము, కళ్ళు దురద, వాయుమార్గాల వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి దీర్ఘకాలం కొనసాగితే ఉబ్బసం, శ్వాసకోశ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి.
థాలేట్లు, కొన్ని సింథటిక్ రసాయనాలు శరీరం హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేస్తాయి. ఇది సంతానోత్పత్తి, జీవక్రియను ప్రభావితం చేస్తుంది.
దీర్ఘకాలికంగా వీటికి గురికావడం వల్ల లైంగిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. పురుషులు, స్త్రీలలో సంతానోత్పత్తి ప్రమాదాలు పెరుగుతాయి.
ఆస్తమా లేదా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారిలో ఈ రూమ్ ఫ్రెషనర్లు ఊపిరితిత్తులను చికాకుపరుస్తాయి. దగ్గు, గురక లేదా శ్వాస ఆడకపోవడానికి కారణమవుతాయి. తక్కువ స్థాయిలో ఎక్స్‌పోజర్ కూడా పిల్లలు, పెద్దలలో ఆస్తమా ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు అంటున్నారు.
రూమ్ ఫ్రెషనర్ పదార్థాలలో ఉండే ఫార్మాల్డిహైడ్, కొన్ని అస్థిర సేంద్రియ సమ్మేళనాలు క్యాన్సర్ కలిగించే ప్రధాన సమ్మేళనాలుగా గుర్తించబడ్డాయి. ఈ సమ్మేళనాలను ఎక్కువ కాలం పీల్చడం వల్ల ఊపిరితిత్తులు, కాలేయం, చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
ఈ ఉత్పత్తులను ఎక్కువ కాలం పీల్చడం వల్ల గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, కాలేయ పనితీరు దెబ్బతినడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ రసాయనాలు శరీరంలోని హార్మోన్లు, జీవక్రియ వ్యవస్థలను కూడా ప్రభావితం చేస్తాయి.
*రూపశ్రీ.




