Face in the index of the Mind అన్నట్టుగా Eye is the mirror of the Brain అంటారు. మెదడు పనిచేసే తీరు తెన్నులు తెలుసుకోవడానికి కన్ను అనేక వివరాలు అందజేస్తుంది. కొన్ని అవయవాలు, అవిచేసే పనులు, వాటిలో వుత్పన్నమయ్యే లోపాలు, సమస్యలు పరోక్షంగ తెలుసుకోగలమే తప్ప తలుపుతీసి గదిలో ప్రవేశించి గదిలోని వస్తువులను పరిశీలించినట్లు చేయడానికి అవకాశం లేదు. అలాంటి వాటిలో మెదడు ఒకటి. మెదడుకు సంబంధించిన సమాచారము పరోక్షంగా ఇతర అవయవాలనుండి తెలుసుకోవడమేతప్ప మెదడు కోసి చూడలేము. మెదడు బలిష్టమైన ఎముకల గదిలో వుంటుంది. అందుచేత మెదడును పరీక్షించాలంటే సామాన్య పద్దతులలో వీలుపడదు.


మెదడు నుండి సరాసరి విడుదలయ్యే నాడులు 12 జతలు. ఈ 12 జతలు శరీరంలోని కన్ను, ముక్కు, చెవి, గొంతు, నాలుక, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ప్రేవులకు సంబందించి ఇవి వివిధ కర్తవ్యాలు నిర్వహిస్తుంటాయి. ఇందులో 6 జతల నాడులు కంటికి సరఫరా అవుతాయి. దృష్టి నాడి, దృష్టి క్షేత్రం వర్ణదృష్టి, కంటి చలనము, కన్నుమూసుకోవడం తెరుచుకోవడం, కంటి స్పర్శ, కంటినొప్పి మొదలైనవి, మెదడులోని కొన్ని కేంద్రాలనుండి కంటిలో వివిధ భాగాలతో ముడివేస్తాయి. వీటిలో వచ్చే మార్పులను బట్టి దెబ్బతిన్న భాగాన్ని అందుకు సంభంధించిన కారణాలను తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. 


మెదడుకు, కంటికీ రక్తం సరఫరా అవుతుంది. ఈ రెండూ ఒకేచోట పుట్టి చీలిక మెదడంతా వ్యాపిస్తుంది. మెదడులో నుండే కొన్ని కంటికి చేరతాయి. అందుచేత కంటిలోని రక్తనాళాల తీరుతెన్నులు, మెదడులోని రక్తనాళాలు ఒకేలా వుంటాయి. రక్తనాళాలు రక్తాన్ని సరిగ పంపిణీచేయగల స్థితిలో వున్నవా లేక నాళాలు సన్నబడి రక్త ప్రసరణకి ఆటంకం ఏర్పడుతుందా? రక్తనాళాలలో కొవ్వు పేరుకొందా? రక్తం గడ్డకట్టి ప్రవాహం అంతరాయం ఏర్పడిందా? కొత్త నాళాలు పుడుతున్నాయా? నాళాలనుండి రక్తం లీకవుతోందా? మొదలైన సమాచారం కంటిలోని రెటినాల్ నాళాలను పరిశీలించి తెలుసుకోవచ్చును.


మెదడులో కంతులు ఏర్పడితే కంతి యొక్క స్వరూపము, ఏ భాగములో ఏర్పడ్డదో తెలుసుకోవడానికి కంటి పరీక్షలు ఎనలేని అవకాశం కల్పిస్తుంది. కంటికి సరఫరా చేసే 6 నాడులలో ఒకటి గాని, అంతకంటే ఎక్కువగాని, పాక్షికంగ గాని, పూర్తిగా కాని దెబ్బతినడం కనిపెట్టవచ్చును. కొన్ని సమయాలలో దృష్టి క్షేత్రంలో మార్పులు ఏర్పడవచ్చును. మెల్ల ఏర్పడ వచ్చును. కంటినాడి వుబ్బవచ్చును. వీటిని తెలుసుకోవడం ద్వారా వ్యాధి లక్షణాలు, వ్యాధిస్థితి, చికిత్స యొక్క ఫలితము మొదలైన విషయాలను అంచనా కట్ట వచ్చును.


నాడి పొరలోనుండి బయలుదేరిన నాడులు, పోగులు పోగులుగ చేరి చివరకు కంటినుండి ఆప్టిక్ నాడి ద్వారా మెదడుకు చేరుతాయి. మెదడుకు బయలు దేరేముందు రెటీనాలో కనిపించే భాగాన్ని, నాడీ నాభి (ఆప్టిక్ డిస్క్) అంటారు. ఈ భాగాన్ని పరిశీలిస్తే, మెదడుకు సంబందించిన అతి ముఖ్యమైన సమాచారం తెలుస్తుంది. మెదడుకు వాపు వచ్చినప్పుడు, మెదడులో కంతి, చీము మొదలైనవి  చేరినపుడు ఆ వాపు దృష్టి నాడి ద్వారా నాడీ నాభి వరకు ఎగబాకుతుంది. కంటినాడి వుబ్బుతుంది. దానిని మనం ఆప్తాల్మాస్కోపు అనే పరికరం ద్వారా తెలుసుకోవచ్చును. అంతేకాదు, వ్యాధి యొక్క తీవ్రత, వ్యాది వైద్యానికి లొంగుతుందా లేదా అనేది కూడ తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల మెదడులో సంభవించే అనేక పరిణామాలను తెలుసుకోడానికి కంటి పరీక్షలమీద ఆధారపడవలసి వస్తుంది.


                                    ◆నిశ్శబ్ద.