ఆధునిక విజ్ఞానం, మనిషికి ఎంతో సుఖవంతమైన జీవితాన్ని ప్రసాదించింది. యంత్రాల హవా పెరిగిన తరువాత  శారీరక శ్రమ తగ్గి యంత్రాలతో పని చేయించడం ఎక్కువయ్యింది. దీనివల్ల మనం తినే ఆహారానికి, చేసే శ్రమకు మధ్య చాలా వ్యత్యాసం ఏర్పడింది. దానితో ఆహార పదార్థాల నిల్వలు అవసరాన్ని మించి, శరీరంలో పేరుకుపోతున్నాయి.

రక్తంలో వుండే, గ్లూకోజ్, మాంసకృత్తులు, కొవ్వులు, లవణాలు, హార్మోనులు నిర్ణీతమైన స్థాయిలోనే వుండాలి. ఆహారం ఎక్కువగా తీసుకున్నా, తక్కువగా తీసుకున్నా, వీటిస్థాయి మాత్రం నిలకడగా వుండేలా శరీరం జాగ్రత్త తీసుకుంటుంది.  అవసరాన్ని బట్టి ఆహారపదార్ధాలు వినియోగించబడతాయి. అవసరాలకు మించిన నిల్వలను దాచి పెట్టడం లేక విసర్జించడం జరుగుతుంది. ఈ విధంగా అదుపు చేయడానికి ఇన్సులిన్ అనే హార్మోను కృషి చేస్తుంది. రక్తంలో వుండే చక్కెర పదార్థాలు అదుపులేకుండ పేరుకోవడాన్ని మధుమేహం అంటారు. ఇది రక్తానికి సంబందించిన వ్యాధి కాబట్టి, శరీరంలో అన్ని అవయవాలకు వ్యాపిస్తుంది. మధుమేహం శరీరానికి ఇతర వ్యాధులు రావటానికి అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుంది. అంతేకాక దీని కారణంగా శరీరానికి  నెమ్మదిగా ఏర్పడే వ్యాదులు వేగంగా ఏర్పడతాయి.

దృష్టిలోపం తొందరగా మొదలౌతుంది.

మధుమేహం ఉన్నవారు కంటి అద్దాలు త్వరత్వరగా మార్చుకోవలసి వస్తుంది. రక్తంలో చక్కెర మార్పులను బట్టి, ఒకే అద్దాలు, వివిధ సమయాలలో, వేరువేరుగ కనినిస్తాయి.

కంటిలో శుక్లము:

మధుమేహము ప్రత్యేకంగా కంటిలో శుక్లం కలిగించడం అరుదు. అయినప్పటికి కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగిన మధుమేహం కంటిలో శుక్లానికి కారణం అవుతుంది. మధుమేహం ద్వారా ఏర్పడే శుక్లాన్ని మంచుపొడి (స్నోఫ్లేక్) శుక్లము అంటారు. ఇవి కటకపు సంచి సమీపంలో హెచ్చుగా ఏర్పడతాయి. రెండు కళ్ళలోనూ ఒకే రీతిగా వుంటాయి.

మంచి వైద్యసదుపాయాలు అందుబాటవ్వడంతో మధుమేహపు రోగుల జీవన ప్రమాణం పెరిగింది. ఇలా జరగడం వలన మరొకరకం సమస్య ఉత్పన్నమయ్యింది. రక్తప్రసరణంలో వచ్చిన మార్పులవలన "రెటినోపతి" అనే వ్యాధి అధికమయ్యింది. దీంట్లో నాడీకణాలు మరణిస్తాయి. నాడులలో కొవ్వు పేరుకుంటుంది. రక్త సరఫరా అధికం చేద్దామని కొత్త రక్త నాళాలు పుడుతుంటాయి, పుడితే ప్రమాదం లేదు కాని ఇందులో నుండి రక్తం లీకవుతుంటుంది. లీకయిన రక్తం యొక్క పరిమాణాన్ని బట్టి వివిధ పొరల్లో పేరుకొంటుంది. ఇలా పేరుకొన్న రక్తం, కాంతి కిరణాలకు ఆటంకంగా తయారయ్యి దృష్టి మాంద్యం ఏర్పడుతుంది.

శరీర భాగాలలో ఎక్కడైన రక్తం పేరుకొంటే, దాని పరిమాణం, దాని ప్రదేశము బట్టి ఫలితం వుంటుంది. కంటి సాసలో రక్తం చిమ్మితే, ఆరక్తం త్వరగా పీల్చుకోబడదు. కనీసం మూడునెలల పాటు అలాగే వుండిపోతుంది. చిమ్మిన రక్తం, కాంతి కిరణాలను రెటీనాపై కేంద్రీకరించకుండా అడ్డుకొని అంధత్వం కలిగిస్తుంది. నాడిపొరల్లో ఏర్పడ్డ కొత్త రక్త నాళాలు ఇందుకు కారణం. కొన్నాళ్లకు కరిగిపోయినా, మరలా మరలా అలా రక్తం చిమ్ముతూనే వుంటుంది. చివరకు అంధత్వంతో ఇది ఆగిపోతుంది.

 రెనల్ డిటాచ్మెంట్ : 

నాడి పొరలకే పరిమితమైన కొత్త రక్తనాళాలు పేరుకొన్న ఈ రక్తం వెంబడి కంటి సొనలోనికి ప్రవేశిస్తాయి. ఇవి ఎలాస్టిక్ ధర్మం కలిగి వుండటం వలన మధ్యలో పొరను లాగుతుంటుంది. నాడిపొర అసలే వదులుగ అతుక్కొని వుంటుంది కాబట్టి సులువుగా విడిపోతుంది. . దీనిని రెటినల్ డిటాచ్మెంట్ అంటారు.

మధుమేహం ఉంటే ఇలా ఇన్నిరకాల కంటి సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు ఎప్పటికప్పుడు కళ్ళు చెకప్ చేయించుకుంటూ ఉండాలి. లేకపోతే ఊహించని విధంగా దృష్టిలోపం సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. 

                                 ◆నిశ్శబ్ద.