ఉదయాన్నే కాఫీ గొంతులో పడకపోతే ఏమీ తోచదు చాలా మందికి. పని మొదలుపెట్టాలంటే కాపీ గొప్ప ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఒక అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రతిరోజూ 2.25 బిలియన్ కప్పుల కాఫీ తాగుతారు. కాఫీ తాగొద్దు ఆరోగ్యానికి మంచిదికాదు అని చాలామంది చెబుతూ ఉంటారు. అయినప్పటికీ కొన్ని అధ్యయనాలలో, సరైన మోతాదులో కాఫీని తీసుకోవడం వల్ల అనేక తీవ్రమైన వ్యాధులలో ప్రయోజనాలు లభిస్తాయని తెలిసింది. అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా కాఫీ ప్రయోజనకరంగా ఉంటుంది.
కాఫీ ప్రయోజనాలు, అది కలిగించే హాని గురించి అధ్యయనాలు మిశ్రమ ఫలితాలను కనుగొన్నాయి. సరైన మోతాదులో మరియు సరైన సమయంలో కాఫీ తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు. కాఫీ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, నష్టాల గురించి తెలుసుకుంటే..
కాఫీలో ఏముంటుంది?
కాఫీలో చాలా పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. రిబోఫ్లావిన్ (విటమిన్ బి2), నియాసిన్ (విటమిన్ బి3), మెగ్నీషియం, పొటాషియం, వివిధ ఫినోలిక్ సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్లు కాపీలో ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ పోషకాలు మన శరీరానికి ప్రయోజనం చేకూరుస్తాయి.
ప్రయోజనాలు ఏమిటంటే..
టైప్ 2 డయాబెటిస్ రిస్క్‌ను తగ్గిస్తుంది..
కాఫీ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. 2014 అధ్యయన నివేదిక ప్రకారం, 48,000 మందికి పైగా పరిశోధించబడ్డారు మరియు నాలుగు సంవత్సరాలలో రోజుకు కనీసం ఒక కప్పు కాఫీ తాగేవారిలో టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం 11 శాతం తక్కువగా ఉందని కనుగొన్నారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు వైద్యుల సలహా మేరకు మాత్రమే కాఫీ తీసుకోవాలి.
కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది..
కెఫిన్ జీవక్రియ రేటును 3-11 శాతం పెంచుతుందని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. అందుకే కాఫీని ఫ్యాట్ బర్నింగ్ సప్లిమెంట్‌గా పరిగణించవచ్చు. ఊబకాయం ఉన్నవారి కొవ్వును తగ్గించడంలో కెఫిన్ సహాయపడుతుంది.
కాలేయ క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉంటుంది..
ఒక అధ్యయనం ప్రకారం, కాఫీ తీసుకోవడం కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోజుకు రెండు నుండి మూడు కప్పుల కాఫీ తాగేవారిలో హెపాటోసెల్యులర్ కార్సినోమా, క్రానిక్ లివర్ డిసీజ్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని US అధ్యయనం నిర్ధారించింది.
కాఫీ రక్తపోటును నియంత్రిస్తుంది..
కాఫీలో ఉండే కెఫిన్ రక్తపోటుతో సహా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఒక అధ్యయనంలో, రోజుకు మూడు నుండి ఐదు కప్పుల కాఫీ తాగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని 15 శాతం వరకు తగ్గించవచ్చని పరిశోధకులు కనుగొన్నారు
నష్టాలేమిటంటే..
జీర్ణమవడంలో ప్రమాదం
కాఫీ వినియోగం కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. అదే సమయంలో, శరీరానికి హానికరమైన స్టోమా యాసిడ్ ఉత్పత్తికి కెఫిన్ కూడా కారణం కావచ్చు. దీని కారణంగా జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. కాఫీ ఎక్కువగా తీసుకోవడం లేదా కాఫీతో ఉదయం ప్రారంభించడం వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం, వికారం వంటి సమస్యలు వస్తాయి.
డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది..
ఉదయం కాఫీతో రోజు ప్రారంభించడం హానికరం. రాత్రిపూట చాలా సేపు కడుపు ఖాళీగా ఉంటుంది. నీటి కొరతను భర్తీ చేయడానికి ఉదయం నీరు త్రాగాలి. కానీ ఉదయాన్నే కాఫీ తాగితే శరీరంలో నీటి కొరత ఏర్పడి డీహైడ్రేషన్ సమస్య రావచ్చు. కాఫీలో ఉండే కెఫిన్ మూత్రవిసర్జనను పెంచుతుంది, ఇది డీహైడ్రేషన్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
వేసవిలో వద్దు..
కాఫీ వల్ల ఎన్ని లాభనష్టాలు ఉన్నా వేసవిలో మాత్రం దానికి దూరంగా ఉండటం మంచిది. కాఫీలో కెఫిన్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. ఈ వేసవిలో ఎంతో హైడ్రేట్ గా ఉండటం అవసరం. కాబట్టి వేసవిలో కాఫీని వీలైనవరకు అవాయిడ్ చేస్తే బెస్ట్.
◆నిశ్శబ్ద.