నేటి డిజిటల్ యుగంలో స్క్రీన్‌లు మన జీవితంలో అంతర్భాగంగా మారాయి. వర్క్ చేయడం నుండి సరదాగా సమయం గడపడం వరకు మొబైల్, సిస్టమ్, టీవీ, సినిమా హాల్ ఇలా ఎక్కడ చూసినా స్కీన్ కాస్తా ఫ్రంట్ ఆఫ్ ద హుమన్ గా మారింది.  దీన్ని దాటి, దీన్ని కాదని ఏ పని చేయలేని పరిస్థితి నెలకొంది. మంచి అయినా, చెడు అయినా ఇప్పుడు మొత్తం ఈ స్క్రీన్ నుండే అందుతోంది. అందుకే  గత ఇరవై, ముఫ్పై ఏళ్ళ కిందట లేని కంటి సమస్యలు అన్నీ ఇప్పుడు వస్తున్నాయి. సుమారు 10మందిలో 9మందికి అంతో ఇంతో దృష్టిలోపం సమస్య ఉంటోంది. నేటికాలంలో కలుషితమవుతున్న, రసాయనాల నిలయమైన ఆహారం, నీరు, గాలి, పరిసరాలు కూడా ఇందుకు కారణం. దీనికి తోడు జీవనశైలి మరీ దారుణంగా ఉంటుంది కొందరికి. రాత్రెప్పుడో మూడు, నాలుగు గంటలవరకు మొబైల్, సిస్టమ్ లో గడిపి, ఆ తరువాత నిద్రపోతారు. ఉదయం ఎప్పుడో 9 గంటలకు లేస్తారు. ఆ సమయంలో అదరాబదరా తయారయ్యి ఆఫీసులకు,కాలేజీలకు పరిగెడతారు. ఉదయం అల్పాహారం ఈ కారణంగానే చాలామందికి స్కిప్ అవుతుంది. ఆకలేస్తే పాస్ట్ ఫుడ్ సెంటర్ల మీద పడి అడ్డమైన గడ్డి తింటారు. ఈ అన్ని కారణాల వల్లా కొన్ని కామన్ సమస్యలు ఏర్పడుతున్నాయి చాలామందిలో. వీటిలో పైన ప్రస్తావించిన దృష్టిలోపం సమస్య ప్రధానమైనది.  మన కళ్ల ఆరోగ్యం ప్రమాదంలో ఉంది. నిజానికి, పిల్లలు  పెద్దలు ఇద్దరూ ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లతో ఎక్కువ సమయం గడుపడం వల్లే దృష్టిలోపం సమస్య ఏర్పడుతోందనేది వాస్తవం. ఇది చిన్న వయస్సులోనే కంటి సమస్యలకు దారితీస్తుంది. మధుమేహం, థైరాయిడ్ వంటి వ్యాధులు డయాబెటిక్ రెటినోపతి, మాక్యులర్ ఎడెమా, కంటిశుక్లం  గ్లాకోమా వంటి దృష్టి సమస్యలకు ఈ అలవాటు దారితీయవచ్చు. ఇలాంటి పరిస్థితులలో  కంటి చూపును పెంచే కొన్ని టిప్స్ ఫాలో అయ్యి దృష్టిలోపాన్ని సరిదిద్దుకోవడం మంచిది. దృష్టి సామర్థ్యం పెరగడానికి సింపుల్ గా అందరూ చేయగలిగే మూడు టిప్స్ ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా చేస్తే కేవలం నెలరోజుల్లోపు దృష్టిసామర్థ్యం ఎంతో పెరుగుతుంది.  ఆ టిప్స్ ఏంటో  తెలుసుకుంటే..
 
అరచేతులతో అద్బుతం..

ఉదయం లేవగానే అరచేతులు రుద్దుకుని కళ్ళకు అద్దుకోవడం చాలామంది చేస్తారు. నిజానికి ఇది దృష్టి సామర్యాన్ని పెంచుతుంది. అరచేతులలో నరాలు, కళ్ల చుట్టూ ఉన్న నరాలకు మధ్య జరిగే సున్నితమైన స్పర్శ  కంటి నరాలను ఉత్తేజం చేస్తుంది.  అరచేతులు వెచ్చగా మారే వరకు  గట్టిగా రుద్దాలి.తరువాత వీటిని  మూసిన కనురెప్పలపై సున్నితంగా  ఉంచాలి. ఈ సందర్భంలో ఎలాంటి ఒత్తిడి ఉపయోగించకూడదు.  చేతుల వెచ్చదనం  కళ్లలోకి ప్రసారమవుతుంది. ఇది కండరాలకు విశ్రాంతినిస్తుంది. నరాలనుకు శక్తిని ఇస్తుంది.

రెప్పలు చేసేమాయ..

కనురెప్పలు వాల్చకుండా తదేకంగా సిస్టమ్ లేదా మొబైల్ వైపు చూడటం వల్ల కళ్లు చాలా తొందరగా అలసిపోతాయి. కనురెప్పలు ఆర్పడమనే వ్యాయామం ఇందుకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ వ్యాయామం సులభంగానూ, ప్రభావవంతంగా ఉంటుంది. దీన్ని ఆచరించాలంటే హాయిగా కళ్లు తెరిచి కూర్చోవాలి. దాదాపు 10 సార్లు వేగంగా రెప్పవేసి, ఆపై 20 సెకన్ల పాటు విశ్రాంతి తీసుకుంటూ మీ శ్వాసపై దృష్టి సారిస్తూ కళ్లు మూసుకోవాలి. దీన్ని సుమారు 5 సార్లు రిపీట్ చేయండి. ఆరుతూ, వెలుగుతూ ఉండే విద్యుత్ దీపాలు చూడటం, వెలుగుతున్న దీపాన్ని తదేకంగా చూడటం వంటి వ్యాయామాలు  కళ్లను లూబ్రికేట్ చేయడంలో సహాయపడతాయి.  ఎక్కువ సేపు స్క్రీన్‌లను చూస్తూ ఉండటం వల్ల కలిగే ఒత్తిడిని తగ్గిస్తాయి.

కంటి భ్రమణం..

 తలను కదల్చకుండా కళ్ళను సవ్యదిశలో కదిలించి, ఆపై ప్రతి దిశలో 5-10 నిమిషాలు అపసవ్య దిశలో ఉంచాలి. సింపుల్ గా చెప్పాలంటే కళ్ళను క్లాక్ వైజ్ లో తిప్పాలి, ఆ తరువాత అపసవ్య దిశలో ఇదే విధంగా చేయాలి. ఇలా  కళ్లను తిప్పడం వల్ల కళ్ల కండరాల దృఢంగా మారతాయి.  రక్త ప్రసరణ పెరుగుతుంది, ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది.

                                                                    *నిశ్శబ్ద.