మెదడు కూడా మన శరీరవ్యవస్థలో ఒక భాగమే! దానికీ తగినంత నీరు కావాలి. దానికీ సరిపడా పోషకపదార్థాలు చేరుతుండాలి. అందుకే మనం తీసుకునే ఆహారపు ప్రభావం ఎంతోకొంత మన మెదడు పనితీరు మీరు ఉంటుంది. అంతేకాదు! శరీరంలోని మిగతాభాగాల ఆరోగ్యం కూడా ఒకోసారి మెదడు మీద కనిపిస్తుంది. అందుకే... ఎలాంటి ఆహారం తీసుకుంటే మన మెదడుకి మంచిదో సూచిస్తున్నారు నిపుణులు. వాటిలో కొన్ని ఇవిగో...

 

చాక్లెట్లు

చాక్లెట్లు తింటే రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చేమాట నిజమే! కానీ డార్క్‌ చాక్లెట్లను మితంగా తినడం వల్ల మన గుండెకు, రక్తపోటుకీ మంచిదంటూ ఎన్నో పరిశోధనలు రుజువుచేస్తున్నాయి. తద్వారా మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుందంటున్నారు. డార్క్‌ చాక్లెట్లలో ఉండే ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్ల వల్ల కీడుకంటే మేలే ఎక్కువ. కాకపోతే చాక్లెట్‌ నల్లటిదై ఉండాలి (డార్క్‌), మోతాదు మించకుండా తినాలి.

 

ఆకుకూరలు

పచ్చగా ఉండే ఆకుకూరలు తింటే ఆ ప్రభావమే వేరంటున్నారు వైద్యులు. ముఖ్యంగా పాలకూర, బచ్చలికూర, బ్రకోలి వంటి ఆకుకూరల వల్ల జ్ఞాపకశక్తి చెక్కుచెదరకుండా ఉంటుందట. వీటిలో ఉండే సి,బి, కె, ఇ వంటి విటమిన్లు.... ఐరన్‌, మెగ్నీషియం వంటి ఖనిజాలు మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడతాయి. ఆకుకూరలను తరచూ తిన్నవారి జ్ఞాపకశక్తి అమోఘంగా ఉండటమే కాదు... వారి మెదడులో నిక్షిప్తమై ఉన్న విషయాలు సుదీర్ఘకాలం పాటు చెక్కుచెదరవని అనేక పరిశోధనలలో రుజువైంది.

 

చేపలు

మాంసాహారం గురించి భిన్నాభిప్రాయాలు ఉండవచ్చుగాక. కానీ వాటిలో చేపల గురించి మాత్రం కాస్త మంచి మాటలే వినిపిస్తుంటాయి. ముఖ్యంగా సాల్మన్, ట్యూనా వంటి చేపలలో ఉండే ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్‌ వల్ల గుండె పదిలంగా ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. ఈ ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటుగా Docosahexaenoic acid (DHA) అనే రసాయనం వల్ల మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుందట. పిల్లల్లో కనిపించే ADHD వంటి మానసికమైన లోపాలలో సైతం చేపలు తమదైన ప్రభావం చూపుతాయట.

 

పప్పులు

బాదంపప్పులు తింటే మెదడు చురుగ్గా ఉంటుందని తరతరాల నుంచీ వింటూనే ఉన్నాము. ఇక ఈ మధ్యకాలంలో బాదంతో పాటుగా ఆక్రోటుని కూడా తినమని ప్రోత్సహిస్తున్నారు. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లతో పాటుగా సమృద్ధిగా లభించే విటమిన్‌ ఇ వల్ల మెదడులోని న్యూరాన్లు ఆరోగ్యంగా ఉంటాయట. పైగా వయసుతో పాటుగా వచ్చే మతిమరపు వంటి సమస్యలు కూడా దరిచేరవని ఘంటాపథంగా చెబుతున్నారు.

 

టమాటాలు

మెదడుకి మేత కోసం రూపొందిన జాబితాలో టమాటాలు కూడా ఉండటం ఆశ్చర్యమే! టమాటాలలో ఉండే ‘లైసోపిన్’ అనే రసాయనం మెదడులోని కణాలు దెబ్బతినకుండా చూస్తుందట. దానివలన మెదడు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, అల్జీమర్స్ వంటి వ్యాధులు సైతం దాడి చేసేందుకు వెనకాడతాయట. ఇవే కాకుండా పసుపు, తృణధాన్యాలు, కొబ్బరినూనె, నెయ్యి, బీన్స్‌, అవ్‌కాడో, పొద్దుతిరుగుడు గింజలు వంటి పదార్థాలు కూడా మెదడు సామర్థ్యాన్ని పెంచడంలోనూ, ఆరోగ్యవంతంగా ఉంచడంలోనూ సాయపడతాయని సూచిస్తున్నారు.

 

- నిర్జర.