వినడానికి బాధగా ఉన్నా ఈ విషయాన్ని నమ్మక తప్పదంటున్నారు పరిశోధకులు. పాలసీసాలని ఉత్పత్తి చేసేందుకు వాడే ప్లాస్టిక్‌లో Bisphenol S (BPS) అనే పదార్థం మన శరీరంలోకి చేరిపోతోందనీ... అది మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందనీ హెచ్చరిస్తున్నారు.

 

ఇంతకు ముందు BPA

ఒకప్పుడు ప్లాస్టిక్‌ వస్తువులలో Bisphenol A (BPA) అనే పదార్థం ఉండేది. అయితే ఇది మన శరీరంలోకి చేరి నానా సమస్యలనూ సృష్టిస్తోందని అనేక పరిశోధనలు రుజువుచేశాయి. ఆస్తమా, సంతానేమి, బ్రెస్ట్‌ కేన్సర్‌, డయాబెటిస్ వంటి అనేక రోగాలకూ BPA వాడకం దారితీస్తోందని పరిశోధకులు గగ్గోల పెట్టేశారు. పైగా పర్యావరణం మీద కూడా ఈ BPA తీవ్ర ప్రభావం చూపుతుందని తేలింది. ఇలాంటి పరిశోధనలతో బెంబేలెత్తిపోయిన వినియోగదారులను శాంతింపచేసేందుకు ఉత్పత్తిదారులు, BPAకు బదులుగా మరో రసాయనంతో ప్లాస్టిక్‌ ఉత్పత్తిని సాగించే ప్రయత్నం చేశారు. అదే BPS!

 

ఎక్కడ చూస్తే అక్కడే!

చాలా ప్లాస్టిక్‌ వస్తువుల మీద ఇప్పుడు BPA free అని కనిపిస్తుంది. అంటే వాటిలో BPA బదులు BPSని వాడి ఉండే అవకాశం ఉందన్నమాట. ముఖ్యంగా పాలసీసాలను ఉత్పత్తి చేసేందుకు ఈ రసాయనాన్ని వాడుతున్నారట. పైగా మనం తీసుకునే రసీదులు, టికెట్లు వంటి కాగితాలు కూడా ఈ BPSతోనే రూపొందుతున్నాయి. ఇప్పుడు ఈ BPS ప్రభావం మీద కూడా పరిశోధనలు మొదలయ్యాయి. ఇది కూడా ఏమంత సురక్షితం కాదని వాటి ఫలితాలు తేల్చిచెబుతున్నాయి. అంటే మనం BPA free అనగానే ఎగిరిగంతేసి తీసుకునే వస్తువులు కూడా, ఏమంత క్షేమం కాదన్నమాట!

 

ఎండోక్రైన్ – ఈస్ట్రోజన్‌

BPS మన శరీరంలోని ఎండోక్రైన్‌ అనే హార్మోను మీద ప్రతికూల ప్రభావం చూపుతుందని ఇంతకుముందే తేలింది. కరెన్సీ నోట్లు, ఏటీఎం రశీదులు పట్టుకుని తిరిగినప్పుడు వాటిలోని BPS మన శరీరంలోకి చేరిపోతోందని కనిపెట్టారు. మన మూత్రంలో సైతం BPS ఆనవాళ్లు కనిపిస్తున్నాయంటే ఇది మనలోకి ఎంతగా చొచ్చుకుపోయిందో తెలుస్తోంది. తాజాగా అమెరికాకు చెందిన కొందరు పరిశోధకులు స్త్రీలలో ప్రముఖంగా కనిపించే ‘ఈస్ట్రోజన్‌’ హార్మోను మీద కూడా BPS ప్రభావం చూపుతుందని తేల్చిపారేశారు.

 

తల్లి మనసు మారిపోయింది

ప్రయోగంలో భాగంగా పరిశోధకులు కొన్ని ఎలుకల శరీరంలోకి BPS రసాయనాన్ని ఎక్కించి చూశారు. ఫలితంగా ఆ ఎలుకల తీరే మారిపోయిందట. పిల్లల పెంపకంలో తల్లిని అప్రమత్తంగా ఉంచే ఈస్ట్రోజన్‌ అనే హార్మోను మీద BPS ప్రతికూల ప్రభావం చూపినట్లు తేలింది. వాటికి ఆహారాన్ని అందించడం, గూడుని సమకూర్చడం, ఏ ప్రమాదం బారినా పడకుండా గమనించుకోవడం... వంటి చర్యలలో స్పష్టమైన మార్పు కనిపించిందట. అంతేకాదు! తమ పిల్లలకి తామే హాని చేసుకునే స్వభావం కూడా వాటిలో బయటపడింది. ఇదంతా ఒక ఎత్తయితే, BPS వలన తల్లిలోనే కాకుండా ఆమె కడుపులో ఉన్న పిల్లల మనస్తత్వంలో కూడా మార్పులు కనిపించడం పరిశోధకులను ఆశ్చర్యానికి గురి చేసింది.

 

ఏమిటి పరిష్కారం!

ప్లాస్టిక్‌ అంటేనే ఓ మహమ్మారి! BPA కాకపోతే BPS, BPS కాకపోతే మరొకటి... ఇలా ఏదో ఒక రసాయనంతో ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేయడం. ఆనక అది కూడా పనికిమాలిందని నెత్తీనోరూ బాదుకోవడం తప్పడం లేదు. అందుకని వైద్యులు సరేనంటే కనుక గాజుసీసాలలోనో, స్టీలు పాత్రలతోనో పిల్లలకి పాలు పట్టించమని సూచిస్తున్నారు. ఇంట్లో వాడే వస్తువులు కూడా వీలైనంత వరకూ సహజసిద్ధమైన పదార్థాలతో రూపొందింనవే వాడమంటున్నారు.

 

- నిర్జర.