ఆహారాన్ని రెండు రకాలుగా విభజించవచ్చు. 

 

1. శాకాహారము


2. మాంసాహారము. 


ఈ రెండింటిలో ఏది ఉత్తమ ఆహరం అంటే శాఖాహారమే.. మాంసాహారము మాత్రమే నిత్యమూ తీసుకునే వారు చాలా తక్కువ. మిశ్రమ ఆహారం తీసుకునే వారినే మాంసాహారులుగా అనటం జరుగుతుంది. అయితే మాంసాహారం తినడం వల్ల ఎటువంటి నష్టము జరుగదు. కానీ మాంసాహారంవల్ల కలిగే ఉపయోగములను, శాకాహారము తీసుకోవడం ద్వారా కూడా పొందవచ్చును. కాని శాకాహార ద్వారా పొందే లాభాలను, మాంసాహారం ద్వారా పొందలేము. ఇదే అందరూ తెలుసుకోవలసిన విషయం.


ఆహారమనేది ఆరోగ్యంగా జీవించటానికి తీసుకుంటాము. కాబట్టి మనకు ఆరోగ్యప్రదమైన దానినే ఉత్తమ ఆహారంగా నిర్ణయించుకోవాలి.


మాంసాహారము కొలెస్ట్రాల్ ఎక్కువగా కలిగి ఉంటుంది. జంతు సంబంధమైన ఆహారంవల్ల వాటి యొక్క వ్యాధులు మనకు సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మాంసాహారం శాకాహారంలాగా సులువుగా జీర్ణంకాదు. జీర్ణక్రియకు తోడ్పడే పీచు, నారవంటి పదార్థములు ఇందులో లభించవు.


శాకాహారంవల్ల మాంసాహారములో వుండే పోషక విలువలు పొందవచ్చు. వేరుశనగ, బఠాణి, చిక్కుళ్ళు, పప్పుధాన్యాలు మొదలగు వాటిలో మాంసకృత్తులు సమృద్ధిగా లభిస్తాయి. మాంసకృత్తులు కణనిర్మాణానికి తోడ్పడతాయి. జీవక్రియలో కలిగే ప్రతిచర్యలను క్రమపరచడానికి పనికివస్తాయి. కొంతవరకు శక్తిజనకాలుగా పనిచేస్తాయి. ఇకపోతే దేహానికి కావలసిన సంపూర్ణశక్తిని పిండిపదార్థాల ద్వారా పొందవచ్చు. బియ్యం, బంగాళదుంపలు, జొన్నలు, కాయధాన్యములు ద్వారా పిండిపదార్థములు కొంతవరకు మాంసకృత్తులు లభిస్తాయి.


మాంసం, చేపలు, కోడిగ్రుడ్లు, పాలు ద్వారా లభించేవి సంపూర్ణ మాంసకృత్తులు, బియ్యం, జొన్నలు, కాయధాన్యాలు, చిక్కుళ్ళు మొదలగు వాటిద్వారా లభించేవి అసంపూర్ణ మాంసకృత్తులు, అయితే శాకాహారములో లోపించిన పోషకములను మరొక పదార్థముద్వారా పూరించుకోవచ్చు. అన్నంతోపాటు చిక్కుళ్ళు కలిపి తీసుకుంటే మాంసం, చేప, కోడిగ్రుడ్లులలో లభించినంత మాంసకృత్తులు లభిస్తాయి. మాంసకృత్తులతోపాటు, ఇతర పోషకములు కూడా లభిస్తాయి. కాబట్టి సమతులాహారంగా పనిచేస్తుంది. కాబట్టి మాంసాహారంలో లభించే మాంసకృత్తులకన్నా శాకాహారంలో లభించే మాంసకృత్తులే ఆరోగ్య కరమైనవి.


నిత్యజీవితంలో మనిషికి అవసరమయ్యే మాంసకృత్తులు ఎంతంటే మనిషి కిలో బరువుకు 8గ్రాముల మాంసకృత్తులు అవసరం.  అంతకు కొంత తగ్గినా నష్టం ఏమిలేదు. ఎదిగే పిల్లలకు, గర్భిణీస్త్రీలకు మాత్రమే కొంచెం అధికంగా కావలసి వుంటుంది. మాంసకృత్తులు అధికంగా తీసుకోవటం శరీరానికి మంచిదికాదు. మాంసాహారం తీసుకునేవారి మూత్రపిండాలు శాకాహారం తీసుకునేవారికన్నా 1.5 రెట్లు పెద్దవిగా ఉంటాయట. మాంసాహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి కాలేయం మరింత కష్టపడి పనిచేయవలసి రావటంవల్ల పెద్దవిగా తయారవుతున్నట్లు భావిస్తున్నారు. శాకాహారం లో లభించే మాంసకృత్తుల వలన ఏ రకమైన ఇబ్బంది లేదు.


మాంసకృత్తులు అధికంగా తీసుకున్నందువల్ల శరీరం ఉపయోగించుకోగా మిగిలిన మాంస కృత్తులు, క్రొవ్వుగా పేరుకుపోయి నిలవచేయబడతాయి. మాంసకృత్తులు అధికంగా వుండటంవలన జీర్ణక్రియలో అధిక శ్రమ ఏర్పడుతుంది. అందువల్ల ఎముకలలో గల కాల్షియంను ఈ జీర్ణక్రియ గ్రహించి, మూత్రంద్వారా విసర్జిస్తుంది. దానివలన మాంసకృత్తులు ఎక్కువగా తీసుకునే వారి ఎముకల్లో కాల్షియం లోపించి, ఎముకలు బలహీనమవుతాయి.


మాంసాహారము తీసుకునే వారిలోకన్నా శాకాహారం తీసుకునే  వారిలోనే శక్తి అధికంగా ఉంటుంది. మాంసాహారులు కొంచెం శ్రమచేయగానే అలసటకు లోనవుతారు. శాకాహారులలో ఈ లక్షణం కనబడదు. కాబట్టి మాంసాహారంకన్న శాకాహారం ఉత్తమమైన ఆహారంగా చెప్పవచ్చు. మనకు నిజమైన ఆహారం, అనారోగ్యాన్ని కలిగించని పండ్లు, కూరగాయలు, ధాన్యములు మాత్రమే. నూనె పదార్థములు, తీపి, క్రొవ్వు పదార్థములను, మాంసాహారమును తగ్గించడం ఆరోగ్యానికి మంచిది.


                                      ◆నిశ్శబ్ద.