సాధారణంగా వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలతో జలుబు మొదటి స్థానంలో ఉంటుంది. కాస్త చల్లని వాతావరణం ఏర్పడితే చాలు మెల్లగా జలుబు అటాక్ చేస్తుంది. మొదటి దశలోనే దీనికి సరయిన జాగ్రత్తలు తీసుకోకపోతే గొంతు నొప్పి, బ్రాంకైటిస్ మొదలైన శ్వాసనాళ వ్యాధులకి దారి తీయవచ్చు. జలుబు వల్ల ముక్కులోను, శ్వాసనాళంలోను ఇన్ఫ్లమేషన్ ఏర్పడుతుంది. వైరస్ కారణాన, అలర్జీ వల్ల జలుబు రావచ్చు. వైరస్ వల్ల కలిగే జలుబు ముక్కు, గొంతు, నోరు నుంచి బయటికి వెలువడే వాయువుల తుంపర్లు మొదలైన వాటి వల్ల ఒకళ్ళ నుంచి మరొకళ్ళకి వ్యాపిస్తుంది. అందుకని ఎక్కడపడితే అక్కడ చీదడం, ఉమ్మేయడం మంచిది కాదు. దగ్గు వచ్చినప్పుడు నోటికి అడ్డంగా కర్చీఫ్ పెట్టుకోవడం మంచిది. ఇది కనీస సభ్యత, అందరూ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం.
ఒక్కోసారి దుమ్ము, పొగ, కొన్ని వాసనలు మొదలయినవి పడక అలర్జీ వల్ల జలుబు రావచ్చు. ఈ పరిస్థితులకు, పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది.
ముక్కు వెంట కేవలం నీరు మాత్రమే వస్తే పెద్ద భయపడాల్సింది ఏమీ లేదు. ఆ జలుబు ఏ వైరస్ కారణానో వచ్చినట్లు! ఆలర్జీ కలిగినప్పుడు తుమ్ములు, నీళ్ళు కారడం కూడా ఆ పరిస్థితులకు దూరమైనప్పుడు తగ్గిపోతాయి. అలా కాకుండా ముక్కు నుంచి చీము వస్తూ గొంతు బొంగురుపోతే వెంటనే డాక్టర్ కు చూపించాలి. ఇలాంటి సమయంలో కొద్దిపాటి జ్వరము కూడా రావచ్చు. గుండె, శ్వాసకోశ వ్యాధులు ఉన్నప్పుడు జలుబు ప్రమాదకరంగా పరిణమించవచ్చు.
జలుబు జాగ్రత్తలు:-
జలుబు రాగానే బాగా గాలివచ్చే ప్రదేశంలో ఉంటూ పిల్లలకు, వృద్ధులకు దూరంగా ఉండాలి. వైరస్ వల్ల కలిగే జలుబుకి మందులు వాడడం దండగ, దానంతటదే తగ్గుతుంది గాని, మందులవల్ల తగ్గదు. అవి మాత్రమే కాకుండా మరికొన్ని శ్వాసనాళ, శ్వాసకోశ అనారోగ్యాలు కూడా ఎదురవుతాయి.
బ్రాంకైటిస్
తీవ్రమైన బ్రాంకైటిస్ తలనొప్పి, గుండెనొప్పి, కళ్ళె, దగ్గు, లేక పొడిదగ్గు వుంటాయి. దీర్ఘమైన బ్రాంకెటిస్ బాధాకరమైన దగ్గు, కళ్ళె కూడా పడుతుండవచ్చు. ఈ జబ్బు బ్రాంకో న్యుమోనియా వంటి వ్యాధులకూ దారి తీయవచ్చు. అందుకని ఈ పరిస్థితుల్లో డాక్టర్ కు చూపించడం ఎంతో అవసరం. దీనికి మందులు, యాంటీ బయోటిక్స్ డాక్టర్ సలహా మీదే వాడాలి.
బ్రాంక ఎక్టసిస్
శ్వాసనాళాల విస్తరణని బ్రాంక ఎక్టసిస్ అంటారు. క్రిమిదోషాల వల్ల, శ్వాస నాళాంతర పీడన శక్త్యాధిక్యత వల్ల ఈ జబ్బు రావచ్చు. దగ్గు, దుర్గంధముతో కూడిన కళ్ళె పడడం, ఆయాసము, రక్తం వాంతి ఈ వ్యాధి లక్షణాలు, ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కళ్ళె బయటకు పంపడం అవసరం.
ఫెరింజైటిస్
గొంతు ఇన్ఫ్రేమ్ కావడం ఫెరింజైటిస్. జలుబుకి కారణాలే ఇందుకూ కారణం అవుతాయి. మింగడం కష్టమై గొంతు పాడి ఆరిపోవడం, గొంతులో దురద లక్షణాలు బాగా ఎక్కువైతే మ్రింగడం కూడా కష్టమైపోతుంది. నీరసం, జ్వరము వస్తాయి. తడిలో నాసడము. చలిగాలి, శ్వాసకోశమును ఇరిటేట్ చేసే పొగలు పీల్చడం, అతిగా మాట్లాడడం తగ్గించాలి. వెంటనే చికిత్స తీసుకోకపోతే ఈ ఇన్ఫెక్షన్ క్రమంగా శ్వాసకోశానికి వ్యాపించవచ్చు. బ్రేకియా అంటే శ్వాసనాళానికి ఇన్ఫ్లమేషన్ వస్తే 'ట్రాకియైటిస్' అంటారు. వీటన్నింటిలో ధూమపానము ఆపేయాలి. గొంతు నొప్పికి డిప్తీరియా కూడా కారణం కావచ్చు. అందుకని పిల్లలో గొంతు నొప్పి వస్తే వెంటనే డాక్టర్ కు చూపడం మంచిది.
ట్యూబర్క్యులోసిస్ (టి.బి)
ఇది నెమ్మదిగా శ్వాసకోశాన్ని దెబ్బతీస్తుంది. మైకో బాక్టీరియమ్ ట్యుబర్క్యులోసిస్ అనే సూక్ష్మజీవులు గాలిలో నుంచి ఊపిరి తిత్తులలోకి ప్రవేశించడం వల్ల ఈ అనారోగ్యము కల్గుతుంది. లోపలికి వెళ్ళి ఈ సూక్ష్మజీవులు ఆల్వియోలైలని నాశనం చేస్తాయి. కణాలని చంపేస్తాయి. ముందు ఊపిరితిత్తుల పై భాగంలో ఈ వినాశనం చేస్తాయి. చనిపోయిన కణాల భాగాన్ని ట్యూబర్కిల్ అంటారు. ఈ ట్యూబర్కిల్స్ క్రమంగా పెరగడం వల్ల ఊపిరితిత్తుల లోపల ఖాళీలు ఏర్పడతాయి. శ్వాస కష్టమవుతుంది. మొదట్లో పొడిదగ్గు వస్తుంది. తర్వాత కళ్ళె, చివరికి రక్తం పడుతుంది. కొద్దిపాటి జ్వరం ఉంటుంది, ఆకలి వుండదు. బరువు తగ్గుతుంటుంది. ట్యూబర్క్యులోసిస్ వ్యాధిని ఎక్స్ రే, కళ్లె పరీక్షలు, బరువు తగ్గడంతో కనుక్కోవచ్చు. దీన్నే టి.బి అని కూడా అనడం వినే ఉంటాం. ఏడాదిన్నర లేక రెండేళ్లు వాడితే గాని ఈ వ్యాధి నయం కాదు. అనుమానం రాగానే ప్రారంభదశలోనే డాక్టర్ కి చూపించి, సరయిన చికిత్సని పొందడం ముఖ్యం. మెడలో బయటికి వాపు కనిపిస్తూ టి.బి లింఫాడెంటిస్ రావచ్చు. మెదడుకి క్షయ మెనింజైటిస్ రావచ్చు. ఎముకలకి ఆహార నాళానికి కూడా (ట్యూబర్క్యులోసిస్) క్షయ రావచ్చు.
కాబట్టి జలుబే కదా అని నిర్లక్ష్యం చేయకండి.
◆నిశ్శబ్ద.