ఆరోగ్యకరమైన అలవాట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. దీని కోసం చాలామంది ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు చాలా రకాల ఆరోగ్య చిట్కాలు పాటిస్తారు. వీటిలో ఉదయాన్నే వేడి నీరు తాగడం తో మొదలుపెట్టి రాత్రి పడుకునే ముందు ఏదో ఒక పానీయంతో ముగిస్తారు. రాత్రి సమయంలో చాలామంది పసుపు పాలు తాగడం, త్రిఫల జ్యూస్, ఉసిరి జ్యూస్ వంటివి తీసుకుంటారు. ఇవన్నీ జీర్ణశక్తికి, రోగనిరోధక శక్తి పెరగడానికి సహాయపడతాయి. అలాంటి వాటిలో దాల్చిన చెక్క, అల్లం తో తయారు చేసిన టీ కూడా ఒకటి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు అల్లం, దాల్చిన చెక్క కలిపి తయారు చేసిన టీ తాగితే ఏమవుతుందంటే..
దాల్చిన చెక్క, అల్లం రెండూ చాలా ఆహ్లాదకరమైన గుణాలు కలిగి ఉంటాయి. అవి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా శరీరానికి విశ్రాంతి ఇస్తాయి. మంచి నిద్రను ప్రోత్సహిస్తాయి. నిద్రకు ఒక 30 నిమిషాల ముందు ఈ టీని తాగడం వల్ల రాత్రంతా హాయిగా నిద్రపోవచ్చు.
అల్లం జీర్ణశక్తికి పేరుగాంచింది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఇక దాల్చిన చెక్క కూడా అలాగే సహాయపడుతుంది. ఎక్కువగా ఆహారం తీసుకున్నప్పుడు కడుపు భారం తగ్గడానికి, ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. రాత్రి నిద్రకు ముందు తాగితే ఇది ప్రశాంతమైన నిద్రను ప్రోత్సహిస్తుంది.
రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు రాత్రి సమయంలో అల్లం, దాల్చిన చెక్క టీ తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. అల్లంలోనూ, దాల్చిన చెక్కలోనూ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఇన్ప్లమేటరీ గుణాలను కూడా కలిగి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి.
దాల్చిన చెక్క, అల్లం కలిపి తయారు చేసిన టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా దాల్చిన చెక్క మధుమేహం ఉన్నవారికి గొప్ప వరం కంటే తక్కువ కాదు. దీన్ని రోజూ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు చాలా వరకు నియంత్రణలోనే ఉంటాయి. అంతేకాదు ఈ టీని రాత్రి సమయంలో తాగడం వల్ల రాత్రి పూట నిద్ర మధ్యలో ఆకలి వేయడం, రాత్రి సమయంలో బయటి ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్ లాంటివి తినాలనే కోరిక తగ్గుతుంది.
జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యతో బాధపడుతూ ఉంటే దాల్చిన చెక్క, అల్లం కలిపి తయారు చేసిన టీ చాలా బాగా సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో ఈ టీని తాగడం వల్ల చాలా మంచి ఉపశమనం లభిస్తుంది. గొంతు నొప్పి ఉన్నవారికి చాలా రిలాక్స్ గా ఉంటుంది.
ఇప్పటి కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడానికి చాలా చిట్కాలు పాటిస్తూ ఉంటారు. అల్లం, దాల్చిన చెక్క రెండూ జీర్ణక్రియను వేగవంతం చేసేవే. ఈ రెండూ కలిపి తయారు చేసిన టీ తాగితే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కొన్ని రోజులలోనే మార్పు తెలుస్తుంది.
*రూపశ్రీ.