ఎండలో ఎక్కువసేపు ఉంటున్నారా.. చర్మం పై ఎర్రని దద్దుర్లు, మంట పుడుతుందా.. అయితే కాస్త జాగ్రత అంటున్నారు నిపుణులు.  ముఖ్యంగా చర్మ క్యాన్సర్ తో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండేలాని సూచిస్తున్నారు. అంతే కాదు చర్మ సమస్యలతో బాధ పడుతున్న వారు విటమిన్ బి3 ఎక్కువగా తీసుకోవడంతో చర్మ క్యాన్సర్ ను అదుపులో ఉంచుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. అదెలాగో చూద్దాం...

 

సూర్యకాంతి ఆరోగ్యానికి మంచిదే. అలాగని ఎక్కువ సేపు ఎండలో ఉండటం మాత్రం అంత సురక్షితం కాదు. ఎందుకంటే.. సూర్యుడి నుంచి వెలువడే అతి భయానక అల్ట్రా వయోలెట్ (UV) కిరణాల వల్ల చర్మంలోని కణాలు దెబ్బతింటాయి. ఇది కొందరిలో చర్మ క్యాన్సర్‌కు కూడా దారితీస్తుంది. అయితే, తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు ఓ గుడ్ న్యూస్ చెప్పారు.

 

ఇటలీకి చెందిన పరిశోధకులు నాన్-మెలనోమా స్కిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగుల నుంచి సేకరించిన కొన్ని కణాలు (కెరాటినోసైట్స్) ఐసోలేట్ చేశారు. ఈ కణాలకు మూడు రకాల సాంద్రతలతో ట్రీట్మెంట్ చేశారు. నికోటినామైడ్ (NAM), విటమిన్-B3లను అందించి 18 నుంచి 48 గంటలు యూవీబీ కిరణాల ముందు ఉంచారు. ఫలితాల్లో.. యూవీ వికిరణీకరణానికి ముందు 25 మైక్రోన్ల NAMతో ప్రీట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల యూవీ ప్రేరిత ఆక్సీకరణ వల్ల కలిగే ఒత్తిడి, డీఏయే డ్యామేజ్ నుంచి చర్మ కణాలకు రక్షణ లభించింది. ఈ సందర్భంగా రీసెర్చ్ స్టూడెంట్ లారా క్యామిల్లో మాట్లాడుతూ.. విటమిన్ బీ3 వినియోగం పెంచినకొద్ది చర్మం యూవీ కిరణాల వల్ల కలిగే సమస్యలు తగ్గు ముఖం పట్టాయి. అయితే, విటమిన్‌-బీ3 రక్షణ ప్రభావం తక్కువ. కాబట్టి.. సూర్యరశ్మి సోకడానికి 24 లేదా 48 గంటల ముందు తీసుకోకూడదు అని తెలిపారు. ఈ పరిశోధన భవిష్యత్తులో యూవీ క్యాన్సర్‌కు గురయ్యే బాధితులకు ఊరటనిస్తోంది.