వయసు పెరుగుతున్నా కొద్దీ ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. వాటిలో ఎక్కువ శాతం ఇబ్బంది పెట్టే సమస్య కీళ్ల నొప్పులు. పెరిగే వయసుతో పాటు మోకాళ్ళ అరుగుదలా పెరుగుతుంది. అయితే, మోకీళ్లు ఎక్కవ కాలం దృఢంగా ఉండాలంటే శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. బరువు పెరిగే కొద్దీ కీళ్ల మీద ఒత్తిడి పెరిగి, మృదులాస్థి పలుచనై, కీళ్లు ఒకదానికొకటి రాసుకోవడం మొదలవుతుంది. ప్రారంభంలో నొప్పి తగ్గించే మందులు, మృదులాస్థిని పరిరక్షించే మందులు వాడవలసి ఉంటుంది. రెండు, మూడు దశలు దాటి, కీళ్లు ఒరిపిడికి గురయ్యే నాలుగో దశ వచ్చిందంటే మాత్రం మోకాలి మార్పిడి చేయక తప్పదు. కాబట్టి శరీర బరువును అదుపులో ఉంచుకుంటూ మోకాలి కండరాలు, లిగమెంట్లను బలపరిచే క్వాడ్రాసెప్స్, హ్యామ్‌స్ట్రింగ్స్ తరహా వ్యాయామాలు చేస్తూ ఉండాలి.