ఆహారం శరీరానికి శక్తి వనరు.  ఆహారం లేకుండా ఒక పూట,   ఒక రోజు ఉండగలరు.  బలవంతంగా ఉండేవారు మహా అయితే రెండు రోజులు ఉండగలరు. కానీ ఆహారం లేకుండా రోజువారీ కార్యకలాపాలను నిర్వర్తించడం చాలా కష్టం.  శరీరానికి ఆహారం ఎంత అవసరమో.. ఆహారంలో కొన్ని రకాల పదార్థాలు కూడా అంతే అవసరం.  ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు అంటూ లెక్క గట్టేవారు ఫైబర్ గురించి పెద్దగా ఆలోచించరు.  ఆహారంలో పీచు ఎక్కువగా ఉన్న వాటిని తప్పనిసరిగా తీసుకోవాలని ఆహార నిపుణులు చెబుతూ ఉంటారు. అసలు ఆహారంలో పీచు పదార్థాలు ఎందుకు తీసుకోవాలి? ఆహారంలో పీచు పదార్థాలు తీసుకోకపోతే ఏం జరుగుతుంది? పూర్తీగా తెలుసుకుంటే..

ఫైబర్..

శరీరానికి ప్రోటీన్లు, విటమిన్లు,  కార్బోహైడ్రేట్లతో పాటు పీచు కూడా అవసరం.  తిన్న ఆహారం సరిగా జీర్ణం కావడంలోనూ, జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా ఉండటంలోనూ పైబర్ కీలక పాత్ర పోషిస్తుంది.  ఇక ఫైబర్ చాలా మెల్లిగా జీర్ణం అవుతుంది కాబట్టి ఫైబర్ కలిగిన ఆహారం  తీసుకుంటే ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది.  ఇది బరువు తగ్గడానికి, ఆకలి నియంత్రణకు, అతిగా తినే అలవాటుకు చెక్ పెట్టడానికి సహాయపడుతుంది.

ఫైబర్ కోసం పండ్లను నేరుగా తినాలి.  వాటిని జ్యూస్ తీసి అందులో ఉన్న పైబర్ ను చెత్తబుట్ట లో తోయకూడదు.

ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.  పొట్టను శుభ్రం చేస్తుంది.  అదే ఆహారంలో పైబర్ లేకపోతే పొట్ట ఆరోగ్యం, జీర్ణ ఆరోగ్యం దెబ్బ తిని మలబద్దకం సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది.

ప్రతి ఒక్కరికి ప్రేగులలో మంచి గట్ మైక్రోబ్స్ ఉంటాయి.  ఇవి పొట్టను ఆరోగ్యంగా ఉంచుతాయి.  కానీ ఫైబర్ తీసుకోకపోతే ఈ సూక్ష్మజీవుల సంఖ్య తగ్గుతుంది. గట్ ఆరోగ్యం దెబ్బతింటుంది. మంచి బ్యాక్టీరియా తగ్గడం వల్ల ఇన్ఫెక్షన్లు, వాపులు వంటి కడుపు సంబంధిత సమస్యల ప్రమాదం పెరుగుతుంది.

రోజువారీ శరీరానికి అవసరమైనంత ఫైబర్ అందకపోతే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. కొలెస్ట్రాల్ పరిమాణం పెరగడం వల్ల ఊబకాయం వస్తుంది. దీని వల్ల రక్తపోటుకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి.

గుండె జబ్బుల ప్రమాదం పెరగడానికి కూడా పైబర్ లేకపోవడం కారణం అవుతుంది. ఫైబర్ లేకపోతే కొలెస్ట్రాల్ పెరగడం, రక్తపోటు పెరగడం జరిగి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.


                                               *రూపశ్రీ.