ఆయన హస్తవాసి చాలా మంచిది... ఎంత మంచిదీ అంటే... ఆయన చేతిలో ధనరేఖ తరహాలో ‘ప్రాణరేఖ’ లాంటిదేమైనా వుందా అనిపించేంత మంచింది. మరణానికి చేరువలో వున్నవారైనా సరే, ఆయన చేయి పడిందంటే చాలు... కొడిగట్టే దశలో వున్న వారి ప్రాణదీపం దేదీప్యమానంగా వెలుగుతుంది. వైద్యో నారాయణో హరిః అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే డాక్టర్ ఆయన! ఆయన ఎవరో కాదు... ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మన తెలుగుబిడ్డ... డాక్టర్ గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు.
హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో అసోసియేట్ డీన్, సీనియర్ ప్రొఫెసర్ స్థానంలో వుండటంతోపాటు సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్‌మెంట్‌కి హెడ్‌గా కూడా విధులు నిర్వహిస్తున్న ఆయన ఎంతోమంది కేన్సర్ వ్యాధిగ్రస్తుల జీవితాలలో కాంతి నింపారు. ప్రపంచమంతా కేన్సర్ వ్యాధిని చూసి భయపడుతుంది. అతిశయోక్తి అనిపించినా నిజం ఏమిటంటే.... డాక్టర్ సూర్యనారాయణరాజును చూస్తే కేన్సర్ వ్యాధి భయపడుతుంది. పేషెంట్ మీద ఆయన చెయ్యి పడిందంటే చాలు కేన్సర్ మహమ్మారి పేషెంటును వదిలి పారిపోతుంది. కేన్సర్ వ్యాధి నివారణకు ఆయన చేస్తున్న కృషి అనన్య సామానమైనది. 1998 నుంచి 2014 సంవత్సరం వరకు ఆయన 1,42,692 మంది కేన్సర్ ఔట్ పేషెంట్లను ట్రీట్ చేశారు. 29,808 మంది కేన్సర్ పేషెంట్లకు సర్జరీ నిర్వహించారు. ఆయన సర్జరీ చేసిన పెషెంట్లలో దాదాపు 98 శాతం మంది పేషెంట్లు కొత్త జీవితాన్ని పొందారు..
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన జి.సూర్యనారాయణరాజు చిన్నప్పటి నుంచీ చదువులో నంబర్‌వన్. డాక్టర్ కావాలని, ప్రజలకు సేవ చేయాలన్నదే ఆయనకు బాల్యం నుంచీ వున్న యాంబిషన్. తాను కోరుకున్నట్టుగానే డాక్టర్ అయిన ఆయన కెరీర్‌లో ఎన్నెన్నో మైలురాళ్ళు. ఎన్నెన్నో విజయాలు. 1992 సంవత్సరం నుంచి హైదరాబాద్‌లో నిమ్స్‌లో డాక్టర్‌గా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. అప్పటి నుంచీ ఎన్నో విజయాలు సాధిస్తూ ఆయన ముందడుగు వేశారు. ఒక డాక్టర్‌గా ఆయన నిర్వహించిన పదవులను, ఆయన చదివిన చదువులను, ఆయన అధిరోహించిన విజయ శిఖరాలను, అందుకున్న కీర్తి కిరీటాలను ప్రస్తావించాలంటే పెద్ద గ్రంథం రాయాల్సి వుంటుంది. ఎన్ని విజయాలు సాధించినా, మృత్యుముఖంలో వున్న ఒక రోగిలో ప్రాణ దీపం వెలిగించినప్పుడు ఆ వ్యక్తిలో, వారి కుటుంబ సభ్యుల్లో కనిపించే ఆనందాన్ని చూడటమే తనకు గొప్ప విజయంగా అనిపిస్తూ వుంటుందని డాక్టర్ సూర్యనారాయణ రాజు చెబుతారు. జననీ జన్మభూమిశ్చ... స్వర్గాదపీ గరీయసీ అంటారు... అందుకే డాక్టర్ రాజు గారు తన జన్మభూమికి తనవంతు సేవ చేస్తుంటారు. హైదరాబాద్‌లో డాక్టర్‌గా ఊపిరిసలపనంత బిజీగా వున్నప్పటికీ, తన స్వస్థలమైన ఆకివీడులో ప్రతినెల మొదటి ఆదివారం నాడు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ వుంటారు. ఆ ఒక్కరోజే ఆయన దాదాపు రెండు వందల మంది పేషెంట్లను చూస్తారు.
భగవంతుడు మనకు ప్రత్యక్షంగా కనిపించడు... జన్మనిచ్చిన అమ్మ రూపంలో, ప్రాణం పోసే వైద్యుడి రూపంలో మనకు కనిపిస్తూ వుంటాడు. అలాంటి భగవంతుడి స్వరూపమైన వైద్య వృత్తిలో నిర్విరామంగా కృషి చేస్తూ వేలాదిమంది జీవితాలలో సంతోషాన్ని నింపిన డాక్టర్ జి.సూర్యనారాయణరాజు తన కెరీర్‌లో వ్యక్తిగత జీవితంలో మరిన్ని విజయాలను అందుకోవాలని ‘తెలుగువన్’ కోరుకుంటోంది.