శరీరానికి అన్ని రకాల ప్రోటీన్లు, విటమిన్లు అవసరం అవుతాయి. ఏ ఒక్కటి లోపించినా శరీర పనితీరు దెబ్బతింటుంది. ముఖ్యంగా శరీరంలో కొన్ని రకాల విటమిన్లు లోపించడం వల్ల శరీరానికి చాలా పెద్ద నష్టం వాటిల్లుతుంది. ఈ లోపం దీర్ఘకాలం కొనసాగితే శరీరానికి పూడ్చలేని నష్టం జరుగుతుంది. ముఖ్యంగా చాలా అరుదుగానూ, మాంసాహారంలోనూ లభించే పోషకాల వల్ల శాకాహారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటారు. అలాంటి వాటిలో విటమిన్-బి12 లోపం కూడా ఒకటి. విటమిన్-బి12 మాంసాహారంలోనూ, కొన్ని శాకాహార ఆహారాలలోనూ మాత్రమే లభిస్తుంది. ఈ కారణంగా విటమిన్-బి12 కేసులు శాకాహారులలో ఎక్కువగా ఉంటాయ. అసలు విటమిన్-బి12 లోపిస్తే జరిగేదేంటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ సమస్యను అధిగమించాలంటే ఏ ఆహారం తీసుకోవాలి? పూర్తీగా తెలుసుకుంటే..
లక్షణాలు..
శరీరంలో విటమిన్-బి12 లోపిస్తే కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. వాటిలో అలసట,, బలహీనత, కళ్ళు తిరగడం, జ్ఞాపకశక్తి, రక్తహీనత వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా విటమిన్-బి12 శరీరంలో రోగనిరోధక శక్తిని ఆరోగ్యంగా ఉంచుతుంది, కొత్త ఎర్ర రక్తకణాలు అభివృద్ది చేయడంలో సహాయపడుతుంది. కానీ విటమిన్-బి12 లోపం వల్ల రక్తహీనత ఎక్కువ అవుతుంది. విటమిన్-బి12 భర్తీ కావాలంటే ఏం తినాలంటే..
పాలు, పాల ఉత్పత్తులలో విటమిన్-బి12 పుష్కలంగా ఉంటుంది. మాంసాహారంలో కూడా విటమిన్-బి12 ఉంటుంది. శాకాహారం తీసుకునేవారు విటమిన్-బి12 భర్తీ కావాలంటే పాలు, పాల ఉత్పత్తులు అయిన పాలు, పెరుగు, చీజ్, పనీర్ వంటివి పుష్కలంగా తీసుకోవాలి.
మాంసాహారులు అయితే విటమిన్-బి12 లోపాన్ని చాలా తొందరగా అధిగమించడానికి చికెన్, టర్కీ కోడి మొదలైనవి ఆహారంలో తీసుకోవచ్చు.
చేపలలో విటమిన్-బి12 సమృద్దిగా ఉంటుంది. చేపలతో చేసిన వంటకాలు తీసుకోవడం వల్ల విటమిన్-బి12 లోపాన్ని అధిగమించవచ్చు. వైద్యుల సూచన మేరకు చేప సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు.
గుడ్లలో పెద్ద మొత్తంలో విటమిన్-బి12 ఉంటుంది. రోజూ ఒక ఉడికించిన గుడ్డును తీసుకుంటూ ఉంటే విటమిన్-బి12 లోపాన్ని అధిగమించవచ్చు. లేదంటే గుడ్డుతో ఆరోగ్యకరమైన పద్దతిలో ఆమ్లెట్ వంటి వంటకాలు కూడా తయారుచేసుకుని తినవచ్చు. కానీ ఉడికించిన గుడ్లే శ్రేష్టం.
మాంసాహారులు అయితే విటమిన్-బి12 లోపాన్ని అధిగమించడానికి రెడ్ మీట్ కూడా తీసుకోవచ్చు. ఇందులో విటమిన్-బి12 పుష్కలంగా ఉంటుంది.
*రూపశ్రీ.