సైనస్ ఇన్ఫెక్షన్లు  ఫ్లూ,  జలుబు వంటి అంతర్లీన అనారోగ్యాల ద్వారా తరచుగా వస్తుంటాయి. ఇవి సాధారణంగా ఒక వారం లేదా అంతకుముందే తగ్గిపోయినప్పటికీ కొంతమందికి  సైనస్ సమస్యలు చాలారోజుల పాటూ ఉంటాయి.  ఇలా ఉంటే  దీర్ఘకాలిక సైనసైటిస్ ఉందని అర్థం. ఇలాంటి పరిస్థితి ఉంటే మాత్రం సైనస్ నిపుణుడిని తక్షణమే సంప్రదించడం అత్యవసరం. సైనస్ సమస్య ఉన్నవారిలో ఈ సమస్యను మరింత దారుణంగా మార్చే సాధారణ మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుని వాటికి తగిన చర్యలు తీసుకోవడం వల్ల సైనస్ సమస్య ప్రభావాన్నిచాలా వరకు తగ్గించవచ్చు.

సైనస్ ఇన్ఫెక్షన్లను తీవ్రతరం చేసే సాధారణ తప్పులు..

హ్యూమిడిఫైయర్ ఉపయోగించకపోవడం..

గాలి పొడిగా మారినప్పుడు చలి కాలంలో సైనస్ ఇన్ఫెక్షన్లు ఎక్కువ అవుతాయి. శీతాకాలపు చలి,  పొడి పరిస్థితులు చర్మాన్ని ప్రభావితం చేయడమే కాకుండా నాసికా రంధ్రాలు పొడిబారడానికి దారితీస్తుంది.  దీనిని పరిష్కరించడానికి గాలికి తేమను జోడించడం అవసరం. దీనికోసం  హ్యూమిడిఫైయర్ లేదా ఆవిరి పట్టడం వంటివి  చేయాలి.  ఇది  సైనస్‌లు ఎక్కువ పొడిగా,  చికాకుగా మారకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.

నాసల్ స్ప్రే ఎక్కువ వినియోగించడం..

చాలామంది మూసుకుపోయిన ముక్కులనుండి ఉపశమనం పొందడానికి నాసల్ స్ప్రేలు ఉపయోగిస్తారు. ఇవి సైనస్ ఇన్ఫెక్షన్ ఒత్తిడి నుండి తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తాయి. ఎక్కువరోజులు అవగాహన లేకుండా తక్షణమే రిలీఫ్ లభిస్తోంది కదా అని వాటిని ఎక్కువ ఉపయోగిస్తే..  ప్రతికూల ప్రభావాలు తప్పవు. ఈ స్ప్రేలలోని ప్రధాన రసాయనం సైనస్ ఇన్ఫెక్షన్‌లను మరింత తీవ్రతరం చేయడానికి దోహదం చేస్తుంది.  సైనస్ ఇన్ఫెక్షన్ ఒక వారం దాటితే దాన్ని తగ్గించుకోవడానికి  ENT నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.

నిద్ర లేకపోవడం..

పుష్కలమైన నిద్ర మొత్తం శరీర ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ముఖ్యంగా సైనస్ ఇన్ఫెక్షన్‌తో ఇబ్బంది పడుతున్నప్పుడు కనీసం ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోవడం వల్ల  రోగనిరోధక వ్యవస్థ ఇన్‌ఫెక్షన్‌కి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో సపోర్ట్  ఇస్తుంది. అంతేకాకుండా పగటిపూట విశ్రాంతి తీసుకోవడం,  శక్తిని ఆదా చేయడం సైనస్ ఇన్ఫెక్షన్ల నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది.

హైడ్రేటెడ్ గా ఉండకపోవడం..

సైనస్ ఇన్ఫెక్షన్‌తో ఇబ్బంది పడేటప్పుడు  బాగా హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం.  నీటిని ఎక్కువగా  తీసుకోవడం వల్ల శ్లేష్మం ఉత్పత్తికి తోడ్పడుతుంది. శ్లేష్మం సన్నగా, సులభంగా బయటకు వెళ్లేలా చేయడంలో సహాయపడుతుంది. సైనస్ ఇన్ఫెక్షన్ సమయంలో సరైన ఆర్ద్రీకరణ రద్దీని తగ్గించడానికి,  మెరుగైన శ్వాసను సులభతరం చేయడానికి దోహదం చేస్తుంది.

                                      *నిశ్శబ్ద.